
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని.. వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధపాతాళానికి దళితులను తొక్కేశారని.. వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు.
‘‘అంబేద్కర్ అందరివాడే, కానీ చంద్రబాబు కొందరివాడు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదు?. సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర ఉన్న వైఎస్ జగన్ పేరును ఎందుకు తొలగించారు?. దళితులకు ఏ పథకం అందించకుండా వారి ఇళ్లకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు?.
..బ్లాక్ క్యాట్ కమాండోల సెక్యూరిటీ లేకుండా దళితుల ఇళ్లకు వెళ్లగలరా?. దళితుల ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న చంద్రబాబు వైఖరిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దళితులను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడితే చంద్రబాబు అతన్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు?’ అంటూ టీజేఆర్ ప్రశ్నలు గుప్పించారు.
‘‘రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత లోపిస్తుందంటూ కోర్టులో కేసు వేశారు. దళితులను తొలగించి అక్కడ చంద్రబాబు ఎలా ప్యాలెస్ కట్టుకుంటున్నారు?. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వారిని చట్టసభలకు పంపించటానికి ఎందుకంత వివక్ష చూపుతున్నారు?. అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు. చంద్రబాబుని దళితవాడల్లోకి రాకుండా అడ్డుకుంటాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు.
