‘రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్’ | sajjala ramakrishna reddy slams chandrababu,nara lokesh | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్’

Nov 3 2025 6:45 PM | Updated on Nov 3 2025 7:29 PM

sajjala ramakrishna reddy slams chandrababu,nara lokesh
  • రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యం

  • నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతున్న కూటమి ప్రభుత్వం

  • జోగి రమేష్ అక్రమ అరెస్టు దుర్మార్గం

  • చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ కు వికృతరూపం

  • ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి.

  • కూటమి పాలనలో నిర్వచనం మారిన ప్రభుత్వం

  • ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు నిర్వీర్యం

  • రాష్ట్రంలో ప్రజాహక్కులు కరిమింగిన వెలగపండు
    : చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన సజ్జల రామకృష్ణా రెడ్డి

  • స్వప్రయోజనాలే లక్ష్యంగా కూటమి పాలన

  • ప్రతిపక్షం, ప్రజల ఆకాంక్షల గొంతు నొక్కుతున్న ప్రభుత్వం

  • ఉద్దేశపూర్వకంగా, క్రూరంగా, అణిచివేస్తున్న చంద్రబాబు

  • ఈ దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్

  • రాష్ట్రంలో నడుస్తుంది నారా వారి రూల్ ఆఫ్ లా
    : ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించిన సజ్జల రామకృష్ణా రెడ్డి

సాక్షి,తాడేపల్లి: రాజ్యాంగ ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ.. రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని.. వైయస్సార్సీపీ స్టేటే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృతరూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని.. కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతుందని మండిపడ్డారు.   రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే...  రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదముందని.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, మీడియా వీటిని అధ్యయనం చేసి.. జరుగుతున్న దారుణాలను ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

రాష్ట్రంలో ప్రభుత్వం శూన్యం..
2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం అన్నమాటకు నిర్వచనమే మారిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోరికలు, ఆకాంక్షలన్నింటికీ ఫలానా పార్టీ పరిష్కరిస్తుందని ఎన్నుకుంటారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక భాగం అయితే రెండోది.. పరిపాలన. పాలనా పరమైన  విధులన్నీ అధికారులు చేస్తున్నప్పుడు .. ప్రభుత్వం అవసరం ఎందుకంటే అది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మేనిఫెస్టోను అమలు చేస్తుంది. అదే ప్రజాస్వామ్యం. అది ఏ మేరకు నెరవేరుతుందన్నది వేరే విషయం. అలా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక పద్దతి ప్రకారం నడవడానికి అవసరమైన మార్గదర్శకం ఇచ్చి నడిపే ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది అనుకుంటే.. అది 2024 జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో శూన్యం అయింది. 

పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ  ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు.  ఆ నేరస్వభావాన్నే ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ.. బ్యూరోక్రాట్స్ లో అలాంటి వాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారు. కానివాళ్లను మెడలు వంచడమే, దూరం పెట్టడమే చేస్తుండడంతో వాళ్లు కూడా గత్యంతం లేక అదే దారిలో పయనిస్తున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో వ్యవస్థలను తమ నేర స్వభావాలకు అనుకూలంగా... తాము చేసే తప్పులకు ప్రొటెక్ట్ చేసేదిలా మార్చివేస్తున్నారు.

టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ...
మాజీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్ ను ఏ తప్పు చేయకుండా అక్రమంగా  అరెస్టు చేశారు. ఈ కేసు చూస్తే... నేరం జరుగుతున్న మొలకల చెరువు, ఇబ్రహీం పట్నం, అనకాపల్లి, ఏలూరులో నకిలీ మద్యం తయారీ చేస్తున్న చోట పోలీసులు పట్టుకున్నారు.  నిన్నా, మొన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మా పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ 2024 అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు అవుతుంది. ఒకవైపు  వైయస్సార్సీపీ నాయకుల తప్పు లేకపోయినా... వారిని అరెస్టులు చేస్తుంటే... రెండేళ్లుగా నకిలీ లిక్కర్ తయారీ మొత్తాన్ని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ ఉన్నాడంటూ అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెట్టడంతో మొదలై... వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తూ.. తప్పుడు స్టేట్ మెంట్లతో వేరేవాళ్లను అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు.

ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు..
పల్నాడు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు నమోదు చేసారు. స్ధానిక టీడీపీ నాయకులు వాళ్ల మధ్య అంతర్గత కలహాలతో గొడవపడి జంట హత్యలు జరిగితే... దాని మీద ఎస్పీ కూడా ఇది టీడీపీ అంతర్గత విభేదాల వల్లే అని ప్రకటన ఇచ్చినా, ఘటనా స్ధలంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాహనంతో సహా పలు ఆధారాలున్నా.. వైయస్సార్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను జైల్లో పెట్టారు.
ఇటీవల సోషల్ మీడియా యాక్టవిస్టు సవీంద్ర రెడ్డిను ఏదో పోస్టు పెట్టారని అరెస్టు చేసి.. కన్ఫషన్ కింద వేరకొటి నమోదు చేసి.. అదీ సరిపోదనుకుని ఏకంగా గంజాయి ప్యాకెట్ పెట్టి కేసు నమోదు  చేశారు. అయితే అదృష్టవశాత్తూ అరెస్టు చేసిన టైమింగ్ ఆధారాలు, పోలీసులు చెప్పిన విషయాలు సరిపోలకపోవడంతో హైకోర్టు సీబీఐకి రిఫర్ చేయడంతో ఆయన బైటపడ్డాడు. అదే కేసులు మరికొంత యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

టీడీపీ నేతల తప్పులనూ వైఎస్సార్సీపీకి అంటగట్టే దుర్మార్గం..
ఇక తునిలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంలో ఈ ఘాటుకానికి పాల్పడింది కూడా టీడీపీ నేతే. టీడీపీ నేతను పట్టుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘాతుకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆందోళన రావడంతో ఉలిక్కపడ్డ ప్రభుత్వం, పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెప్పారు. మరుసటి రోజు లైంగిక అకృత్యానికి పాల్పడ్డ వ్యక్తి కుమారుడు తన తండ్రి మరణంపై అనుమానం ఉందని కేసు పెట్టాడు. మరోవైపు మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్డడ్డ వ్యక్తిని వీడియో తీసి... బాలిక చదువుతున్న స్కూల్ కి పంపిస్తే... దానికి అతనిపై చనిపోయిన వ్యక్తి కుమారుడు చేత ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అందులో అదర్స్ అని రాయడం ద్వారా వైయస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

నేరం చేసిన వాళ్లకు సంబంధించి అనుమానాస్పదంగా చనిపోయాడని చెబుతూ...   నిందితుల తరపున ఎందుకు వకాల్తా తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉన్నాయి. జోగి రమేష్ అరెస్టులో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారు.. ఆధారాలు సైతం అక్కడే ఉంటే... ఇక్కడ విజయవాడలో జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టడానికి కూడా జనం నమ్ముతారా ? కోర్టులో నిలబడుతుందా? అన్నది ఆలోచించడం లేదు. ఇవాల్టికి అరెస్టు చేసి.. రెండు మూడు నెలలు జైల్లో వేస్తే.. మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని భావిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారి జయచంద్రా రెడ్డి, అతనే ఫ్యాక్టరీ పెట్టాడు, అతనికి సంబంధించిన బార్లలో నకిలీ లిక్కర్ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులే  చెప్పారు. అతను సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, కానీ వారి అరెస్టులు మాత్రం ఉండవు.

నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జయచంద్రా రెడ్డికి చంద్రబాబు బీఫామ్ ఇస్తున్న దృశ్యం చూస్తే.. జనరల్ గా బీపామ్ తీసుకున్నప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి పక్కనే ఆయన ఆత్మలా జనార్ధనరావు పక్కనే ఉన్నాడు. ఇది పక్కన పెట్టి.. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం జోగి రమేష్ తో ఏదో పెళ్లిలో జనావర్ధన రావు ఫోటో దిగితే దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుతో బీపామ్ తీసుకుంటున్న జయచంద్రా రెడ్డి, పక్కనే జనార్ధన రావు ఉంటే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. వీళ్లద్దరూ ఆఫ్రికాలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. 

