మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్‌ | Actor Sobhan Babu Grandson Dr Surakshith Battina Speech | Sakshi
Sakshi News home page

మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్‌

Dec 20 2025 3:20 AM | Updated on Dec 20 2025 3:20 AM

Actor Sobhan Babu Grandson Dr Surakshith Battina Speech

‘సోగ్గాడు’ స్వర్ణోత్సవంలో శోభన్‌బాబు మనవళ్లు సౌరభ్, సురక్షిత్‌ల సమక్షంలో పి. సుశీలకు సత్కారం

‘‘అందరికీ మా తాతగారు ‘సోగ్గాడు’గా తెలుసు. కానీ నాకు అంతకన్నా ఎక్కువ. ఆయన ఎంత సక్సెస్‌ అయినా ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌కి టైమ్‌ కేటాయించారు’’ అని ప్రముఖ నటుడు శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్‌ పేర్కొన్నారు. శోభన్‌బాబు హీరోగా నటించిన ‘సోగ్గాడు’ సినిమా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రనిర్మాణ సంస్థ సురేష్‌ ప్రోడక్షన్స్‌ డి. సురేష్‌బాబు, అభిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్వర్ణోత్సవం’ జరిగింది. ఈ వేదికపై డా. సురక్షిత్‌ ఇంకా మాట్లాడుతూ – ‘‘సోగ్గాడు’ తీసినందుకు సురేష్‌బాబుగారికి, ఆయన ఫ్యామిలీకి అభినందనలు.

యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్నిబట్టి ‘లెజెండ్స్‌ మన మనసులను ఎప్పుడూ వదిలి వెళ్లరు’ అని అర్థమవుతోంది. వాళ్లపట్ల మనం చూపించే ప్రేమే ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ‘నేనింత కష్టపడ్డాను...అంత కష్టపడ్డాను’ అని మా తాతగారు ఎప్పుడూ చెప్పలేదు. కానీ మనందరికీ తెలుసు ఎంత కష్టపడ్డారో. చెన్నైలో మండుటెండల్లో సైకిలు మీద ఇంటి నుంచి స్టూడియోలకు వెళ్లడం అలా కష్టపడ్డారు. కానీ ఆ కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. అయితే ఫ్యామిలీలో ఎవర్నీ సినిమాల్లోకి వెళ్లమని ఫోర్స్‌ చేయలేదు. ఎవరికి నచ్చింది వారిని చెయ్యమన్నారు. అందుకే నేను మెడిసిన్‌ చేశాను. ఇవాళ తాతగారిని చాలా మిస్సవుతున్నాను.

ఎందుకంటే నేను సాధించినవి ఆయన చూడలేదని, ఈ యాభై ఏళ్ల సంబరాలను చూడ్డానికి లేరనే వెలితి ఉంది. ఆయన లెగసీని జ్ఞాపకాల్లో ఉంచుకోవడం మాత్రమే కాదు... నా సేవల ద్వారా కాపాడుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. 

డి. సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘మాకు ఎంతో ముఖ్యమైన ‘సోగ్గాడు’ చిత్రంలో భాగమైన శోభన్‌బాబు, రైటర్‌ బాలమురుగన్, విన్సెంట్‌గార్లు... ఇలా కొంతమంది ఇప్పుడు లేరు. సురేష్‌ప్రోడక్షన్స్‌ సంస్థ రీ స్టార్ట్‌ చేసిన సినిమా ఇది. 1975లో నాన్నగారు సురేష్‌ప్రోడక్షన్స్‌ సంస్థ పెట్టి, ఈ సినిమా తీశారు. ఆ రోజుల్లో ‘సోగ్గాడు’ ఇండస్ట్రీ రికార్డ్స్‌ను ఈజీగా కొట్టిందనుకుంటున్నాను. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల చూశాను.

జయచిత్ర, జయసుధగార్లు బాగా నటించారు. సోగ్గాడు పాత్రని శోభన్‌బాబుగారు నిజాయితీగా చేయడంవల్లే ఆయన కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ వేడుకలో సుమలత, బేబీ రాణి, రోజా రమణి, వై. విజయగార్లు... ఇలా అందర్నీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇందాక పి. సుశీలగారు పాడుతున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడూ ఆమె పాటలు పాడుతున్నారు. కళ, పాటల విలువ మరోసారి తెలుస్తోంది’’ అని చెప్పారు. 

పి. సుశీల మాట్లాడుతూ– ‘‘యాభై ఏళ్ల పండగ ఇది. సురేష్‌ప్రోడక్షన్స్‌ సంస్థ ఎంత పెద్ద పేరు సంపాదించిందో అందరికీ తెలుసు’’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా, జోరు మీద ఉన్నావు తుమ్మెదా, రాజువయ్యా...’ తదితర పాటలను హమ్‌ చేశారు.  

అట్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ– ‘‘శోభన్‌బాబుతో తొమ్మిది సినిమాలు నిర్మించా. ఆయన నటుడు, హీరో కన్నా సినీ  ఇండస్ట్రీకి ఆర్థిక మంత్రి అనిపించుకున్న వ్యక్తి. ఇంత వస్తే అంత అని లెక్కలు వేసుకునేవారు. రాజకీయాల్లోకి వెళ్లి, ఆర్థికమంత్రి అయ్యింటే బాగుండేదని ఆయనతో అనేవాడిని’’ అని తెలిపారు. 

జయసుధ మాట్లాడుతూ– ‘‘శోభన్‌బాబుగారితో నేను 38 సినిమాలు చేశాను. ఆయనతో నా జర్నీని ఓ పుస్తకంగా రాయవచ్చు’’ అని అన్నారు. ఈ వేడుకలో పి. సుశీల తదితరులను సత్కరించారు. రచయిత, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేశ్‌బాబు, దర్శక–నిర్మాతలు రేలంగి నరసింహారావు, కేఎస్‌ రామారావు, కేవీ సత్యనారాయణ, అశోక్‌కుమార్, రాజు, రామసత్యనారాయణ, నటుడు రఘుబాబు, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి గౌరవ అధ్యక్షుడు నరసింహారావు, చైర్మన్‌ సుధాకర్, కన్వీనర్‌ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, భట్టి్రపోలు శ్రీనివాస్, వీరప్రసాద్, విజయ్‌ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్‌బాబు ఫ్యాన్స్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement