కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చిన బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి కేసులో మరో కీలక సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. చర్మవ్యాధి నిపుణురాలైన భార్య డాక్టర్ కృతిక రెడ్డిని మత్తుమందిచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నమహేంద్ర రెడ్డి నేరం చేసిన కొద్దిసేపటికే "నీకోసమే నా భార్యను చంపేశాను" అనే సందేశాన్ని ప్రియురాలికి పంపించిన వైనం కలకలం రేపుతోంది.
దర్యాప్తు అధికారుల ప్రకారం, డిజిటల్ చెల్లింపు యాప్‌లో పనిచేసే మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు మహేంద్ర రెడ్డి. భార్య చనిపోయిన వెంటనే ఆమెకు వాట్సాప్ ద్వారా నీకోసమే భార్యను చంపేశాననే మెసేజ్‌ను పంపించాడు. నిందితుడు ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ సమయంలో పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ మహిళను విచారించి ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ ఎవరు? ఏంటి? అనే విషయాలను ఇంకా వెల్లడించలేదు.

కాగా బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ మహేంద్ర రెడ్డి, డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతిక రెడ్డికి గత ఏడాది మే 26న వివాహం జరిగింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 21న మున్నెకొల్లాల్‌లోని వారి నివాసంలో కృతిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై మరాఠహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతని ఇంట్లో సోదాలు చేసినపుడు కాన్యులా సెట్, ఇంజెక్షన్ ట్యూబ్ ,ఇతర వైద్య వస్తువులతో సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి అంతర్గత అవయవాల నమూనాలను కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కృతిక శరీరంలో 'ప్రోపోఫాల్' అనే శక్తిమంతమైన అనస్థీషియా ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఇది హత్యేనని నిర్ధారణ కావడంతో మృతురాలి తండ్రి అక్టోబర్ 13న తన అల్లుడే మత్తుమందు ఇచ్చి కూతురిని హత్య చేశాడని ఫిర్యాదు నమోదు చేశారు. తన భార్య మరణాన్ని సహజంగా చూపించడానికి అతను తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 14న కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న నిందితుడు మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
