ప్రముఖ వ్యాపార వేత్త, హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందుజా (85) (Hinduja Group Chairman Gopichand) కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లో తుది శ్వాస విడిచారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరుగాంచిన గోపీచంద్ హిందూజా బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్ కుమార్తె రీటా ఉన్నారు. గోపీచంద్ మరణంపై పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు సంతాపం ప్రకటించారు.
1950లో కుటుంబ వ్యాపారంలోకిప్రవేశించి కంపెనీని ఇండో-మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ నుండి ఒక అంతర్జాతీయ కంపెనీగా మార్చడంలో ఘనత పొందారు. ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలోని రెండవ తరానికి ప్రాతినిధ్యం వహించిన గోపీచంద్ పి హిందూజా, తన అన్నయ్య శ్రీచంద్ పి హిందూజా మరణం తర్వాత, మే 2023లో బహుళజా సంస్థ హిందూజా గ్రూప్ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు సాంప్రదాయ వ్యాపార కుటుంబంలో జన్మించిన గోపీచంద్ హిందూజా 1959లో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించి, ముంబైలోని కుటుంబ సంస్థలో చేరారు. దశాబ్దాలుగా, ఒకప్పుడు ఇండో-మిడిల్ ఈస్ట్ వాణిజ్య వ్యాపారాన్ని 30 కంటే ఎక్కువ దేశాలలో ఉనికితో ప్రపంచ పారిశ్రామిక సమ్మేళనంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆయన నాయకత్వంలో, గ్రూప్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ, ఆటోమోటివ్, మీడియా మరియు మౌలిక సదుపాయాలతో సహా అనేక రంగాలలోకి విస్తరించింది. 1984లో గల్ఫ్ ఆయిల్ , 1987లో అశోక్ లేలాండ్, భారతదేశంలో ప్రవాస భారతీయులు (NRIలు) చేసిన తొలి ప్రధాన పెట్టుబడులు ఆయన హయాంలో జరగడం విశేషం.
హిందూజా గ్రూపు
హిందూజా గ్రూప్‌ను 1919లో పరమానంద్ దీప్‌చంద్ హిందూజా స్థాపించారు, అతను సింధ్ (అప్పుడు అవిభక్త భారతదేశంలో, ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది) నుండి ఇరాన్‌కు వెళ్లారు. ఆ తరువాత 1979లో తన స్థావరాన్ని ఇరాన్ నుండి లండన్‌కు మార్చింది. అప్పటినుంచి కంపెనీ ప్రపంచ విస్తరించింది. ప్రస్తుతం ముంబై ప్రధాన కార్యాలయం కలిగిన గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షలమంది మందికి ఉపాధి కల్పిస్తోంది.
చదవండి: జుకర్‌బర్గ్‌కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్‌లోకి
ఈ వ్యాపార సామ్రాజ్యంతోపాటు, హిందూజా గ్రూపు రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోకు కూడా ప్రసిద్ధి చెందింది. దాని అత్యంత విలువైన ఆస్తులలో వైట్‌హాల్‌లోని ఓల్డ్ వార్ ఆఫీస్ భవనం. ఇది లండన్‌లోని చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్.ఈ భవనాన్ని సెప్టెంబర్ 2023లో ప్రారంభించిన రాఫెల్స్ లండన్ హోటల్‌గా తిరిగి అభివృద్ధి చేశారు. అంతేకాదు గోపీచంద్ హిందూజా కుటుంబం UKలో అత్యంత ధనవంతులు కూడా. బిజినెస్‌లోనూ, దాతృత్వానికి చేసిన కృషికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు గోపీచంద్.
చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్


