breaking news
manasantha nuvve
-
'అప్పుడు నాకు రెండు నెలలే'.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ మనసంతా నువ్వే. ఈ ప్రేమకథా చిత్రం మరోసారి ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది. ఈ ఏడాది వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రీమా సేన్, తనూ రాయ్ హీరోయిన్లుగా నటించారు. 2001లో విడుదలైన ఈ సినిమాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఓ వీడియోను రిలీజ్ చేసింది. నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు అని.. ఈ సినిమా రిలీజైనప్పుడు నాకు రెండు నెలల వయస్సు ఉంటుందని తెలిపింది. ఈ ఫిబ్రవరి 14 మీకు చాలా స్పెషల్‌గా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. మనసంతా నువ్వే మిమ్మల్ని మరోసారి థియేటర్లలో అలరించనుందని పేర్కొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాను మీ అందరితో కలిసి చూడడానికి చాలా ఆసక్తిగా ఉందంటూ మహతి వీడియోలో మాట్లాడింది. ఉదయ్‌కిరణ్ మేనల్లుడు తేజ కూడా..‘అంతకుముందే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ కూడా మాట్లాడారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్‌ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్‌కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్‌కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.#UdayKiran మేనకోడలు #Mahathi వీడియో బైట్‌లో సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ❤️#ManasanthaNuvve4K రీ రిలీజ్ థియేటర్స్‌లో ఫిబ్రవరి 14న 🎬🍿#ManasanthaNuvve pic.twitter.com/4PydDi1T4K— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 11, 2026 -
అప్పుడు నాకు 7ఏళ్లు.. 'ఉదయ్ కిరణ్' మేనల్లుడు వీడియో విడుదల
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘మనసంతా నువ్వే’ సినిమా రీ రిలీజ్ కానుంది. 25ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి ఈ హిట్ మూవీ రానుంది. ఉదయ్‌కిరణ్, రీమా సేన్, తనూ రాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దర్శకుడు వీఎన్ ఆదిత్య తెరకెక్కించగా ఎమ్.ఎస్. రాజు నిర్మించారు. అయితే, రీ-రిలీజ్ సందర్భంగా ఉదయ్‌కిరణ్ మేనల్లుడు తేజ ఒక వీడియో విడుదల చేశారు.‘మనసంతా నువ్వే’ సినిమా గురించి ఉదయ్‌కిరణ్ మేనల్లుడు ఇలా అన్నారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్‌ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్‌కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్‌కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.2001లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా మనసంతా నువ్వే నిలిచింది. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఉదయ్‌కిరణ్‌కు ఇది హ్యాట్రిక్ విజయంగా నిలిచింది. ఈమూవీకి సంగీతం ఆర్.పి.పట్నాయక్ వ్యవహరించగా, పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా ఈ తరం యువతను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు#ManasanthaNuvve 25 ఇయర్స్ & రి రిలీజ్ సందర్భంగా #UdayKiran మేనల్లుడు #Teja వీడియో బైట్ 👇🏽ఫిబ్రవరి 14న మళ్ళీ థియేటర్స్ లో ❤️#ManasanthaNuvve4K pic.twitter.com/NZxuDaNUk4— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 9, 2026 -
మళ్లీ మనసంతా నువ్వే..
