విద్యార్థుల కోసం తొలిసారిగా రీఇమేజిన్ ఐడియాథాన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా (సీడీఎస్‌ఎల్) వెల్లడించింది. మార్కెట్లలో పెట్టుబడుల గురించి తెలుసుకోవడంలోను, ఇన్వెస్ట్ చేయడంపైన అవగాహన పెంచే సొల్యూషన్స్‌ను రూపొందించేలా ప్రోత్సహించేందుకు తమ 3వ వార్షిక రీఇమేజిన్ సింపోజియం కింద దీన్ని చేపట్టినట్లు వివరించింది.
ఒక్కో సంస్థ నుంచి నలుగురు విద్యార్థులు, ఒక మెంటార్ కలిసి బృందంగా ఏర్పడి, ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం రూ. 11.5 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. విజేతగా నిల్చే ఐడియాకి రూ. 5 లక్షలు, రన్నర్స్ అప్‌కి రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల చొప్పున బహుమతులు ఉంటాయి. గేమిఫికేషన్, డిజైన్, టెక్నాలజీ మొదలైన విభాగాల్లో విద్యార్థులు సొల్యూషన్స్‌ని రూపొందించవచ్చు.
స్టాన్‌లో హైదరాబాద్ ఏంజెల్స్ పెట్టుబడులు
సోషల్ గేమింగ్ ప్లాట్‌ఫాం స్టాన్‌లో సిరీస్ ఏ కింద 8.5 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు హైదరాబాద్ ఏంజెల్స్ ఫండ్ (హెచ్‌ఏఎఫ్) వెల్లడించింది. (Hyderabad Angels Fund invests in STAN) గేమింగ్, క్రియేటర్ ఎకానమీ విభాగంలో ఇది తమకు తొలి పెట్టుబడి అని వివరించింది. సిరీస్ ఏ కింద స్క్వేర్ ఎనిక్స్, రీజొన్ హోల్డింగ్స్, సోనీ గ్రూప్‌కి చెందిన సోనీ ఇన్నోవేషన్ ఫండ్ మొదలైనవి కూడా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది.
పార్థ్ చడ్ఢా, రాహుల్ సింగ్, నౌమాన్ ముల్లా ప్రారంభించిన స్టాన్.. దాదాపు 2.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి. 2023లో హైదరాబాద్ ఏంజెల్స్ నెట్‌వర్క్ (హెచ్‌ఏఎన్) విభాగంగా ప్రారంభమైన హెచ్‌ఏఎఫ్ సుమారు రూ. 100 కోట్ల ఫండ్ ద్వారా ప్రారంభ దశలో, వృద్ధి దశలో ఉన్న అంకురాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఒక్కో స్టార్టప్‌లో రూ. 2–4 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రధానంగా అధిక వృద్ధి అవకాశాలు గల 10–15 సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించింది.


