20 శాతం వాటా కొనుగోలుకి రెడీ
రూ. 39,618 కోట్ల పెట్టుబడులు
ఫైనాన్షియల్ రంగంలో భారీ డీల్
ఇటీవల దేశీ ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోగా, యస్ బ్యాంక్‌లో జపనీస్ దిగ్గజం ఎస్‌ఎంబీసీ సైతం 25 శాతం వాటా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రీరామ్ ఫైనాన్స్‌లో జపనీస్ దిగ్గజం ఎంయూఎఫ్‌జీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రీరామ్ ఫైనాన్స్‌లో జపనీస్ దిగ్గజం మిత్సుబిషీ యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్(ఎంయూఎఫ్‌జీ) 20 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రెండు సంస్థలు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు అనుగుణంగా శ్రీరామ్ ఫైనాన్స్ 47.11 కోట్ల ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 840.93 ధరలో వీటిని ఎంయూఎఫ్‌జీ కొనుగోలు చేయనుంది.
తద్వారా శ్రీరామ్ ఫైనాన్స్‌లో 4.4 బిలియన్ డాలర్లు(రూ. 39,618 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఇది నిలవనుంది. తాజా డీల్.. దేశీ ఫైనాన్షియల్ రంగ పటిష్టత, వృద్ధి అవకాశాలపట్ల విశ్వాసానికి ప్రతీకగా శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ ఉమేష్ రేవంకర్ పేర్కొన్నారు. వాటాదారుల అనుమతి, నియంత్రణ సంస్థల క్లియరెన్స్‌ల తదుపరి ఎంయూఎఫ్‌జీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ వెల్లడించింది.
తాజా నిధులు సంస్థ మూలధన పటిష్టతకు, దీర్ఘకాలిక వృద్ధికి సహకరిస్తాయని తెలియజేసింది. ఎంయూఎఫ్‌జీతో భాగస్వామ్యం చౌక నిధుల సమీకరణ, మెరుగైన క్రెడిట్ రేటింగ్స్‌కు వీలు కలి్పంచడంతోపాటు, పాలన, నిర్వహణలో ప్రపంచ ప్రమాణాల సరసన నిలుపుతుందని పేర్కొంది. శ్రీరామ్ ఫైనాన్స్ వృద్ధికి మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఎంయూఎఫ్‌జీ గ్రూప్ సీఈవో హిరొనోరీ కమెజావా పేర్కొన్నారు. తద్వారా భారత్‌లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తమవంతు పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు.
ఇద్దరు డైరెక్టర్లు
శ్రీరామ్ ఫైనాన్స్‌లో 20 శాతం వాటా చేజిక్కించుకున్నాక బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను నియమించే ప్రణాళికల్లో ఉన్నట్లు ఎంయూఎఫ్‌జీ వెల్లడించింది. భారత్‌లో యొకొహామా స్పెసీ బ్యాంక్ ముంబై బ్రాంచ్‌తో 1,894లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ 1.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి కలి్పంచింది. గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ ప్రారంభించిన తొలి జపనీస్ బ్యాంక్‌గా నిలుస్తోంది.
2023లో డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసులందిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ డీఎంఐ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యూఏఈలో రెండో పెద్ద సంస్థ ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్‌లో దేశీ ప్రయివేట్ రంగ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచి్చంచింది. అంతకుముందే మరో ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్‌ఎంబీసీ) 24 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 16,330 కోట్లకుపైగా వెచ్చించింది.


