ముట్టడించేందుకు దూసుకొచ్చిన వందలాది మంది ఆందోళనకారులు
భారతవ్యతిరేక నినాదాలిచ్చిన నిరసనకారులు
బంగ్లాదేశ్ దౌత్యవేత్తను పిలిపించి అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందన్న అక్కసుతో, ఆమెను తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ అనుకూల ఆందోళనకారులు బుధవారం పేట్రేగిపోయారు. ఢాకాలోని ఇండియన్ భారత హైకమిషన్‌ను ముట్టడించేందుకు వందలాది మంది ర్యాలీగా వచ్చారు. బ్యారీకేడ్లను ఏర్పాటుచేసినా వాటిని ధ్వంసంచేసుకుంటూ నిరసకారులు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
జూలై ఐక్యత బ్యానర్ పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు. భారత్‌కు పారిపోయిన హసీనా, ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులను తిరిగి అప్పగించాలని డిమాండ్‌చేశారు. ‘‘ మేం ఇండియన్ హైకమిషన్‌పై దాడిచేయబోం.కానీ పరోక్షంగా మా దేశాన్ని ఆధిపత్యం చెలాయించేందకు యతి్నస్తే చూస్తూ ఊరుకోం’’ అని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనూహ్య ఘటనతో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదులాల్‌హ్‌ను తన కార్యాలయానికి తక్షణం రావాలంటూ ఆయనకు భారతవిదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. ఆఫీస్‌కు వచ్చిన రియాజ్‌పై మోదీ సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ‘‘ ఇటీవలకాలంలో బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. భారత వ్యతిరేక పుకార్లు షికార్లుచేస్తున్నాయి. ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. బెదిరింపుల వంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, పత్రాలనూ మాతో పంచుకోవట్లేదు’’ అని ఆయనతో కేంద్రప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తంచేసింది.
భారత వీసా కేంద్రం మూసివేత
పరిస్థితులు అదుపు తప్పొచ్చనే అంచనాతో ముందస్తు చర్యగా ఢాకాలోని భారత వీసా జారీ కేంద్రాన్ని మోదీ సర్కార్ మూసేసింది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఈ ‘ది ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్(ఐవీఏసీ)’ ఉంది. ఢాకాలోని అన్ని భారతీయ వీసా సేవా సెంటర్లకు ఇదే సమీకృత కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన వీసాల దరఖాస్తుల పరిశీలనను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఐవీఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది.


