breaking news
Dialect
-
యాసలందు అన్నియాసలూ భేషు
రోల్ డిమాండ్ చేస్తే నోరు తిరగని యాస నేర్చుకుని మరీ డైలాగులు చెప్పేస్తారు స్టార్స్. రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. అఖిల్, వరుణ్ తేజ్ రాయలసీమలో సంభాషణలు చెప్పారు. విజయ్ దేవరకొండ అయితే ఈస్ట్ గోదావరి, రాయలసీమ యాసలు నేర్చుకున్నారు. హీరోలేనా? హీరోయిన్ కావ్యా థాపర్ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఈ యాస నేర్చుకుని మరీ తెలంగాణ అమ్మాయిలా మారిపోయారు. ‘యాసలందు అన్ని యాసలూ భేషు’ అన్నట్లుగా ఈ స్టార్స్ ఏయే సినిమాల్లో ఏయే యాసలో మాట్లాడారో తెలుసుకుందాంసేసేయాల... ‘ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేలమీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్‌చరణ్ పలికిన సంభాషణలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక, థియేటర్లో వింటున్నప్పుడు ఈలలు, గోలలు పక్కా. ‘పెద్ది’ సినిమాలో చేస్తున్నప్పాత్రకి అనుగుణంగా రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. గుబురు గడ్డం, ఒత్తయిన జుట్టు, మాస్ లుక్‌తో రామ్‌చరణ్ హీరోగా ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరో యిన్‌గా నటిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది.సామి సాచ్చిగా...‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా..’ అంటూ వరుణ్ తేజ్ తన కెరీర్‌లోని 15వ సినిమాను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఇటీవల టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కనకరాజుప్పాత్రలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఈ చిత్రం రాయలసీమలోని అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు వరుణ్ తేజ్. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ప్రధానప్పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండో–కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ కామెడీ సినిమా ఇది. ఈస్ట్ గోదావరి... రాయలసీమ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పీరియాడికల్ చిత్రాలే. ‘రణబాలి’ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్న విజయ్ దేవరకొండ, ‘రౌడీ జనార్ధన’ చిత్రం కోసం ఈస్ట్ గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు భిన్నమైన యాసలతో కూడిన క్యారెక్టర్స్‌లో విజయ్ దేవరకొండ నటిస్తుండటం విశేషం. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూ కీలకప్పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. 1980 దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. ఏంది మీ లొల్లి...‘పండగ పూట మా బాబుకి బియ్యమిచ్చి నాలుగు ముక్కలు తిందమంటే ఏంది మీ లొల్లి..., ఏయ్ పండగ కాబట్టే కక్క ముక్క వండినం... చెప్పురంకుల్’ అంటూ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు కావ్యా థాపర్. ‘నేను రెడీ’ చిత్రం కోసమే కావ్య ఇలా తెలంగాణ మాట్లాడటానికి రెడీ అయ్యారు. ‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘నేను రెడీ’ వేసవిలో రిలీజ్ కానుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘లెనిన్’ కోసం అక్కినేని అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రధాన కథనం రాయలసీమ ్రపాంతంలోని చిత్తూరు నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇంకా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండ ఈతూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోన్నించి వస్తాది’ అంటూ రాయలసీమ యాసలో సాయిధరమ్ తేజ్ సంభాషణలు పలికారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూటెడ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారట దేవిశ్రీ ప్రసాద్. అలాగే ‘డెకాయిట్’ సినిమా కోసం అడివి శేష్ రాయలసీమ యాసలో, ‘భోగి’ సినిమా కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, ‘క్రేజీ కల్యాణం’ కోసం అనుపమా పరమేశ్వరన్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతున్నట్లుగా తెలిసింది. వీరే కాదు... తమ కొత్త సినిమాల కోసం విభిన్న యాసల్లో డైలాగ్స్ చెబుతున్న నటీనటులు మరికొంతమంది ఉన్నారు. -
టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ప్రాజెక్ట్ ఇండస్‌ను ప్రారంభించింది. బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో సంభాíÙంచడానికి దేశీయంగా రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఇది. ఇండస్ ఎల్ఎల్ఎం మొదటి దశ హిందీ భాషతోపాటు దాని 37కుపైగా మాండలికాల కోసం అభివృద్ధి చేశారు. ఇండస్ మోడల్ ప్రారంభంలో మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్‌ను ఒక సేవగా, సంస్థలకు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అందించడం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఎల్ఎంకు అవసరమైన అధిక–పనితీరు గల కంప్యూటింగ్ సొల్యూషన్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి డెల్ టెక్నాలజీస్‌తో టెక్ మహీంద్రా చేతులు కలిపింది. కస్టమర్లు జెన్ఏఐ అప్లికేషన్లలో ఇండస్ మోడల్‌ను ఏకీకృతం చేసేందుకు వీలుగా ఇంటెల్ జియాన్ ప్రాసెసర్లు, వన్ఏపీఐ సాఫ్ట్వేర్, ఇంటెల్ అడ్వాన్స్డ్ మ్యాట్రిక్స్ ఎక్స్టెన్షన్స్ సహా ఇంటెల్–ఆధారిత మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రాజెక్ట్ ఇండస్ స్వీకరిస్తుంది. -
వెండితెరపై ఊరి పలుకు: భాష మారింది యాస చేరింది
‘నడుము సూపియ్యాలా? ఇడ్సిన్నాకొడకా’... ఇలాంటి ఊరి మాట సినిమాలో వినిపించడానికి 2021 రావాల్సి వచ్చింది.ఇటీవల రిలీజైన ‘సినిమా బండి’ అనే చిన్న సినిమా చిత్తూరు లోపలి పల్లెల భాషను సినిమా అంతా వాడింది.ఇదే కాదు ‘జాతి రత్నాలు’, ‘ఈ మెయిల్’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఇలాంటి సినిమాలన్నీ ఇప్పుడు ఊరి మాండలికాలు వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ప్రామాణిక భాషను నేలకు దించి నేల భాషను వినిపిస్తున్న ఘనత నేటి తెలుగు చిన్న సినిమాలది. ఒక విశ్లేషణ. ఇటీవల ఒక చిన్న సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. పేరు ‘సినిమా బండి’. ఒక పల్లెటూరి ఆటోడ్రైవర్‌కు ఎవరో పాసింజర్ మర్చిపోయిన కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఆ ఊరి వాళ్లందరూ సినిమా తీయడమే కథ. అదొక్కటే విశేషం కాదు. సినిమా అంతా చిత్తూరు పల్లె మాండలికంలో సాగుతుంది. ఇంకా చెప్పాలంటే చిత్తూరు అనంతపురం బోర్డర్ భాష. ఇలా ఒక సినిమా మొత్తం ‘స్టాండర్డ్ తెలుగు’ కాకుండా ఊరి తెలుగు వినిపించడం ఇప్పుడు సాధ్యం అవుతున్నదేమో కాని ఒకప్పుడు ఇది ఊహకు అందని విషయం. నేటి చిన్న సినిమాలు ఊరి భాషలను అందంగా చూపించి విజయం సాధించడం సాధ్యమే అని నిరూపిస్తుండటం వల్లే ఇంత కాలం తెలుగు తెరకు దూరంగా ఉన్న మాండలికాలు ఇప్పుడు మేకప్ లేకుండానే మధురం గా వినిపిస్తున్నాయి. హాస్యం కోసం నెల్లూరు ఏ భాషకైనా ‘ప్రామాణిక భాష’ ఉండాల్సిందే. అయితే ఆ ప్రామాణిక భాషదే ఆ భాష మీద పెత్తనం అయి ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఇతర భాషల్లోలాగే తెలుగులో కూడా ప్రామాణిక భాష సకల మాధ్యమాలలో పెత్తనం చేసింది. చేస్తూ ఉంది. అది తనకు తాను ఎంత వికాసం చెందినా మాండలికాలపై పెను నీడను వేస్తూ వచ్చిందన్నది వాస్తవం. తెలుగు సినిమాలలో కూడా ప్రామాణిక తెలుగులోనే సంభాషణలు కొనసాగుతూ వచ్చాయి. హాస్యపాత్రలు ఎప్పుడైనా నెల్లూరు భాషను, ఉత్తరాంధ్ర భాషను, లేదంటే తూ.