వెండితెరపై ఊరి పలుకు: భాష మారింది యాస చేరింది

Tollywood Movies Focusing On Dialect Films - Sakshi

ఫిల్మీ దునియా 

‘నడుము సూపియ్యాలా? ఇడ్సిన్నాకొడకా’... ఇలాంటి ఊరి మాట సినిమాలో వినిపించడానికి 2021 రావాల్సి వచ్చింది.ఇటీవల రిలీజైన ‘సినిమా బండి’ అనే చిన్న సినిమా చిత్తూరు లోపలి పల్లెల భాషను సినిమా అంతా వాడింది.ఇదే కాదు ‘జాతి రత్నాలు’, ‘ఈ మెయిల్‌’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ ఇలాంటి సినిమాలన్నీ ఇప్పుడు ఊరి మాండలికాలు వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ప్రామాణిక భాషను నేలకు దించి నేల భాషను వినిపిస్తున్న ఘనత నేటి తెలుగు చిన్న సినిమాలది. ఒక విశ్లేషణ.

ఇటీవల ఒక చిన్న సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. పేరు ‘సినిమా బండి’. ఒక పల్లెటూరి ఆటోడ్రైవర్‌కు ఎవరో పాసింజర్‌ మర్చిపోయిన కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఆ ఊరి వాళ్లందరూ సినిమా తీయడమే కథ. అదొక్కటే విశేషం కాదు. సినిమా అంతా చిత్తూరు పల్లె మాండలికంలో సాగుతుంది. ఇంకా చెప్పాలంటే చిత్తూరు అనంతపురం బోర్డర్‌ భాష. ఇలా ఒక సినిమా మొత్తం ‘స్టాండర్డ్‌ తెలుగు’ కాకుండా ఊరి తెలుగు వినిపించడం ఇప్పుడు సాధ్యం అవుతున్నదేమో కాని ఒకప్పుడు ఇది ఊహకు అందని విషయం. నేటి చిన్న సినిమాలు ఊరి భాషలను అందంగా చూపించి విజయం సాధించడం సాధ్యమే అని నిరూపిస్తుండటం వల్లే ఇంత కాలం తెలుగు తెరకు దూరంగా ఉన్న మాండలికాలు ఇప్పుడు మేకప్‌ లేకుండానే మధురం గా వినిపిస్తున్నాయి.

హాస్యం కోసం నెల్లూరు
ఏ భాషకైనా ‘ప్రామాణిక భాష’ ఉండాల్సిందే. అయితే ఆ ప్రామాణిక భాషదే ఆ భాష మీద పెత్తనం అయి ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఇతర భాషల్లోలాగే తెలుగులో కూడా ప్రామాణిక భాష సకల మాధ్యమాలలో పెత్తనం చేసింది. చేస్తూ ఉంది. అది తనకు తాను ఎంత వికాసం చెందినా మాండలికాలపై పెను నీడను వేస్తూ వచ్చిందన్నది వాస్తవం. తెలుగు సినిమాలలో కూడా ప్రామాణిక తెలుగులోనే సంభాషణలు కొనసాగుతూ వచ్చాయి.

హాస్యపాత్రలు ఎప్పుడైనా నెల్లూరు భాషను, ఉత్తరాంధ్ర భాషను, లేదంటే తూ.గో భాషను మాట్లాడేవరకూ అనుమతి ఉండేది. ఇక సినిమా అంతా మాండలికం వినిపించడం పెద్ద తప్పుగా, మార్కెట్‌కు వీలుకాని విషయంగా ప్రచారం జరిగింది. ఈ ధోరణి వికృతి చెంది కొన్ని మాండలికాలు చెడ్డ పాత్రలకు పెట్టే ఆనవాయితీ వరకూ వెళ్లింది. దీంతో ఆత్మగౌరవ పోరాటాలు కూడా వచ్చాయి. అన్ని తెలుగులకు సమాన గౌరవం, సమాన ప్రాధాన్యం ఉండి ఉంటే మన తెలుగు సినిమా కథలు, మాటలు ఇంకా విభిన్నంగా ఇప్పటికి వికసించి ఉండేవి. పర్వాలేదు. ఇప్పటికి ఆ ట్రెండ్‌ వచ్చినందుకు సంతోషించాలి.

