
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో నటించాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది. ఆ సంస్థకు అంత గుర్తింపు రావడంలో నిర్మాత దిల్ రాజు పాత్ర చాలా కీలకం. అయితే, తెరవెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి శ్రమ వెలకట్టలేనిదని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. అయితే, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన వారిద్దరూ ఈ ఏడాదిలో రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్‌ను భారీ బడ్జెట్‌తో (రూ.450 కోట్లు) తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిజాస్టర్ వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా శిరీష్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టాలతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని చెప్పారు. కానీ, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అంతా మారిపోయిందని ఆయన అన్నారు.
గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి ఇలా చెప్పారు.' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.
మాకు ఇష్టం ఉండి సినిమా తీశాం. డబ్బు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్‌లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు.. అంత స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదు. అయితే, మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్‌ను మేము కాపాడుకున్నాం. అయితే, గేమ్ ఛేంజర్ పోయిందని రామ్ చరణ్‌తో ఎలాంటి విభేదాలు రాలేదు. మరో కథ వస్తే ఆయన వద్దకు వెళ్తాం. ఆయన సినిమా చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. నిర్ణయం ఆయనదే కదా.. మేము ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. ఇష్టం ఉండి సినిమా తీశాం, పోగొట్టుకున్నాం. ఈ వ్యాపారంలో ఎవరినీ నిందించలేము. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగాదో. కానీ, చాలా మొత్తంలో నష్టపోయాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బయటపడ్డాం. గేమ్ ఛేంజర్ నష్టాన్ని సుమారు 70 శాతం వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదని చెబుతాను. మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిల్ అని నేను నమ్ముతా.' అని శిరీష్ రెడ్డి అన్నారు.