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ‘మనసంతా నువ్వే’ సినిమా రీ రిలీజ్ కానుంది. ఉదయ్‌కిరణ్, రీమా సేన్, తనూ రాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఎమ్.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా ఈ తరం యువతను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్. -
వన్స్ మోర్
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీస్‌ని ‘వన్స్ మోర్’ అంటూ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ కారణంగా తమ సినిమాలను మరోసారి విడుదల చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.హీరోల పుట్టినరోజు కావచ్చు... లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. అదీ కాకుంటే ఆ సినిమాకి ఆడియన్స్‌లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ కారణంగానే రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పైగా గత చిత్రాలను 4కె క్వాలిటీకి మార్చి అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధనుష్ నటించిన ‘3’ సినిమా, రామ్‌చరణ్ నటించిన ‘ఆరెంజ్’, రాఘవ లారెన్స్ ‘కాంచన’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, ‘ఏమాయ చేసావె’, ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ వంటి అరడజను సినిమాలు రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్నాయి. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం.పదమూడేళ్ల తర్వాత... ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘3’. ఆయన సతీమణి ఐశ్వర్య (ఐశ్వర్యా రజనీకాంత్) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. ప్రభు, భానుప్రియ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. కె. విమలాగీత, ధనుష్ నిర్మించిన ఈ సినిమా 2012 మార్చి 30న విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ప్రధానంగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రత్యేకించి.. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి...’ పాట యూత్‌ని ఉర్రూతలూగించింది. ‘కొలవెరి డి...’ పాటతో రిలీజ్‌కు ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టింది. తొలి భాగం అందమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్‌లో మాత్రం విషాదాంత ప్రేమ కథగా మిగిలింది. ఈ చిత్రంలో రామ్ పాత్రలో ధనుష్, జనని పాత్రలో శ్రుతీహాసన్ అద్భుతంగా నటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా పదమూడేళ్ల తర్వాత ఈ నెల 6న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.పదిహేనేళ్ల తర్వాత... ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ప్రకాశ్‌రాజ్, షాజాన్ పదంసీ, ప్రభు, బ్రహ్మానందం, శ్రీనివాస్ అవసరాల, మధురిమ, మంజుల, సంజయ్, సమీర్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, సంచిత, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2010 నవంబరు 26న విడుదలైంది. ‘మగధీర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు రామ్‌చరణ్. ఆ మూవీ తర్వాత పూర్తి లవర్ బాయ్ లుక్‌లో నటించిన చిత్రం ‘ఆరెంజ్’.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక΄ోయింది. కానీ, ఈ మూవీ బుల్లితెరపై మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు యూత్‌ని ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పాత్రలో రామ్‌చరణ్, జాను క్యారెక్టర్లో జెనీలియా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ నెల 7న ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం. పద్నాలుగేళ్ల తర్వాత... ‘ముని’ సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఆయన లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మి హీరోయిన్గా నటించారు. శరత్‌కుమార్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇతర పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్, ఎన్. రాధ నిర్మించిన ఈ సినిమా 2011 జూలై 15న విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి భయపెట్టింది. ముఖ్యంగా రాఘవ లారెన్స్, శరత్ కుమార్ నటన హైలెట్‌గా నిలిచింది. ప్రత్యేకించి శరత్‌కుమార్ ఈ మూవీలో హిజ్రా పాత్రలో అద్భుతంగా నటించారు. రాయ్‌లక్ష్మి తనదైన గ్లామర్‌తో కుర్రకారుని అలరించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ నటన, హావభావాలు అద్భుతంగా పండించారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పద్నాలుగేళ్ల తర్వాత ‘కాంచన’ చిత్రాన్ని ఈ నెల 13న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా... రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఈ లవ్‌స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్‌గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021 సెప్టెంబరు 24న విడుదలైంది. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది.తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా...’ పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథా చిత్రంగా రూ పొందిన ‘లవ్ స్టోరి’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న మళ్లీ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. సో... నాలుగున్నరేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరోసారి అలరించనున్నారన్న మాట. పదిహేనేళ్ల తర్వాత... కార్తీక్, జెస్సీలు తమ ప్రేమకథతో వెండితెరపై ప్రేక్షకులను మాయ చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా మరోసారి మాయ చేసేందుకు వస్తున్నారు ఈ ప్రేమికులు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కృష్ణుడు, తాన్య, సురేఖా వాణి, సంజయ్ స్వరూప్, దేవన్, లక్ష్మి, త్రిష అలెక్స్ ఇతర పాత్రలు పోషించారు. ఇందిరా ప్రోడక్షన్స్పై మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది.లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కార్తీక్ పాత్రలో నాగచైతన్య, జెస్సీగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. తన రెండవ సినిమాతోనే నాగచైతన్య తన నటనలో పరిణితి చూపించారనే ప్రశంసలు దక్కాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన శైలిలో ఈ అందమైన ప్రేమకథని తెరపైకి తీసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ పరమహంస విజువల్స్ కూడా అద్భుతంగా నిలిచాయి. చివరి సన్నివేశంలో త్రిష, శింబు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. 24 ఏళ్ల తర్వాత... ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీమా సేన్ హీరోయిన్గా నటించారు. తనూ రాయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, శివ పార్వతి, బ్రహ్మానందం, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల ఇతర పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్పై ఎంఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. అంతేకాదు... ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో వేణుగా ఉదయ్ కిరణ్, రేణు పాత్రలో రీమా సేన్ కనిపిస్తారు.బాల్య స్నేహితులైన వీరి మధ్య ప్రేమని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. 2001 అక్టోబరు 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి యువతరం ఈ మూవీని విపరీతంగా చూశారు. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఇప్పటికే మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాగా ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
తెలుగులో ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోయిన్‌గానూ చేసింది!
సినిమాల్లో అందరూ నిలదొక్కుకోలేరు. కొందరిది షార్ట్ జర్నీ అయితే మరికొందరిది లాంగ్ జర్నీ.. అయితే కొందరు తక్కువ సినిమాలు చేసినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. పైన కనిపిస్తున్న బ్యూటీ అలాంటి చిత్రాలే చేసింది. 'తూనీగా.. తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ మనసంతా నువ్వేలో ఆడిపాడింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఈ మూవీతో పాటు గణేశ్, ప్రేమంటే ఇదేరా, హిందుస్తాన్: ద మదర్, ఎలా చెప్పను, ఆనందమానందమాయె వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. తర్వాత హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో సవాల్, స్నేహగీతం వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలోనూ రెండు సినిమాలు చేసింది. కానీ ఏవీ తనకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. దీంతో సడన్‌గా సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. 2011లో అప్పవి(తమిళ మూవీ) ఆమె నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. 2022లో ఎంటర్ప్రెన్యూర్, సంగీతకళాకారుడు విభర్ హసీజాను పెళ్లాడింది. అప్పటినుంచి ఇద్దరూ తెగ టూర్లు చుట్టేస్తున్నారు. సుహానీ అయితే ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయింది! ఇటీవలే ఈ దంపతులు దుబాయ్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నటి. గత నెలలో అమెరికాలో పారిస్, వాషింగ్టన్ ప్రాంతాలను చుట్టేసింది. పెళ్లయ్యాక సుహానీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోందంటున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Suhani Kalita (@suhani.kalita) చదవండి: పెళ్లయి ఎనిమిదేళ్లు.. ఇంకా పిల్లల్ని కనరా? వితికా ఆన్సరిదే! -
పెళ్లి చేసుకున్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్, ఫొటోలు వైరల్
'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుందా! మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్డిస్ట్గా నటించిన ఈమె పేరు సుహాని కలిత. బాలనటిగానే కాకుండా హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె తాజాగా పెళ్లిపీటలెక్కింది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో ఏడడుగులు నడిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని. ప్రేమంటే ఇదేరా, గణేష్, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో బాలనటిగా అలరించింది. తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్గా మారింది. కానీ కథానాయికగా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు. చివరగా ఆమె తెలుగులో 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది. చదవండి: పెళ్లిరోజే ఆ ముచ్చట తీరదన్న ఆలియా, మరి కత్రినా ఏమందంటే? ఏడ్చేసిన రేవంత్, ఏం పరిస్థితి తెచ్చావు సామీ -
తూనీగా తూనీగా.. అంటూ ఆడిపాడిన నటి నిశ్చితార్థం!
మనసంతా నువ్వే సినిమాలో 'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుంది కదా! ఈమె పేరు సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా నటిగా, హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను పెళ్లాడబోతోంది. ఈ మేరకు ఇటీవలే అతడితో నిశ్చితార్థం సైతం జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని. గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. అదే సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు కంపెనీల యాడ్స్‌లోనూ తళుక్కున మెరిసింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ కథానాయికగా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆమె తెలు చివరగా 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది. చదవండి: లవ్ బ్రేకప్, దత్తత ద్వారా తల్లయిన నటి నా సినిమాలు మీరే కాదు నేను కూడా చూసుకోలేదు -
'మనసంతా నువ్వే' చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
హీరోయిన్ సుహాని కలిత గుర్తుందా..అదేనండి 'మనసంతా నువ్వే' సినిమాలో 'తూనీగ తూనీగ'.. అంటూ కనిపించిన చిన్నారి. బాల రామాయణం సినిమాతో తెలుగు తెరకు పరిచయయం అయిన ఆమె గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. ఆ సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడా సినిమాలు చేసింది. ఈ చిన్నదాని క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కొన్ని బడా కంపెనీలు సుహానీని బ్రాండ్ అంబాసిండర్‌గా నియమించుకున్నాయి. అలా ఆమె నీరూస్, శామ్సంగ్, ఆర్ఎస్ బ్రదర్స్ సహా పలు బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సుహానీ 2008లో బి. జయ దర్శకత్వంలో సవాల్ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత స్నేహగీతం, శ్రీశైలం వంటి సినిమాల్లో నటించినా ఈమెకు అంతగా కలిసిరాలేదు. చెల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన పాపులారిటీ..హీరోయిన్గా మాత్రం రాలేదు. ఇప్పటివరకు వివిధ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కథ నచ్చితే మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
'మనసంతా నువ్వే' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి
రీమాసేన్.. ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పాలి. పదిహేనేళ్ల వయసులోనే నటిగా వెండితెరపై ప్రయాణం ఆరంభించిందీ రీమా. 'చిత్రం'తో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే స్టార్డమ్ సంపాదించుకుంది. అలా.. తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో రీమా కూడా చేరిపోయింది. ఆమె నటించిన మనసంతా నువ్వే, వల్లభ సహా పలు చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించింది.. సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె తన అందచందాలతో కుర్రకారుల మతులు పోగొట్టింది. ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన ఆమె మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది. తనకు వచ్చిన క్రేజ్ చూసి రీమాకు తిరుగు లేదనుకున్నారంతా! కానీ తెలుగు, తమిళం, హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో రీమాసేన్ పెళ్లి పీటలెక్కింది. 2012లో వ్యాపారవేత్త శివకరణ్తో ఏడడుగులు నడిచింది. వీరి దాంపత్యానికి గుర్తుగా మరుసటి ఏడాదే రుద్రవీర్ అనే కొడుకు జన్మించాడు. రీమాసేన్ అప్పటి నుంచి ఏ సినిమా అంగీకరించలేదు. దీంతో ఆమె వెండితెరకు పూర్తిగా దూరమైంది. ఇక నటనకు గుడ్‌బై చెప్పేసిన రీమాసేన్ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. అయితే సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే అందాన్ని మెయింటెన్ చేస్తోందీ హీరోయిన్. భర్త, కొడుకే ప్రాణంగా బతుకుతున్న రీమా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకున్న ఫొటోలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. మరి రీమాసేన్ భర్త, కొడుకు ఎలా ఉన్నారో మీరూ చూసేయండి.. చదవండి: PSPK28:పవన్ కల్యాణ్ చిత్రంలో నటించడం లేదు: హీరోయిన్ -
నిజమైన ప్రేమకు నిర్వచనం!
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్.వి.రంగారావు లాంటి అగ్రనటుల చిత్రాల్లో న టించి, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి కన్నాంబను మర్చిపోవడం అంత సులువు కాదు. ఇప్పుడామె మనవడు పసుపులేటి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పవన్ అగర్వాల్, బిందు బార్బీ జంటగా కన్నాంబ పసుపులేటి మూవీస్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఆయన ‘మనసంతా నువ్వే’ పేరుతో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి పాటలను విడుదల చేశారు. ‘‘సినిమాలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అందువల్ల సినిమాల్లో మంచిని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నా’’ అని నాయిని నర్శింహారెడ్డి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘దర్శకుడు అనుకున్న విధంగా చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది’’ అని చెప్పారు. ‘‘నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పే సినిమా ఇది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలీఖాన్, సంతోష్‌కుమార్, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నీ స్నేహం ఇకరాను అని...
సినిమా వెనుక స్టోరీ - 6 ‘‘నేనండీ... ఎమ్మెస్ రాజుని. ఓసారి ఆఫీసుకి రాగలరా?’’... వీఎన్ ఆదిత్య హాస్పిటల్కెళ్లే హడావిడిలో ఉన్నాడు. అపాయింట్మెంట్ టైమ్‌కి వెళ్లకపోతే డాక్టర్ డీబీఎన్ మూర్తి తిడతారు. అందుకే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళడానికి ఆదరాబాదరాగా రెడీ అవుతున్నాడు. ఆ టైమ్‌లోనే ఈ ఫోన్. ‘‘అర్జంట్ హాస్పిటల్ పనుంది. నేను మళ్లీ చేస్తానండీ’’ అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య.డాక్టర్ని కలిసి వచ్చేసరికి బాగా లేటయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఎమ్మెస్ రాజు ఫోను. ఎంత ఆలోచించినా ఆయనెవరో గుర్తుకురావడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసులో తెలిసిన ఆపరేటర్ ఉంటే, అతన్నడిగాడు. ‘‘అదేంటీ... రాజుగారు తెలియదా? ‘దేవి, దేవీపుత్రుడు’ సినిమాలు తీసిన హనీబాబు ఆయనే కదా!’’ అని చెప్పాడతను. ఆదిత్య తెగ ఫీలైపోయాడు. ‘‘అరే... అంత పెద్దాయన ఫోన్ చేస్తే గుర్తుపట్టలేక పోయానే! హనీబాబుగా గుర్తుపెట్టుకుని అసలు పేరు మరిచిపోయానే...’’ అని బాధపడిపోయాడు. అయినా... ఆయన నాకెందుకు ఫోన్ చేసుంటారు? ఆదిత్య రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. అక్కడ ఎమ్మెస్ రాజు కూడా ఆలోచిస్తున్నారు. ‘దేవీపుత్రుడు’ సినిమా ఫలితం... ఆయన్ని బాగా కుదిపేసింది. ఈసారి ట్రెండు మార్చాలి... రూట్ మార్చాలి... కొత్త దర్శకుడితో క్యూట్ లవ్‌స్టోరీ తీయాలి. ఎమ్మెస్ రాజుకి రాత్రింబవళ్లూ ఇదే ఆలోచన. కెమెరామ్యాన్ ఎస్. గోపాలరెడ్డి ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలూ ఇద్దరూ షేర్ చేసుకుంటారు. గోపాలరెడ్డి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది. ‘‘మీక్కావల్సింది చాకు లాంటి కొత్త డెరైక్టరేగా? వీఎన్ ఆదిత్య అని సింగీతం, జయంత్ సి. పారాన్జీల దగ్గర పని చేశాడు. ఆదిత్య మీకు సెట్ అవుతాడు’’ అని ఆదిత్య ఫోన్ నెంబరిచ్చారు గోపాలరెడ్డి. ఎమ్మెస్ రాజు వెంటనే ఆదిత్యకు ఫోన్ కొట్టారు. అప్పుడే అతను డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పింది. సరే... నెక్ట్స్ డే చేస్తాడేమోనని ఎమ్మెస్ రాజు వెయిట్ చేశారు. నో రెస్పాన్స్. మర్చిపోయాడా? భయపడ్డాడా? ఆదిత్యకు మళ్లీ కాల్ చేశారు ఎమ్మెస్ రాజు. ‘‘సారీ సార్... అర్జంట్‌గా రాజమండ్రి వెళ్తున్నా. అక్కడ టెంపుల్లో పూజ చేయించడానికి వెళ్తున్నా’’ చెప్పాడు ఆదిత్య. ‘‘వెరీ గుడ్. వచ్చాక కలవండి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. వారం గడిచినా ఆదిత్య నుంచి కాల్ రాలేదు. ‘మంచి కుర్రాడని చెప్పారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడేంటి?’ ఎమ్మెస్ రాజుకి కోపం వచ్చింది. ఫైనల్ కాల్. వస్తే వచ్చాడు. లేకపోతే కట్. సుమంత్ ఆర్ట్స్ ఆఫీస్. ఎమ్మెస్ రాజు ముందు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు ఆదిత్య. ‘‘సారీ సార్! నాతో మీరు సినిమా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోడి రామకృష్ణగారు ఉండగా నన్నెందుకు పిలుస్తారనుకున్నా. అందుకే కలవడానికి ఇబ్బంది పడ్డా. క్షమించండి.’’ ఎమ్మెస్ రాజు చాలా ప్రశాంతంగా ఆదిత్య మాటలు వింటున్నారు. ‘‘సార్! మీరు పెద్ద ప్రొడ్యూసరు. నేను కొత్తవాణ్ణి. లవ్‌స్టోరీతోనే కెరీర్ స్టార్ట్ చేద్దామను కుంటున్నవాణ్ణి. మీరింతవరకూ లవ్‌స్టోరీ తీయలేదు. నా కథను ఎలా జడ్జ్ చేయగలరు?’’ అని కాస్తంత ధైర్యం కూడ దీసుకుని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు ఆదిత్య. ‘‘గుడ్ క్వశ్చన్. ఓ పది రోజులు ఆఫీసుకి రా! ఇద్దరం సరదాగా డిస్కస్ చేసుకుందాం. ట్యూనింగ్ కుదిరితేనే కలిసి పని చేద్దాం’’ అన్నారు ఎమ్మెస్ రాజు. ఆదిత్య షాకైపోయాడు. అంత పెద్ద ప్రొడ్యూసర్ తనలాంటి కొత్త కుర్రాణ్ణి ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. రోజూ ఆఫీసుకొస్తున్నాడు ఆదిత్య. ఓ రోజు ఎమ్మెస్ రాజు ‘‘నీకు రెండు స్టోరీ ఐడియాలు చెబుతా. ఏది నచ్చితే దాంతోనే సినిమా చేద్దాం’’ అన్నారు. ఎమ్మెస్ రాజు ఫస్ట్ ఐడియా చెప్పారు. ‘‘ఇదేంటి సార్... ఇది ‘ప్రేమించుకుందాం రా’ కథలా ఉంది. ఆ సినిమాకి నేను అసోసియేట్ డెరైక్టర్ని. మళ్లీ అదే కథతో ఎలా సినిమా చేస్తాం?’’ అనడిగేశాడు ఆదిత్య. ఎమ్మెస్ రాజు నవ్వుతూ ‘‘గుడ్... డెరైక్షన్ ఆఫరివ్వగానే ఏది పడితే అది చేసేస్తావా, లేక ఆలోచిస్తావా అని టెస్ట్ చేశానంతే’’ అన్నారు. ఇప్పుడు రెండో ఐడియా చెప్పారు. ఆదిత్యకు నచ్చేసింది. వర్క్ మొదలైంది. హిందీలో వచ్చిన ‘అన్మోల్ ఘడీ’ (1946) సినిమా ఇన్స్పిరేషన్తో కొంతవరకూ కథను తీర్చిదిద్దారు. యాంటిక్ వాచ్ బహుమతిగా ఇవ్వడం, తన ప్రేమకథనే నవలగా రాయడం లాంటి కొన్ని సీన్స్ అలానే డెవలప్ అయ్యాయి. దర్శక - రచయిత కె. భాగ్యరాజా తీసిన ‘డార్లింగ్... డార్లింగ్’ సినిమా కూడా కొంచెం అదే తరహాలో ఉంటుంది. ఆ సినిమా ప్యాట్రన్‌లో చైల్డ్‌హుడ్ నుంచి లవ్‌స్టోరీ మొదలుపెట్టాలని ఆదిత్య కోరిక. అలాగే ‘అప్పు చేసి పప్పు కూడు’లో రేలంగి పాత్ర అంటే ఆదిత్యకు చాలా ఇష్టం. ఆ ఇన్స్పిరేషన్తో హీరో ఫ్రెండ్ కేరెక్టర్ని డిజైన్ చేశారు. ఇలా ఎమ్మెస్ రాజు, ఆదిత్య కలిసి స్క్రిప్టు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ రోజు ఎమ్మెస్ రాజుకి ఓ సీన్ వినిపించాడు ఆదిత్య. సముద్రపు ఒడ్డున భోరున వర్షం. హీరో ఏడుస్తూ ఉంటే, అతని ఫ్రెండ్ వచ్చి ఓ డైలాగ్ చెబుతాడు. ‘‘ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడూ మనకు మేలు చేస్తుందిరా! మన కన్నీళ్లను ఎదుటివాళ్లకు కనబడకుండా దాచేస్తుంది.’’ ఈ డైలాగ్‌కి ఎమ్మెస్ రాజు మనసు చెమర్చింది. వెంటనే చెక్‌బుక్ తీసి పాతికవేలకు చెక్ రాసిచ్చేశారు. నెక్ట్స్ డే అనౌన్స్మెంట్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, కొత్త కుర్రాడు వి.