విలన్లకు ఆ భాషలను పెట్టి
తెలుగులో ‘ప్రతిఘటన’లో కోట శ్రీనివాసరావు చెప్పిన ‘తెలంగాణ యాస’ విశేషంగా మారింది. తెలంగాణ భాష ‘ఆటవిడుపు’ భాషగా చెలామణిలోకి వచ్చింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ ‘అంకుశం’ సినిమాలో రామిరెడ్డితో తెలంగాణ పలికించారు. ఆ తర్వాత తెలంగాణ భాష విలన్ల భాషగా ట్రెండ్‌ చేయబడింది. మరోవైపు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో నమ్మశక్యపు స్థాయిలో కర్నూలు భాషను జయప్రకాశ్‌రెడ్డి పలికించారు. ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’ వంటి ఫ్యాక్షన్‌ సినిమాలు వచ్చినా హీరోలు ప్రామాణిక భాషను మాట్లాడి విలన్‌లు రాయలసీమ భాషను వినిపించేలా చేశారు. దీనివల్ల కూడా రాయలసీమ భాష విలన్ల భాషగా ట్రెండ్‌ అయ్యింది. అంటే మధ్యాంధ్ర ప్రామాణిక భాష తప్ప ఇతర రెండు ప్రధాన భాషలు (తెలంగాణ, రాయలసీమ) వెండితెర ఉనికిని చాటుకోవడం కోసం పెనుగులాడాల్సి వచ్చింది. 

పుష్ప, నారప్ప వరకు
అయితే రెండు మూడు ఏళ్లుగా పరిస్థితి మారింది. సినిమాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు కొత్త కంటెంట్‌ను ఆహ్వానించసాగాయి. దాంతో భాషకు సంబంధించిన బంధనాలు కూడా చెదరసాగాయి. నాని నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ నిజ అనంతపురం మాండలికంను, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్తూరు భాషను పట్టుకున్నాయి. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం కడప జిల్లా పలుకును దాని యాక్యురసీతో తేవడం కోసం మాండలిక టీచర్లను పెట్టుకుని మరీ నిజాయితీగా పని చేసింది. ఒక భాషను కమర్షియల్‌ విలువ కోసంగా కాక కథకు అవసరంగా దాని జీవంతో జీవనంతో తీసుకోవడం మెల్లగా మొదలయ్యింది. రాబోయే వెంకటేశ్‌ ‘నారప్ప’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ వరకూ రాయలసీమ భాష తెలుగు సినిమాల్లో సొగసును తేనుంది. 

మార్చిన అర్జున్‌రెడ్డి, ఫిదా
2017 సంవత్సరం తెలంగాణ భాషకు సంబంధించి తెలుగు సినిమా లో కీలకమైన మార్పు తెచ్చింది. ఆ సంవత్సరం రిలీజైన ‘అర్జున్‌ రెడ్డి’, ‘ఫిదా’ సినిమాలు తెలంగాణ భాషను వాటి సహజ సౌందర్యంతో అవసరంతో తెర మీదకు తెచ్చాయి. సినిమా అంతా తెలంగాణ మాట్లాడే హీరోను అర్జున్‌ రెడ్డి లో, సినిమా అంతా తెలంగాణ మాట్లాడే హీరోయిన్‌ను ఫిదాలో ప్రేక్షకులు పులకించి చూశారు. భాషకు హద్దులు ఉండవని తేలిపోయింది. మరోవైపు తెలంగాణ ప్రాంత కథలు ‘మల్లేశం’, ‘దొరసాని’, ‘ఫలక్‌నుమా దాస్‌’ ఇవన్నీ తెలంగాణ కథలను భాషతోపాటుగా తెచ్చాయి. ‘మెయిల్‌’, ‘జాతిరత్నాలు’ చిన్న ఊళ్ల భాషను పతాక స్థాయికి చేర్చాయి. ‘వకీల్‌సాబ్‌’లో హీరో తెలంగాణ భాషను సినిమా ఆద్యంతం మాట్లాడటం ఈ ధోరణి ప్రాధాన్యానికి ఒక గుర్తింపు.

పలాస, మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌
మరోవైపు ఉత్తరాంధ్ర భాషను ‘పలాస’ సినిమా చాలా సమర్థంగా ప్రవేశపెట్టింది. ప్రామాణిక భాషగా చెప్పే గుంటూరు జిల్లాలో కూడా మాండలికం ఉంటుందని చెప్పే ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ హిట్‌ అయ్యింది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నెల్లూరు భాషతో హిట్‌ కొడితే ‘శ్రీకారం’, ‘ఉప్పెన’, ‘కలర్‌ ఫొటో’... ఇవన్నీ చిన్న ఊర్ల, పేటల, సమూహాల కథలు వాటి భాషతో చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘క్రాక్‌’ సినిమా ఒంగోలు ప్రాంతపు పలుకుబడిని చూపింది.

సినిమాను ప్రేక్షకుడితో కనెక్ట్‌ చేయడంలో భాష ఎప్పుడూ ముఖ్యమైనది. సినిమాకు భాష ఒక ఫ్రెష్‌నెస్‌ తేగలదని నేటి దర్శకులు గ్రహిస్తున్నారు. తెలుగులో ఇంకా ఎన్నో మాండలికాలు, మాటవరుసలు ఉన్నాయి. అవన్నీ ఇకపై సినిమాల్లో వినిపించనున్నాయి. కొత్త దర్శకుల ధోరణి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
– సాక్షి ఫ్యామిలీ

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top