చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీస్‌ని ‘వన్స్ మోర్’ అంటూ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ కారణంగా తమ సినిమాలను మరోసారి విడుదల చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.
హీరోల పుట్టినరోజు కావచ్చు... లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. అదీ కాకుంటే ఆ సినిమాకి ఆడియన్స్‌లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ కారణంగానే రీ రిలీజ్‌లో కూడా ఆయా సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పైగా గత చిత్రాలను 4కె క్వాలిటీకి మార్చి అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధనుష్ నటించిన ‘3’ సినిమా, రామ్‌చరణ్ నటించిన ‘ఆరెంజ్’, రాఘవ లారెన్స్ ‘కాంచన’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, ‘ఏమాయ చేసావె’, ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ వంటి అరడజను సినిమాలు రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్నాయి. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం.
పదమూడేళ్ల తర్వాత...
ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘3’. ఆయన సతీమణి ఐశ్వర్య (ఐశ్వర్యా రజనీకాంత్) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించారు. ప్రభు, భానుప్రియ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. కె. విమలాగీత, ధనుష్ నిర్మించిన ఈ సినిమా 2012 మార్చి 30న విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ప్రధానంగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రత్యేకించి.. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి...’ పాట యూత్‌ని ఉర్రూతలూగించింది. ‘కొలవెరి డి...’ పాటతో రిలీజ్‌కు ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టింది. తొలి భాగం అందమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్‌లో మాత్రం విషాదాంత ప్రేమ కథగా మిగిలింది. ఈ చిత్రంలో రామ్ పాత్రలో ధనుష్, జనని పాత్రలో శ్రుతీహాసన్ అద్భుతంగా నటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా పదమూడేళ్ల తర్వాత ఈ నెల 6న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.
పదిహేనేళ్ల తర్వాత...
‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ప్రకాశ్‌రాజ్, షాజాన్ పదంసీ, ప్రభు, బ్రహ్మానందం, శ్రీనివాస్ అవసరాల, మధురిమ, మంజుల, సంజయ్, సమీర్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, సంచిత, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2010 నవంబరు 26న విడుదలైంది. ‘మగధీర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు రామ్‌చరణ్. ఆ మూవీ తర్వాత పూర్తి లవర్ బాయ్ లుక్‌లో నటించిన చిత్రం ‘ఆరెంజ్’.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక΄ోయింది. కానీ, ఈ మూవీ బుల్లితెరపై మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు యూత్‌ని ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పాత్రలో రామ్‌చరణ్, జాను క్యారెక్టర్‌లో జెనీలియా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ నెల 7న ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం.
పద్నాలుగేళ్ల తర్వాత...
‘ముని’ సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఆయన లీడ్ రోల్‌లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మి హీరోయిన్‌గా నటించారు. శరత్‌కుమార్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇతర పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్, ఎన్. రాధ నిర్మించిన ఈ సినిమా 2011 జూలై 15న విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి భయపెట్టింది.
ముఖ్యంగా రాఘవ లారెన్స్, శరత్ కుమార్ నటన హైలెట్‌గా నిలిచింది. ప్రత్యేకించి శరత్‌కుమార్ ఈ మూవీలో హిజ్రా పాత్రలో అద్భుతంగా నటించారు. రాయ్‌లక్ష్మి తనదైన గ్లామర్‌తో కుర్రకారుని అలరించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ నటన, హావభావాలు అద్భుతంగా పండించారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పద్నాలుగేళ్ల తర్వాత ‘కాంచన’ చిత్రాన్ని ఈ నెల 13న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్.
ప్రేమికుల దినోత్సవం కానుకగా...
రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఈ లవ్‌స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్‌గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021 సెప్టెంబరు 24న విడుదలైంది. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా...’ పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథా చిత్రంగా రూ పొందిన ‘లవ్ స్టోరి’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న మళ్లీ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. సో... నాలుగున్నరేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరోసారి అలరించనున్నారన్న మాట.
పదిహేనేళ్ల తర్వాత...
కార్తీక్, జెస్సీలు తమ ప్రేమకథతో వెండితెరపై ప్రేక్షకులను మాయ చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా మరోసారి మాయ చేసేందుకు వస్తున్నారు ఈ ప్రేమికులు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కృష్ణుడు, తాన్య, సురేఖా వాణి, సంజయ్ స్వరూప్, దేవన్, లక్ష్మి, త్రిష అలెక్స్ ఇతర పాత్రలు పోషించారు. ఇందిరా ప్రోడక్షన్స్‌పై మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది.
లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కార్తీక్ పాత్రలో నాగచైతన్య, జెస్సీగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. తన రెండవ సినిమాతోనే నాగచైతన్య తన నటనలో పరిణితి చూపించారనే ప్రశంసలు దక్కాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన శైలిలో ఈ అందమైన ప్రేమకథని తెరపైకి తీసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ పరమహంస విజువల్స్ కూడా అద్భుతంగా నిలిచాయి. చివరి సన్నివేశంలో త్రిష, శింబు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది.
24 ఏళ్ల తర్వాత...
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీమా సేన్ హీరోయిన్‌గా నటించారు. తనూ రాయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, శివ పార్వతి, బ్రహ్మానందం, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల ఇతర పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్‌పై ఎంఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. అంతేకాదు... ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో వేణుగా ఉదయ్ కిరణ్, రేణు పాత్రలో రీమా సేన్ కనిపిస్తారు.
బాల్య స్నేహితులైన వీరి మధ్య ప్రేమని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. 2001 అక్టోబరు 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి యువతరం ఈ మూవీని విపరీతంగా చూశారు. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు.
పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఇప్పటికే మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాగా ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్