వాస్తవానికి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ వ్యవహారం బయటపడ్డంతోనే రాష్ట్రంలో ఒక దుమారం చెలరేగింది. మద్యం సేవించే వారిలోనూ ఒక భయం మొదలైంది.  దీన్ని డైవర్షన్ చేయడానికి.. సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడం అలవాటైన చంద్రబాబు...  తక్షణమే నకిలీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ వైపు తిప్పాడు. జోగి రమేష్ , వైయస్సార్సీపీకి దెబ్బ కొట్టడంతో పాటు, తన పార్టీ నేతలైన జయచంద్రారెడ్డి ఇతరులను కాపాడే ప్రయత్నం చేశాడు. 

ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆఫ్రికాలో ఉన్న జనార్ధన రావుతో ముందే మాట్లాడుకుని అతడ్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులో జనార్ధరావు  చొక్కా, పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన పేరు మీద విడుదల చేసిన వీడియోలో చొక్కా రెండూ ఒకటే.  ఇదెలా సాధ్యం. మరో కీలకమైన విషయం జనార్ధన రావు ఫోన్ దొరికితే అందులో జయచంద్రా రెడ్డితో పాటు టీడీపీ నేతల వివరాలు, వారి లావాదేవీలు బయటపడతాయి కాబట్టి ముంబాయిలో పోన్ పోయిందని చెప్పారు. ఆ తర్వాత జనార్ధన రావు ఒక వీడియో విడుదల చేశాడు. ఇది ఎలా అతుకుతుంది.

ఆగని నకిలీ లిక్కర్ తయారీ...
లిక్కర్ బాటిల్లు చూసి కొనండి.. క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అంటే నకిలీ లిక్కర్ తయారిని ప్రభుత్వం అంగీకరించింది. వైన్ షాపులలో క్యూ ఆర్ కోడ్ పెడతారు సరే.. బెల్టు షాపులలో  ఏం క్యూఆర్ కోడ్ ఉంటుంది. అక్కడెలా నకిలీ లిక్కర్ ని నియంత్రిస్తారు. రాష్ట్రంలో లక్షకు పైగా బెల్టు షాపులున్నాయి. వీటి ద్వారా ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఇవి కాక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు. అక్కడ లూజ్ సేల్ ఉంటుంది. అంటే అక్కడ కూడా నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోడా మిషన్లు మాదిరిగా కూటమి పాలనలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. దానికి సాక్ష్యం బెల్టు షాపుల్లో జరుగుతున్న అమ్మకాలే. ప్రభుత్వానికి అంతంత మాత్రం ఆదాయం పెరిగింది.  లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇదే నిదర్శనం. జోగి రమేష్ అరెస్టు అత్యంత దుర్మార్గం, అన్యాయం. నియంతల పాలనలో కూడా లేనంతగా వ్యవస్దలను కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేసి... హిట్లర్ కంటే దారుణంగా పాలన సాగిస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ దారుణాలన్నీ కొనసాగిస్తున్నాడు.

తప్పులు నిలదీస్తే కేసులు - నారా వారి రూల్ ఆఫ్ లా...
కేవలం తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహతోనే, క్రూరమైన, అణిచివేత ధోరణితో కూడిన పాలన సాగిస్తున్నారు. ప్రత్యర్థుల వాయిస్, ప్రజల ఆకాంక్షలు బయటకు వినిపించకుండా గొంతు నొక్కడంతో పాటు వీరి చేస్తున్న దుర్మార్గాలను ఎదుట వాళ్ల మీద నెట్టడంలో వీళ్లు సిద్ధహిద్దులు. లోకేష్ వీటన్నింటికీ ఆద్యుడు. ముందు అరెస్టు చేసి.. సెల్ఫ్ కన్ఫెషన్ పేరుతో వారే స్టేట్ మెంట్లు తయారు చేస్తున్నారు. కోర్టుల్లో నిలబడినా, లేకున్నా ముందుగా జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

