యాసలందు అన్నియాసలూ భేషు | Upcoming Telugu movie updatesUpcoming Telugu movie updates | Sakshi
Sakshi News home page

యాసలందు అన్నియాసలూ భేషు

Feb 4 2026 2:56 AM | Updated on Feb 4 2026 2:56 AM

Upcoming Telugu movie updatesUpcoming Telugu movie updates

రోల్‌ డిమాండ్‌ చేస్తే నోరు తిరగని యాస నేర్చుకుని మరీ డైలాగులు చెప్పేస్తారు స్టార్స్‌. రామ్‌చరణ్‌ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. అఖిల్, వరుణ్‌ తేజ్‌ రాయలసీమలో సంభాషణలు చెప్పారు. విజయ్‌ దేవరకొండ అయితే ఈస్ట్‌ గోదావరి, రాయలసీమ యాసలు నేర్చుకున్నారు. హీరోలేనా? హీరోయిన్‌ కావ్యా థాపర్‌ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఈ యాస నేర్చుకుని మరీ తెలంగాణ అమ్మాయిలా మారిపోయారు. ‘యాసలందు అన్ని యాసలూ భేషు’ అన్నట్లుగా ఈ స్టార్స్‌ ఏయే సినిమాల్లో ఏయే యాసలో మాట్లాడారో తెలుసుకుందాం

సేసేయాల... 
‘ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేలమీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్‌చరణ్‌ పలికిన సంభాషణలకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ఇక, థియేటర్లో వింటున్నప్పుడు ఈలలు, గోలలు పక్కా. ‘పెద్ది’ సినిమాలో చేస్తున్నప్పాత్రకి అనుగుణంగా రామ్‌చరణ్‌ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. గుబురు గడ్డం, ఒత్తయిన జుట్టు, మాస్‌ లుక్‌తో రామ్‌చరణ్‌ హీరోగా ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరో యిన్‌గా నటిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు  నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్‌ కానుంది.

సామి సాచ్చిగా...
‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా..’ అంటూ వరుణ్‌ తేజ్‌ తన కెరీర్‌లోని 15వ సినిమాను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఇటీవల టైటిల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో కనకరాజుప్పాత్రలో నటిస్తున్నారు వరుణ్‌ తేజ్‌. ఈ చిత్రం రాయలసీమలోని అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెబుతున్నారు వరుణ్‌ తేజ్‌. రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ప్రధానప్పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల  కానుంది. ఇండో–కొరియన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్‌ కామెడీ సినిమా ఇది. 
   
ఈస్ట్‌ గోదావరి... రాయలసీమ 
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పీరియాడికల్‌ చిత్రాలే. ‘రణబాలి’ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెబుతున్న విజయ్‌ దేవరకొండ, ‘రౌడీ జనార్ధన’ చిత్రం కోసం ఈస్ట్‌ గోదావరి యాసలో డైలాగ్స్‌ చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు భిన్నమైన యాసలతో కూడిన క్యారెక్టర్స్‌లో విజయ్‌ దేవరకొండ నటిస్తుండటం విశేషం. 

రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ చేస్తున్న సినిమా ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఆర్నాల్డ్‌ వోస్లూ కీలకప్పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టీ సిరీస్‌ ఫిలింస్‌ సమర్పణలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇక విజయ్‌ దేవరకొండ హీరోగా రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్‌ యాక్షన్‌ డ్రామా ‘రౌడీ జనార్ధన’. 1980 దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. 

ఏంది మీ లొల్లి...
‘పండగ పూట మా బాబుకి బియ్యమిచ్చి నాలుగు ముక్కలు తిందమంటే ఏంది మీ లొల్లి..., ఏయ్‌ పండగ కాబట్టే కక్క ముక్క వండినం... చెప్పురంకుల్‌’ అంటూ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు కావ్యా థాపర్‌. ‘నేను రెడీ’ చిత్రం కోసమే కావ్య ఇలా తెలంగాణ మాట్లాడటానికి రెడీ అయ్యారు. ‘నువ్విలా, జీనియస్, రామ్‌ లీలా, సెవెన్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్యా థాపర్‌ కథానాయికగా నటిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘నేను రెడీ’ వేసవిలో రిలీజ్‌ కానుంది. 

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ ‘లెనిన్‌’ కోసం అక్కినేని అఖిల్‌ రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెబుతున్నారు. ఈ సినిమా ప్రధాన కథనం రాయలసీమ ్రపాంతంలోని చిత్తూరు నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్‌ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. ఇంకా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండ ఈతూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోన్నించి వస్తాది’ అంటూ రాయలసీమ యాసలో సాయిధరమ్‌ తేజ్‌ సంభాషణలు పలికారు. 

ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూటెడ్‌ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారట దేవిశ్రీ ప్రసాద్‌. అలాగే ‘డెకాయిట్‌’ సినిమా కోసం అడివి శేష్‌ రాయలసీమ యాసలో,  ‘భోగి’ సినిమా కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, ‘క్రేజీ కల్యాణం’ కోసం అనుపమా పరమేశ్వరన్‌ తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెబుతున్నట్లుగా తెలిసింది. వీరే కాదు... తమ కొత్త సినిమాల కోసం విభిన్న యాసల్లో డైలాగ్స్‌ చెబుతున్న నటీనటులు మరికొంతమంది ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement