breaking news
Surakshith Battina
-
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
‘‘అందరికీ మా తాతగారు ‘సోగ్గాడు’గా తెలుసు. కానీ నాకు అంతకన్నా ఎక్కువ. ఆయన ఎంత సక్సెస్ అయినా ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌కి టైమ్ కేటాయించారు’’ అని ప్రముఖ నటుడు శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్ పేర్కొన్నారు. శోభన్‌బాబు హీరోగా నటించిన ‘సోగ్గాడు’ సినిమా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రనిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ డి. సురేష్‌బాబు, అభిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్వర్ణోత్సవం’ జరిగింది. ఈ వేదికపై డా. సురక్షిత్ ఇంకా మాట్లాడుతూ – ‘‘సోగ్గాడు’ తీసినందుకు సురేష్‌బాబుగారికి, ఆయన ఫ్యామిలీకి అభినందనలు.యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్నిబట్టి ‘లెజెండ్స్ మన మనసులను ఎప్పుడూ వదిలి వెళ్లరు’ అని అర్థమవుతోంది. వాళ్లపట్ల మనం చూపించే ప్రేమే ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ‘నేనింత కష్టపడ్డాను...అంత కష్టపడ్డాను’ అని మా తాతగారు ఎప్పుడూ చెప్పలేదు. కానీ మనందరికీ తెలుసు ఎంత కష్టపడ్డారో. చెన్నైలో మండుటెండల్లో సైకిలు మీద ఇంటి నుంచి స్టూడియోలకు వెళ్లడం అలా కష్టపడ్డారు. కానీ ఆ కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. అయితే ఫ్యామిలీలో ఎవర్నీ సినిమాల్లోకి వెళ్లమని ఫోర్స్ చేయలేదు. ఎవరికి నచ్చింది వారిని చెయ్యమన్నారు. అందుకే నేను మెడిసిన్ చేశాను. ఇవాళ తాతగారిని చాలా మిస్సవుతున్నాను.ఎందుకంటే నేను సాధించినవి ఆయన చూడలేదని, ఈ యాభై ఏళ్ల సంబరాలను చూడ్డానికి లేరనే వెలితి ఉంది. ఆయన లెగసీని జ్ఞాపకాల్లో ఉంచుకోవడం మాత్రమే కాదు... నా సేవల ద్వారా కాపాడుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. డి. సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘మాకు ఎంతో ముఖ్యమైన ‘సోగ్గాడు’ చిత్రంలో భాగమైన శోభన్‌బాబు, రైటర్ బాలమురుగన్, విన్సెంట్గార్లు... ఇలా కొంతమంది ఇప్పుడు లేరు. సురేష్‌ప్రోడక్షన్స్ సంస్థ రీ స్టార్ట్ చేసిన సినిమా ఇది. 1975లో నాన్నగారు సురేష్‌ప్రోడక్షన్స్ సంస్థ పెట్టి, ఈ సినిమా తీశారు. ఆ రోజుల్లో ‘సోగ్గాడు’ ఇండస్ట్రీ రికార్డ్స్‌ను ఈజీగా కొట్టిందనుకుంటున్నాను. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల చూశాను.జయచిత్ర, జయసుధగార్లు బాగా నటించారు. సోగ్గాడు పాత్రని శోభన్‌బాబుగారు నిజాయితీగా చేయడంవల్లే ఆయన కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ వేడుకలో సుమలత, బేబీ రాణి, రోజా రమణి, వై. విజయగార్లు... ఇలా అందర్నీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇందాక పి. సుశీలగారు పాడుతున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడూ ఆమె పాటలు పాడుతున్నారు. కళ, పాటల విలువ మరోసారి తెలుస్తోంది’’ అని చెప్పారు. పి. సుశీల మాట్లాడుతూ– ‘‘యాభై ఏళ్ల పండగ ఇది. సురేష్‌ప్రోడక్షన్స్ సంస్థ ఎంత పెద్ద పేరు సంపాదించిందో అందరికీ తెలుసు’’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా, జోరు మీద ఉన్నావు తుమ్మెదా, రాజువయ్యా...’ తదితర పాటలను హమ్ చేశారు. అట్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ– ‘‘శోభన్‌బాబుతో తొమ్మిది సినిమాలు నిర్మించా. ఆయన నటుడు, హీరో కన్నా సినీ ఇండస్ట్రీకి ఆర్థిక మంత్రి అనిపించుకున్న వ్యక్తి. ఇంత వస్తే అంత అని లెక్కలు వేసుకునేవారు. రాజకీయాల్లోకి వెళ్లి, ఆర్థికమంత్రి అయ్యింటే బాగుండేదని ఆయనతో అనేవాడిని’’ అని తెలిపారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘శోభన్‌బాబుగారితో నేను 38 సినిమాలు చేశాను. ఆయనతో నా జర్నీని ఓ పుస్తకంగా రాయవచ్చు’’ అని అన్నారు. ఈ వేడుకలో పి. సుశీల తదితరులను సత్కరించారు. రచయిత, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేశ్‌బాబు, దర్శక–నిర్మాతలు రేలంగి నరసింహారావు, కేఎస్ రామారావు, కేవీ సత్యనారాయణ, అశోక్‌కుమార్, రాజు, రామసత్యనారాయణ, నటుడు రఘుబాబు, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి గౌరవ అధ్యక్షుడు నరసింహారావు, చైర్మన్ సుధాకర్, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, భట్టి్రపోలు శ్రీనివాస్, వీరప్రసాద్, విజయ్ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్‌బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు. -
హీరో ఆఫర్లు వద్దని.. స్టార్‌గా మారిన శోభన్ బాబు మనవడు ...
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నట భూషణుడు శోభన్ బాబు(Sobhan Babu).. ఎన్టీయార్, కృష్ణ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా మహిళాదరణలో ఆయనకు సాటిలేదు. తన సమకాలీకులైన మిగిలిన హీరోల్లా కాకుండా సినీరంగానికి దూరమైన తర్వాత ఆయన కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు పబ్లిక్ లైఫ్ నుంచే అదృశ్యం అయిపోయారు. అంతేకాదు ఆయన వారసులను కూడా ఎవరినీ సినీ రంగంలోకి పరిచయం చేయలేదు. దాంతో ఆయన దివంగతులయాక ఆయన వారసులకు సంబంధించిన విశేషాలు కూడా ఎక్కడా పెద్దగా వెలుగు చూడలేదు. ఈ నేపధ్యంలో తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారంటూ వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి రేకెత్తించాయి. అలనాటి అందాల నటుడి రూపాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు... పలు సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన సురక్షిత్...సార్ధక నామధేయుడిగా మారి ఎంచుకున్న రంగంలో స్టార్ అనిపించుకుంటున్నారు.(చదవండి: రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?)తమిళనాడులో స్థిరపడ్డ ఆయన సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో తాతకు తగ్గ మనవడుగా రాణిస్తుండడం అందర్నీ ఆకర్షిస్తోంది. దాదాపు 4.5 కిలోల గర్భాశయాన్ని అత్యాధునిక సాంకేతికత ద్వారా తొలగించి డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు గర్భాశయంలో భారీ కణితి ఏర్పడింది. ఇతర ఆస్పత్రులు ఓపెన్ సర్జరీ తప్ప మార్గం లేదని సూచించగా, డాక్టర్ సురక్షిత్ 3డీ ల్యాపరోస్కోపిక్ సాంకేతికతను ఉపయోగించి 8 గంటల పాటు శ్రమించి ఆ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. అంతేకాదు 2019లో డాక్టర్ సురక్షిత్ గురువైన డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి సాధించిన గిన్నిస్ రికార్డును బద్దులు కొట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు.సేవాస్టార్..డాక్టర్ సురక్షిత్ చెన్నైలోని అన్నా నగర్లో 2016లో ఇండిగో ఉమెన్స్ సెంటర్‌ను స్థాపించారు. తన కెరీర్లో ఇప్పటివరకు 10,000కు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 40కి పైగా అవార్డులు అందుకున్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు శోభన్ బాబు పేరుతో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. టెడెక్స్ స్పీకర్, ఫిట్నెస్ ఫ్రీక్ డిజిటల్ విద్యావేత్త అయిన డాక్టర్ సురక్షిత్ బత్తినకు సెలబ్రిటీల స్థాయిలో 1.65లక్షలకు పైగా ఇన్‌స్ట్రాగామ్ ఫాలోయర్స్ ఉండడం విశేషం. ఆయన శాస్త్రీయ విధానాలను సలహాలను వ్యాప్తి చేస్తున్నారు. ‘భారతదేశ సంతానోత్పత్తి రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఐవీఎఫ్ లాంటి కార్పొరేట్ సంస్కృతికి వ్యతిరేకం అయినప్పటికీ... వంధ్యత్వానికి మూల కారణాలకు చికిత్స చేయడం సహజ గర్భధారణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేంగా కృషి చేస్తున్నాను‘ అని డాక్టర్ బత్తిన చెబుతున్నారు.