కూటమి ప్రభుత్వంలో ఏ కేసు తీసుకున్నా మూడు అంశాల మీదే నడుస్తుంది. తామనుకున్న వారిని అరెస్టు చేయడం, వారి పేరు మీద స్టేట్మెంట్ రాసుకోవడం, ఎవరి మీద వాళ్లకు కోపం ఉంటే.. వాళ్ల స్ధాయిలను బట్టి వారి పేర్లు కూడా కేసులో చేర్చడం పనిగా మారింది. ఇలా నెలల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నారా వారి కొత్త రూల్ ఆఫ్ లా. కన్ఫెషన్ పేరుతో అరెస్టు చేయడం, తమకు నచ్చిన సెక్షన్లతో కేసు నమోదు చేయడం అలవాటుగా మారింది. అరెస్టు చేసిన తర్వాత వాళ్ల ఇంట్లో సోదాలు చేసి... అక్కడ పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు చూపిస్తున్నారు. అవి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తమకు కావాల్సిన అధారాలను వీళ్లే అక్కడ పెట్టి.. వాటినే కోర్టులో ఎవిడెన్స్ గా పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి.

నిష్పాక్షపాతంగా దర్యాపు చేయడానికి ఇన్వెస్టిగేషన్ అధికారికి చట్టానికి లోబడి ఇచ్చిన వెసులుబాటును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆమాత్రం వెసులు బాటు ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా ముగుస్తుందని అనుకుంటున్న పరిస్థితి. దానివల్ల నేరం చేయకుండా కూడా అధికారంలోకి ఉన్నవాడికి నచ్చకపోతే శిక్షకు గురవుతావన్నది రుజువు అవుతుంది.  శిక్ష కరారు కాకముందే.. నిందితుడు 50 రోజులో, 60 రోజులో... ఏ నేరం చేయకున్నా, ఆధారాలు లేకున్నా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. ఈ కేసులో నిజానికి ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది కాబట్టే... లిక్కర్ షాపులలో మద్యం బ్యాటిళ్లకు క్యూ ఆర్ కోడ్ పెట్టింది. 
దీన్ని అందరూ గమనించాలి.

ప్రజా రక్షణ పట్టని ప్రభుత్వమిది
కాశీబుగ్గ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రమాదం అంటేనే అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరూ ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించరు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పోలీసులదే. కాశీబుగ్గ ఘటన జరిగిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు దేవాలయం అని ప్రకటించారు. ఘోరం జరిగిన వెంటనే అది మాది కాదు అన్నారంటే.... తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. సిగ్గున్న ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఏ మాత్రం బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే.. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, సింహాచలంలో ప్రమాదం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. కారణం మీ ప్రాధాన్యాతలు వేరు. బాథ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా  ప్రభుత్వం భావించడం లేదు.  వ్యవస్ధలో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా... దాన్నుంచి తప్పించుకోవడంతో పాటు పక్కవారిమీదకు నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆలయ ధర్మకర్త తాను ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. 

ఒకవేళ చెప్పకపోయినా.. రెండేళ్ల నుంచి నిర్వహణలో ఉన్న ఆలయంలో పవిత్ర దినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలియదా?  పలాస లాంటి పట్టణంలో ఒకే దగ్గర అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటే నాకు తెలియదని ఎలా తప్పించుకుంటారు ?  చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాల బలం తలకెక్కడంతో దేన్నీ పట్టించుకోవడం లేదు. ఏం జరిగినా ఎదుట వాళ్లదే తప్పు అని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడమో.. సంబంధిత అధికారులను బాధ్యులను చేయకుండా... విచారణ చేయకుండానే,  అసలేం జరగలేదని ముందే చెబితే ఇది ఏ రకమైన పాలన?  ఎక్కడైనా సమస్య వచ్చినా పోలీసులో, అధికారులో చూసుకుంటారు, వారికి ఆ మేరకు అవగాహన ఉంటుందని ప్రజలు భావిస్తారు. ధైర్యంగా ఉంటారు. అలా ఉండే వారిని కూడా ప్రభుత్వం నీరుగార్చుతుంటే... ఇలాంటి పాలనే ఉంటుంది.

రెండేళ్లలోనే రాష్ట్రంలో ఇంతటి దారుణంగా ఉంటే రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో జరుగుతున్న దారుణాలను మీడియా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు స్టడీ చేసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే తప్పు చేసి ఎదుట వారి మీద కేసులు పెట్టి.. ఆ తప్పును కొనసాగించడం మరింత దారుణమని మండిపడ్డారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement