శతాబ్ది వేడుకల వేళ దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట
సమస్యలను ప్రశ్నించే గొంతుకల అణచివేత
తనను ఎవ్వరూ కలవడానికి వీల్లేదంటూ వైస్ చాన్సలర్ హుకుం
సమస్యలుంటే కింద స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సలహా
వర్సిటీలోకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతి
విశాఖ ప్రజలకు నిత్యం వర్సిటీతో విడదీయరాని అనుబంధం
కానీ, నేడు వర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం
పండగ సెలవులు వస్తే విద్యార్థులు హాస్టల్ వీడి వెళ్లాల్సిందే!
చంద్రబాబు బంధుప్రీతి, స్థానిక ఎంపీ మేలు కోసం ఏయూ బలి
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఆంక్షలు, నిబంధనల పేరిట విద్యార్థులు, సిబ్బంది స్వేచ్ఛాయుత హక్కులను కాలరాస్తోంది. వర్సిటీ పాలకుల చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. శతాబ్ద చరిత్ర కలిగిన ఏయూలో ఇప్పుడు ఎన్నడూ లేనంతగా కంటికి కనిపించని కంచెలు వేసి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
సాక్షి, అమరావతి : ఒకప్పటి ఏయూను ఊహించుకుని ఎవరైనా ఇప్పుడు స్వేచ్ఛగా క్యాంపస్‌లోకి అడుగుపెడదామంటే కుదరదు. వచ్చినోళ్లను వచ్చినట్లు గేటు దగ్గరే ఆపేస్తారు. వర్సిటీ ఐడీ కార్డు ఉంటేనే ప్రవేశం. విద్యార్థుల కోసం వచ్చే తల్లిదండ్రులైనా.. సర్టిఫికెట్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులైనా గేటు బయట నిలబడాల్సిందే. సీఎం చంద్రబాబు బంధుప్రీతి, రాజకీయ కార్పొరేట్ల కబంధ హస్తాల్లో బం«దీగా మారిన ఏయూలోని పాలకవర్గం ఈ అనిశి్చతిని ప్రేరేపించే నిబంధనలను ఇష్టారాజ్యంగా ప్రవేశపెడుతోంది. ఇక్కడ విద్యార్థులకు స్వేచ్ఛగా బోధించే పరిస్థితిలేదు. సమస్యలను సత్వరం పరిష్కరించే యంత్రాంగంలేదు. వర్సిటీలో ఎవరైనా ఇది మంచి.. ఇది చెడు అని చెబితే ఇక వాళ్ల పని అయిపోయినట్లే!
అందరికీ దూరంగా వీసీ?
విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ అత్యున్నత స్థాయి వ్యక్తి. వర్సిటీ ప్రతి అభివృద్ధి అడుగులో వీసీ ముందుండాలి. అలాంటిది.. ఏయూ వీసీ మాత్రం వింత పోకడలను అవలంబిస్తున్నారు. తనను ఎవ్వరూ కలవడానికి వీల్లేదంటూ అధికారిక ఉత్తర్వులు జారీచేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి.. ఇక్కడికి ఎన్నో సమస్యలు, నివేదనలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలు వస్తుంటాయి. వాటిని వీసీ పరిష్కరిస్తూ మంచి మార్గం చూపించాలి. కానీ, ఏయూ వీసీ ఇందుకు విరుద్ధంగా చేతులెత్తేస్తున్నారు. తన దగ్గరకు ఎవ్వరినీ పంపొద్దని నిష్కర్షగా చెప్పేశారు. చివరికి.. రిజిస్ట్రార్ సైతం ముందస్తు అపాయింట్‌మెంట్ ఉంటే తప్ప వీసీని కలవలేని దుస్థితి. ఇక విద్యార్థులు, సిబ్బంది తమ సమస్యలు చెప్పుకుందామంటే.. వీసీనే కొత్త సమస్యలు సృష్టిస్తుండటం కలవరపెడుతోంది. నూతన సంవత్సరం వేళ వీసీ వర్సిటీ అధికారులకు, సిబ్బందికి ఇచ్చే ఆనవాయితీ ‘హయ్ టీ’ని రద్దుచేయడం దుస్సాంప్రదాయానికి నిదర్శనం.
ఎవ్వరూ హాస్టళ్లలో ఉండొద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పే యంత్రాంగం కాదు. ఎందరో పౌరులను దేశానికి సేవచేసేలా తీర్చిదిద్దిన విజ్ఞాన భాండాగారం. ఉన్నత విలువలు, రాజకీయం, ప్రజా ఉద్యమకారులను అందించిన మేధావుల కార్ఖానా. ఇంతటి విలువ కలిగిన ఏయూలో ఇప్పుడు పండగ సెలవులు వస్తే విద్యార్థులు, స్కాలర్లు ఎవ్వరూ క్యాంపస్‌లో కనిపించడానికి వీల్లేదు. హాస్టళ్లలో ఉంటున్న వారు సైతం పెట్టే బేడా సర్దుకుని గదులు ఖాళీచేసి వెళ్లిపోవాల్సిందే. గతంలో సెలవుల సమయంలో వర్సిటీల్లో ఉండే విద్యార్థులను బట్టి కనీసం ఒక మెస్‌ను అయినా తెరిచి ఉంచేవారు. అప్పట్లో విద్యార్థులు హాయిగా లైబ్రరీలు, వర్సిటీ ప్రాంగణాల్లో తమకు నచ్చిన అంశాలు అభ్యాసనం చేసి, ప్రాజెక్టు వర్క్స్, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వ రాకతో ఇప్పుడు ఏయూ ప్రతిష్ట మసకబారుతూ
పూర్తిగా భ్రషు్టపట్టిపోతోంది. సార్ రూల్స్ పెడతారు.. కానీ పాటించరు..
ఏయూ వైస్ చాన్సలర్ వ్యవహారశైలి ఆది నుంచి విమర్శలకు తావిస్తోంది. తన అసమర్థ చేష్టలతో వర్సిటీని భ్రషు్టపట్టిస్తున్నారనే వాదన వర్సిటీ మొత్తం వ్యాపించింది. గతేడాది నవంబరు 21న వీసీ ఆదేశాలతో రిజి్రస్టార్ ఓ సర్క్యులర్ విడుదల చేశారు. ‘‘వర్సిటీలో ఎవ్వరూ రాజకీయ ప్రేరేపిత మీటింగ్‌లు, కార్యక్రమాల్లో పాల్గొనకూడదు’’.. అన్నది దాని సారాంశం. తీరా అదే నెల 25న.. రాజ్యాంగ దినోత్సవానికి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఇందులో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొనాలని సర్క్యులర్ ఇచ్చారు. దీంతో వీసీ తనకు నచ్చినట్లు రూల్ పెట్టి.. ఆయనే పాటించరనే విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.
శతాబ్ది ఉత్సవాల వేళ ఏయూ గేట్లు మూసివేత..
ఈ నేపథ్యంలో.. ఏయూ శతాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి గ్రహణం పట్టించింది. కార్పొరేట్ శక్తుల కోసం ఏయూని నిరీ్వర్యం చేయాలని కంకణం కట్టుకుని ఒక్కొక్కటిగా అభివృద్ధికి గేట్లు మూసేస్తోంది. ఏయూ గేట్ల దగ్గర ఆంక్షలు విధిస్తే ఇక్కడే చదువుకుని, ఉద్యోగం చేసి రిటైరైన వ్యక్తులు. అనేకమంది నిపుణులు ఎలా వస్తారని విద్యార్థి లోకం ప్రశి్నస్తోంది. నిజానికి.. ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు అంకురార్పణ చేసిన రోజే స్థానిక టీడీపీ ఎంపీ, చంద్రబాబు సమీప బంధువు శ్రీభరత్ ‘గీతం గొప్పోళ్లది.. ఏయూ పేదోళ్లది’ అంటూ అవమానకర రీతిలో వ్యాఖ్యానించారు. అప్పటినుంచి ఏయూ ఖ్యాతికి పాలకవర్గం తూట్లు పొడుస్తూ వస్తోంది. ఇక్కడ తనను ఎవ్వరూ కలవడానికి వీల్లేదని హుకుం జారీచేసిన వీసీ.. నిత్యం స్థానిక ఎంపీ నుంచి వచ్చే ఆదేశాలనే ఏయూలో అమలుచేస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ వాసులకు నో ఎంట్రీ!..
ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రజల ఆస్తి. ఎన్నో గ్రామాల కలయిక. అందుకే విశాఖ వాసులతో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకుంది. వందల సంస్కృతులు, సాంప్రదాయాలకు ఏయూ నిలయంగా ఉంది. ముఖ్యంగా క్యాంపస్‌లో గ్రామ దేవతల జాతరలు, పండుగలు బలమైన ఆధ్యాత్నిక భావాన్ని పెంపొందిస్తున్నాయి. అలాగే, నిత్యం విశాఖ వాసులు అనేక పనులపై ఏయూ క్యాంపస్‌కు వస్తుంటారు. క్యాంపస్‌లోనే కలెక్టర్ బంగ్లా ఉండటంతో ఎంతోమంది కలెక్టర్‌కు సమస్యలు మొరపెట్టుకుని, అర్జీలు ఇచ్చేందుకు వెళ్తుంటారు. ఇప్పుడు వీసీ నిర్ణయంతో వీరందరికీ తీవ్రనష్టం వాటిల్లుతోంది. బ్యాంకింగ్, పోస్టల్ సేవల కోసం వచ్చేవారికి సైతం చుక్కెదురవుతోంది. నిజానికి.. ఏయూ ఏర్పాటులో ఎందరో పేదల భాగస్వామ్యం ఉంది. వందల ఎకరాల భూములను అడిగిందే తడవుగా ఇచ్చేశారు. అలాంటి విశాఖ వాసులకు ఇప్పుడు ఏయూలోకి ప్రవేశం లేకపోవడం కలవరపరుస్తోంది.