ఎన్.ఆదిత్యకు డెరైక్షన్ ఛాన్స్ ఇస్తూ చేస్తున్న సినిమా... ‘మనసంతా నువ్వే’. ఆ టైటిల్ కూడా ఎమ్మెస్ రాజు పెట్టిందే. ‘మనసంతా నువ్వే’ని మహేశ్‌బాబుతో చేస్తే? ఎమ్మెస్ రాజుకి ఎగ్జయిటింగ్‌గా ఉందీ ఐడియా. కానీ ఆదిత్య ఏమో కొత్తవాడైతే కరెక్ట్ అంటాడు. ఇప్పటికిప్పుడు కొత్త హీరో ఎక్కడ దొరుకుతాడు? ఆదిత్య దగ్గర ఆప్షన్ ఉంది. ‘చిత్రం’ హీరో ఉదయ్‌కిరణ్. ఇప్పుడు ‘నువ్వు-నేను’ చేస్తున్నాడు. వెంటనే ఎమ్మెస్ రాజు ‘నువ్వు-నేను’ రష్ చూడ్డానికెళ్లారు. ఆ రష్ చూసీ చూడగానే ఈ సినిమాకు ఉదయ్‌కిరణ్‌ను ఫిక్స్ చేసేశారు. ఫైనల్‌గా స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లింది. ఇక్కడే అసలు బాంబు పేలింది. కథ బాలేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సెకండాఫ్ సరిగ్గా లేదు... చైల్డ్ ఎపిసోడ్ అంతసేపు వేస్టు... ఇలా ఒక్కోటీ చెబుతుంటే ఆదిత్య గుండె జారిపోయింది. షూటింగ్కెళ్లే టైమ్‌లో... బ్లాస్ట్. అరకులోయలో ఓ గెస్ట్‌హౌస్. టెన్ డేస్ సిట్టింగ్స్. పరుచూరి బ్రదర్స్... ఎమ్మెస్ రాజు... వీఎన్ ఆదిత్య... వీరూ పోట్ల... స్క్రిప్టు విషయంలో కిందా మీదా పడుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆర్డర్ మారింది. కథ కొత్త మలుపులు తిరుగుతోంది. హమ్మయ్య... మొత్తానికి కథ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డెరైక్టర్. ట్యూన్స్ విరగ్గొట్టేస్తున్నాడు. యాంటిక్ వాచ్ సౌండ్ కోసమైతే ఆర్పీ చాలా కష్టపడ్డాడు. మలయాళంలో విద్యాసాగర్ ‘ప్రణయ వర్ణంగల్’ (1998) కోసం ‘కన్నాడి కూడుంకూట్టి’ పాట చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. దాన్ని యథాతథంగా వాడితే సిట్యుయేషన్ అదిరిపోతుంది. ఇక్కడ అదే ‘తూనీగ... తూనీగ...’ పాట అయ్యింది. 95 పర్సంట్ షూటింగ్ ఓవర్. ఓన్లీ 5 పర్సంట్ బ్యాలెన్స్. అమీర్‌పేట - చర్మాస్ షోరూమ్‌లో హాఫ్ డే షూటింగ్. రీమాసేన్ బట్టలు కొనుక్కోవడానికి వచ్చే సీన్ తీయాలి. లైటింగ్ రెడీ అవుతోంది. ఇంకాసేపట్లో సీన్ తీయాలి. చిత్రనిర్మాణంలో ప్రతి చిన్న అంశాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే ఎమ్మెస్ రాజుకు సడెన్‌గా డౌటొచ్చింది. ఈ సీన్ బట్టల షాపులో కంటే బుక్‌షాప్‌లో తీస్తే బెటరేమో! చిన్నపాటి డిస్కషన్. షూటింగ్ ఆగింది. ఆదిత్య హర్టయిపోయాడు. అలాగే నడుచుకుంటూ బయటికొచ్చేశాడు. కృష్ణానగర్ దాకా వెళ్లాడు. ఏవేవో ఆలోచనలు. ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడీ కోపం వల్ల మొత్తం ప్రాజెక్ట్ డామేజ్ అవుతుంది. అదేదో వాళ్లను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా! ఆదిత్య మళ్లీ వెనక్కు తిరిగొచ్చేశాడు. లొకేషన్లో అందరూ ఆదిత్య కోసం వెతుకుతున్నారు. అప్పటికే పరుచూరి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పడంతో ఎమ్మెస్ రాజు కన్విన్స్ అయ్యారట. అంతా ఓకే... రామానాయుడు స్టూడియో... ఆవిడ్ ఎడిటింగ్ రూమ్‌లో రష్ చూస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఎమ్మెస్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్. గోపాలరెడ్డి... ముగ్గురూ పక్కకెళ్లి సీరియస్ డిస్కషన్. ఆదిత్యకు ఏమీ అర్థం కావడం లేదు. క్లైమాక్స్ తేడా కొట్టేసింది... సినిమా కష్టం... పరుచూరి గోపాలకృష్ణ జడ్జిమెంట్ చెప్పేశారు. ఇదంతా ఎడిటర్ కె.