భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టి20 రద్దు
పొగమంచు కారణంగా పడని టాస్
గాయంతో సిరీస్ నుంచి గిల్ అవుట్
రేపు అహ్మదాబాద్‌లో ఆఖరి టి20
వర్షం కారణంగా... మైదానం చిత్తడిగా ఉండటం మూలంగా... ప్రమాదకర పిచ్‌లు రూపొందించినందుకు... తమ జట్ల పేలవ ప్రదర్శనకు నిరసనగా అభిమానుల ఆగ్రహాంతో... అంతర్జాతీయ క్రికెట్‌లో అర్ధంతరంగా మ్యాచ్‌లు రద్దయిన సంఘటనలు చూశాం. కానీ బుధవారం భారత్–దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన టి20 మ్యాచ్‌కు పైవేవీ ఆటంకం కలిగించలేదు. ఊహించని విధంగా మితిమీరిన పొగమంచు అడ్డంకిలా మారింది. దాంతో కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ నెగ్గాలంటే రేపు అహ్మదాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్‌లో భారత్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లక్నో: ఇక ఈ టి20 సిరీస్ భారత్ గెలవొచ్చు. లేదంటే పర్యాటక దక్షిణాఫ్రికాతో పంచుకోవచ్చు. ఎందుకంటే ఆఖరి పోరులో గెలిస్తే సిరీస్ 3–1తో టీమిండియా వశమవుతుంది. కానీ ఓడితే 2–2తో సమమవుతుంది. మొత్తానికి పొగమంచు సిరీస్ ఫలితాన్ని సైతం అటుఇటూ కాకుండా చేసేసింది. బుధవారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడి ఎకానా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ రద్దయ్యింది.
పొగమంచు, ప్రతికూల వాతావరణం మ్యాచ్‌కు అవరోధంగా నిలిచింది. మొదట టాస్ ఆలస్యం అని టీవీల్లో బోర్డు కనిపించింది. సమయం గడుస్తున్నకొద్దీ ఫీల్డ్ అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్ పండిట్‌లు మ్యాచ్ నిర్వహణ కోసం మైదానాన్ని, మంచు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. కనీసం 6 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించాలని వేచి చూశారు. చివరకు రాత్రి 9 గంటల 25 నిమిషాలకు ఆరోసారి మైదానాన్ని సమీక్షించి మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడదని ప్రకటించారు.
మంచు దుప్పటి కప్పేసింది!
భారత్‌లో శీతాకాలం సీజన్ ఇది. పైగా డిసెంబర్ మధ్య నుంచి జనవరి అసాంతం చలి పులిలా పంజా విసురుతుంది. ఇక ఉత్తర భారతమైతే సూర్యుడు ఉదయించాక కూడా వణుకు తప్పదు. ఉదయం, రాత్రి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. పొగమంచు కమ్ముతుంది. కంటికేది కనిపించదు. బుధవారం రాత్రి కూడా సరిగ్గా ఇదే జరిగింది. గరం గరం చేసే హైమాస్ట్ ఫ్లడ్‌లైట్లు అన్నీ వెలిగించినా కూడా మంచుదుప్పటి ముందు ఆ వెలుగు కూడా దిగదుడుపే అయ్యింది.

పొగమంచు మ్యాచ్ జరగకుండా మైదానాన్ని కప్పేయడంతో ఫీల్డు అంపైర్లు పలుమార్లు సమీక్షించి మ్యాచ్ రద్దుకు నిర్ణయించారు. చివరిసారిగా రాత్రి 9.25 గంటలకు మైదానంలోని పరిస్థితిని సమీక్షించాక ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేదని ఫీల్డ్ అంపైర్లు తేల్చారు.
ఇంతటి చలిని లెక్కచేయకుండా, మంచు కురిసే వేళలో మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్న ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్న అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్‌లు ఆలస్యం చేయకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు జెండాలు, అభిమాన క్రికెటర్ల ఫొటోలు, 4, 6 బోర్డులను ఊపుతూ ఉత్సాహంగా కనిపించిన ప్రేక్షకులు నిరాశగా వెనుదిరగడం మొదలు పెట్టారు.
గిల్ అవుట్
భారత టెస్టు, వన్డేల కెపె్టన్ శుబ్‌మన్ గిల్ కూడా ప్రస్తుత సిరీస్‌కు దూరమయ్యాడు. అసలే ఈ ఓపెనర్ ఫామ్‌లేమీతో తంటాలు పడుతున్నాడు. ట్రెయినింగ్ సెషన్‌లో అతని బొటనవేలికి గాయమైంది. దీంతో ఈ నాలుగో టి20తో పాటు రేపు అహ్మదాబాద్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌కూ అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో సంజూ సామ్సన్ బరిలోకి దిగుతాడు. ఇప్పటికే పేస్ ఎక్స్‌ప్రెస్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం ఈ సిరీస్‌కు దూరమమైన సంగతి తెలిసిందే.
టిక్కెట్ల డబ్బులు తిరిగి చెల్లింపు
మ్యాచ్ మొదలవకుండానే రద్దయ్యింది. కనీసం టాస్‌కు కూడా నోచుకోలేదు. దీంతో నిబంధనల ప్రకారం టిక్కెట్లకు ప్రేక్షకులు వెచ్చించిన రుసుమును తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తామని స్టేడియం వర్గాలు వెల్లడించాయి.