గో భాషను మాట్లాడేవరకూ అనుమతి ఉండేది. ఇక సినిమా అంతా మాండలికం వినిపించడం పెద్ద తప్పుగా, మార్కెట్‌కు వీలుకాని విషయంగా ప్రచారం జరిగింది. ఈ ధోరణి వికృతి చెంది కొన్ని మాండలికాలు చెడ్డ పాత్రలకు పెట్టే ఆనవాయితీ వరకూ వెళ్లింది. దీంతో ఆత్మగౌరవ పోరాటాలు కూడా వచ్చాయి. అన్ని తెలుగులకు సమాన గౌరవం, సమాన ప్రాధాన్యం ఉండి ఉంటే మన తెలుగు సినిమా కథలు, మాటలు ఇంకా విభిన్నంగా ఇప్పటికి వికసించి ఉండేవి. పర్వాలేదు. ఇప్పటికి ఆ ట్రెండ్ వచ్చినందుకు సంతోషించాలి. విలన్లకు ఆ భాషలను పెట్టి తెలుగులో ‘ప్రతిఘటన’లో కోట శ్రీనివాసరావు చెప్పిన ‘తెలంగాణ యాస’ విశేషంగా మారింది. తెలంగాణ భాష ‘ఆటవిడుపు’ భాషగా చెలామణిలోకి వచ్చింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ ‘అంకుశం’ సినిమాలో రామిరెడ్డితో తెలంగాణ పలికించారు. ఆ తర్వాత తెలంగాణ భాష విలన్ల భాషగా ట్రెండ్ చేయబడింది. మరోవైపు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో నమ్మశక్యపు స్థాయిలో కర్నూలు భాషను జయప్రకాశ్‌రెడ్డి పలికించారు. ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’ వంటి ఫ్యాక్షన్ సినిమాలు వచ్చినా హీరోలు ప్రామాణిక భాషను మాట్లాడి విలన్లు రాయలసీమ భాషను వినిపించేలా చేశారు. దీనివల్ల కూడా రాయలసీమ భాష విలన్ల భాషగా ట్రెండ్ అయ్యింది. అంటే మధ్యాంధ్ర ప్రామాణిక భాష తప్ప ఇతర రెండు ప్రధాన భాషలు (తెలంగాణ, రాయలసీమ) వెండితెర ఉనికిని చాటుకోవడం కోసం పెనుగులాడాల్సి వచ్చింది. పుష్ప, నారప్ప వరకు అయితే రెండు మూడు ఏళ్లుగా పరిస్థితి మారింది. సినిమాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు కొత్త కంటెంట్‌ను ఆహ్వానించసాగాయి. దాంతో భాషకు సంబంధించిన బంధనాలు కూడా చెదరసాగాయి. నాని నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ నిజ అనంతపురం మాండలికంను, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్తూరు భాషను పట్టుకున్నాయి. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం కడప జిల్లా పలుకును దాని యాక్యురసీతో తేవడం కోసం మాండలిక టీచర్లను పెట్టుకుని మరీ నిజాయితీగా పని చేసింది. ఒక భాషను కమర్షియల్ విలువ కోసంగా కాక కథకు అవసరంగా దాని జీవంతో జీవనంతో తీసుకోవడం మెల్లగా మొదలయ్యింది. రాబోయే వెంకటేశ్ ‘నారప్ప’, అల్లు అర్జున్ ‘పుష్ప’ వరకూ రాయలసీమ భాష తెలుగు సినిమాల్లో సొగసును తేనుంది. మార్చిన అర్జున్‌రెడ్డి, ఫిదా 2017 సంవత్సరం తెలంగాణ భాషకు సంబంధించి తెలుగు సినిమా లో కీలకమైన మార్పు తెచ్చింది. ఆ సంవత్సరం రిలీజైన ‘అర్జున్ రెడ్డి’, ‘ఫిదా’ సినిమాలు తెలంగాణ భాషను వాటి సహజ సౌందర్యంతో అవసరంతో తెర మీదకు తెచ్చాయి. సినిమా అంతా తెలంగాణ మాట్లాడే హీరోను అర్జున్ రెడ్డి లో, సినిమా అంతా తెలంగాణ మాట్లాడే హీరోయిన్ను ఫిదాలో ప్రేక్షకులు పులకించి చూశారు. భాషకు హద్దులు ఉండవని తేలిపోయింది. మరోవైపు తెలంగాణ ప్రాంత కథలు ‘మల్లేశం’, ‘దొరసాని’, ‘ఫలక్‌నుమా దాస్’ ఇవన్నీ తెలంగాణ కథలను భాషతోపాటుగా తెచ్చాయి. ‘మెయిల్’, ‘జాతిరత్నాలు’ చిన్న ఊళ్ల భాషను పతాక స్థాయికి చేర్చాయి. ‘వకీల్‌సాబ్’లో హీరో తెలంగాణ భాషను సినిమా ఆద్యంతం మాట్లాడటం ఈ ధోరణి ప్రాధాన్యానికి ఒక గుర్తింపు. పలాస, మిడిల్‌క్లాస్ మెలొడీస్ మరోవైపు ఉత్తరాంధ్ర భాషను ‘పలాస’ సినిమా చాలా సమర్థంగా ప్రవేశపెట్టింది. ప్రామాణిక భాషగా చెప్పే గుంటూరు జిల్లాలో కూడా మాండలికం ఉంటుందని చెప్పే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ హిట్ అయ్యింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నెల్లూరు భాషతో హిట్ కొడితే ‘శ్రీకారం’, ‘ఉప్పెన’, ‘కలర్ ఫొటో’... ఇవన్నీ చిన్న ఊర్ల, పేటల, సమూహాల కథలు వాటి భాషతో చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘క్రాక్’ సినిమా ఒంగోలు ప్రాంతపు పలుకుబడిని చూపింది. సినిమాను ప్రేక్షకుడితో కనెక్ట్ చేయడంలో భాష ఎప్పుడూ ముఖ్యమైనది. సినిమాకు భాష ఒక ఫ్రెష్‌నెస్ తేగలదని నేటి దర్శకులు గ్రహిస్తున్నారు. తెలుగులో ఇంకా ఎన్నో మాండలికాలు, మాటవరుసలు ఉన్నాయి. అవన్నీ ఇకపై సినిమాల్లో వినిపించనున్నాయి. కొత్త దర్శకుల ధోరణి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
ఎక్కువ మంది మాట్లాడే యాసే!
పాఠ్య పుస్తకాల్లో మాండలికం వినియోగంపై విద్యాశాఖ నిర్ణయం తెలంగాణ భాషకు శైలీపత్రం రూపకల్పనపై సమావేశం హైదరాబాద్: విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మార్పులకు సంబంధించి తెలంగాణలో ఎక్కువ మంది మాట్లాడే మాండలికాన్నే వినియోగించాలని ఈ అంశంపై వేసిన కమిటీలు, విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించాయి. పాఠ్యపుస్తకాల్లో మార్పులపై బుధవారం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో కమిటీల సభ్యులు, విద్యాశాఖ అధికారులు, నిపుణులు భేటీ అయి చర్చించారు. పాఠ్య పుస్తకాల్లో ఉపయోగించాల్సిన భాషపై శైలీ పత్రం రూపొందించాలని నిర్ణయించారు. దీనిని గురువారం జరిగే సమావేశంలో ఖరారు చేయనున్నారు. దీంతోపాటు పరామర్శ గ్రంథాలు, పుస్తకాల్లో వినియోగించే మాండలిక పదాల కోసం నిఘంటువులను రూపొందించాలని నిర్ణయించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు అధ్యయనం చేసి, తదుపరి చర్యలు చేపట్టేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని డీఎస్ఈ జగదీశ్వర్ వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా మార్పులతో కూడిన పుస్తకాల రచన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ క్రమం, పోరాట యోధుల చరిత్ర వంటి అంశాల పై పాఠాలు పొందుపరిచే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ‘సంస్కృతి’ పాఠాలు!: తరగతుల వారీగా పుస్తకాల్లో ఉపయోగించే భాష, వాక్య నిర్మాణం తదితర అంశాలను తెలంగాణ శైలీ పత్రంలో పొందుపరుస్తారు. ప్రస్తుతమున్న పాఠ్యాంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాటిని పరిశీలించి.. అవసరం లేనివాటిని తొలగిస్తారు. తెలంగాణకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను తెలంగాణ విద్యార్థులు సమర్థంగా ఎదుర్కొగలిగే రీతిలో పాఠాలను చేర్చుతారు. తెలంగాణ ఉద్యమం, జయశంకర్, కొండా లక్ష్మన్ బాపూజీ, కాళోజీ వంటి తెలంగాణ స్ఫూర్తిప్రదాతలు, కవులు, కళలు, కళాకారులు, తెలంగాణ గ్రామీణ జీవన విధానం, పండుగలు, వృత్తులకు సంబంధించిన ప్రత్యేక పాఠాలను పుస్తకాల్లో చేర్చుతారు. సాంఘిక శాస్త్రంలో పటాలు, చార్టులు, సమాచార పట్టికలు, గణాంకాలను మార్చుతారు.