వి. కృష్ణారెడ్డి అబ్జర్వ్ చేస్తున్నాడు. అతను వీళ్ల దగ్గరకొచ్చి ‘‘ఒక్కసారి మళ్లీ క్లైమాక్స్ చూడండి... ఎడిటింగ్‌లో చిన్న ఛేంజ్ చేశాను’’ అన్నాడు. వీళ్లు నిర్లిప్తంగానే లోపలికెళ్లారు. కాసేపటికి బయటికొచ్చిన గోపాలకృష్ణ, ఆదిత్య దగ్గరకొచ్చి ‘‘అదిరిపోయింది’’ అంటూ హగ్ చేసుకున్నాడు. ఎడిటింగ్ మేజిక్. ఫస్ట్ హాఫ్‌లోని ‘నీ స్నేహం’ పాటను మళ్లీ క్లైమాక్స్‌లో యాడ్ చేసేసరికి, ఎక్కడలేని డెప్త్ వచ్చేసింది. 2001 అక్టోబర్ 19. ఎమ్మెస్ రాజు నిర్మాతగా కొత్త ట్రెండ్ సృష్టించిన రోజు... వీఎన్ ఆదిత్య లైఫ్ టర్న్ అయిన రోజు... ఉదయ్కిరణ్కి హ్యాట్రిక్ (‘చిత్రం’, ‘నువ్వు - నేను’, ‘మనసంతా నువ్వే’) పూర్తయిన రోజు... ఎక్కడ చూసినా ‘మనసంతా నువ్వే’ టాపిక్కే. బాక్సాఫీసంతా కనక వర్షమే! - పులగం చిన్నారాయణ -
‘చిత్రం చెప్పిన కథ’ స్టిల్స్
-
ఉదయ్‌కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ
చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం... ఉదయ్‌కిరణ్‌ని నటునిగా ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమాలివి. సముద్రపు అలలా ఉవ్వెత్తున పైకిలేచాడు. తోకచుక్క మాదిరి ఒక్కసారిగా నేల రాలాడు. నిజంగా ఉదయ్ జీవితమే ఒక చిత్రం. తను నటించిన చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’. మోహన్ ఏఎల్ఆర్కే దర్శకుడు. సీహెచ్ మున్నా నిర్మాత. ‘నువ్వు-నేను’ ఫేం అనిత ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గరిమ, డింపుల్, మదాలస శర్మ కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఉదయ్ మనకు దూరమయ్యారు. తనకు కావల్సినట్టుగా అహర్నిశలూ కష్టపడి ఈ కథను మలుచుకున్నాడు ఉదయ్. ఆయనలోని కొత్తకోణం ఇందులో చూస్తారు. ఒక ప్రత్యేకగీతం, చిన్నప్పటి సన్నివేశాల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. ఈ నెలాఖరున పాటల్ని, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఉదయ్‌కిరణ్‌లో ఇప్పటివరకూ చూడని కొత్తకోణం ఇందులో కనిపిస్తుందని, ఆయన అభిమానులకు ఇది గొప్ప కానుకని దర్శకుడు చెప్పారు. ఇది థ్రిల్లర్ చిత్రం కాబట్టి నేపథ్య సంగీతం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోమని ఉదయ్ సూచించారని సంగీత దర్శకుడు మున్నా కాశీ గుర్తు చేసుకున్నారు. ఇంకా మల్టీడైమన్షన్స్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, మాటల రచయిత నరేష్ అమరనేని తదితరులు మాట్లాడారు.


