డాలర్ విలువ పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు వంటివన్నీ బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి. దీంతో గోల్డ్ రేటు వరుసగా రెండోవారం కూడా తగ్గుతూనే ఉంది. డిసెంబర్ నాటికి ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.
రూ. 1,25,000 దాటేసిన 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతూ.. ఈ రోజు (నవంబర్ 02) రూ. 1,23,000 వద్ద నిలిచింది. ధరల తగ్గుదల ఇదే విధంగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో గరిష్ట స్థాయి నుంచి ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరిందని.. స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అండ్ వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు & సీఈఓ స్నేహ జైన్ అన్నారు.
ధరలు తగ్గడానికి కారణమైన అంశాలు
అక్టోబర్ ప్రారంభంలో బంగారం కొంతకాలం జీవిత కాల గరిష్టాలను తాకిన తర్వాత ఈ తగ్గుదల నమోదైంది. ఈ వారం పరిణామాలు బంగారం విషయంలో చాలావరకు ప్రతికూలంగా ఉన్నాయని రిటైల్ బ్రోకింగ్ & డిస్ట్రిబ్యూషన్ సీఈఓ అండ్ పీఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రైచురా అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి, ట్రంప్-జిన్‌పింగ్ చర్చలు సానుకూలంగా ఉన్నాయి. భారతదేశంలో పండుగ సీజన్ కూడా ముగిసింది. ఈ అంశాలన్నీ స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని ఆయన పేర్కొన్నారు.
ఊహకందని మార్పులు
రెండు వారాల పాటు ఒడిదుడుకుల తర్వాత వెండి ధరలు తిరిగి స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలు దాటేసిన సిల్వర్ రేటు రూ. 1.66 లక్షలకు చేరింది. ఈ ధర మరింత తగ్గుతుందని వెల్త్‌ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్‌కు చెందిన జైన్ పేర్కొన్నారు. కాగా భవిష్యత్తులో రేట్ల తగ్గుదల అనేది.. స్థూల ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటాయని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు లోహాల ర్యాలీని చల్లబరిచాయని వెంచురాలోని కమోడిటీస్ & సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి అన్నారు. మొత్తం మీద పసిడి ధరలలో ఊహకందని మార్పులు జరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
తగ్గిన దిగుమతి ధరలు
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు తగ్గింది. వెండి దిగుమతి ధర కేజీకి 107 డాలర్లకు తగ్గింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా తీసుకున్నది. దీని ఉద్దేశం దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. తద్వారా ధరలలో వ్యత్యాసం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: పెళ్లిళ్ల సీజన్: రూ.6.5 లక్షల కోట్ల బిజినెస్!


