బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu) నుంచి 8వ వారంలో మాధురి ( Madhuri) ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అందరికంటే ఆమెకు తక్కువ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నామినేషన్స్‌లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. అయితే, వీరిలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్ మధ్య లాస్ట్ వరకు గట్టి పోటీ నెలకొంది.. కానీ, ఫైనల్‌గా మాధురి ఎలిమినేట్ అయ్యారు. అయితే, బిగ్‌బాస్ నుంచి మాధురికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.
సేవా కార్యక్రమాలకు రెమ్యునరేషన్
బిగ్ బాస్ హౌస్‌లో మాధురి కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. కానీ, చాలా బలంగానే తన మార్క్ వేశారు. అసలైన ఫైర్ బ్రాండ్‌గా హౌస్లో పేరు పొందారు. తన మాటలతో పాటు ఆటలోనూ సత్తా చాటారు. మాధురికి ఉన్న ఇమేజ్ వల్ల బిగ్‌బాస్ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాలకే రూ. 9 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఆమె నిలిచారు. అయితే, ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు. వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించారు.
మాధురికి హౌస్లోకి వెళ్లక ముందే చాలా ట్రోలింగ్కు గురయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉండటంతో నెటిజన్లు ఆమెను ఇష్టపడలేదు. ఆమెను ఎందుకు సెలక్ట్ చేశారంటూ బిగ్‌బాస్ టీమ్‌ను కూడా తప్పుబట్టారు. అయితే, హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా ముక్కుసూటి మనిషి అంటూ చాలామంది కామెంట్లు చేయడం విశేషం. తనకు అనిపించిన విషయం ఏదైనా సరే బహిరంగంగానే చెబుతారని పేరు పొందారు. తన గేమ్‌లో ఎప్పుడూ కూడా నిజాయితీ కోల్పోలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలిపారు.
సోషల్ మీడియాలో ఆమె పట్ల మిశ్రమ స్పందనలు కూడా కనిపించాయి. ఆమె నిజాయితీకి, ధైర్యానికి కొందరు మద్దతు ఇస్తే.. మరికొందరు ఆమె అగ్రెసివ్ తీరు వల్లే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. విపరీతమైన నెగటివిటీతో హౌస్లోకి అడుగుపెట్టిన మాధురి.. బిగ్‌బాస్ షో వల్ల దానిని కాస్త తగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఈ సీజన్లో చాలా పాపులర్ కంటెస్టెంట్గా మాధురి పేరు ఎప్పటికీ ఉండిపోయేలా తన గేమ్తో చూపించారని ఎక్కువ మంది చెప్పడం విశేషం.

నాకు ముందే తెలుసు: మాధురి
హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతానని తాను ముందే అనుకున్నట్లు స్టేజీపై నాగార్జునతో మాధురి పంచుకున్నారు. నవంబరు 4 తన భర్త పుట్టినరోజు కాబటటఇ ఆయన వద్ద ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే, తనకు బిగ్‌బాస్ ఎంతో నేర్పిందని మాధురి పేర్కొన్నారు. హౌస్లో తనకు తనూజ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆమె చాలా స్వీట్ అంటూ కితాబు ఇచ్చారు. తనూజ సీరియల్‌లో చేసినట్లు నటిస్తోందని అందరూ అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తరువాత కల్యాణ్ ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయతీగా ఆడుతున్నాడని చెప్పిన మాధురి.. డిమోన్ పవన్ కూడా చాలా స్వీట్ అంటూనే మంచి అబ్బాయని పేర్కొన్నారు. హౌస్‌లో 100శాతం ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి మాత్రమేనని చివరిగా తెలిపారు.


