బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్‌ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు.
ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్‌కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్‌లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.


