బాబు మీటింగ్‌ అంటే.. 25000 పెన్షన్లు కట్‌: వైఎస్‌ జగన్‌ | YS jagan Key Comments On AP Pensions And Talliki Vandanam | Sakshi
Sakshi News home page

బాబు మీటింగ్‌ అంటే.. 25000 పెన్షన్లు కట్‌: వైఎస్‌ జగన్‌

Feb 19 2026 4:18 PM | Updated on Feb 19 2026 5:16 PM

YS jagan Key Comments On AP Pensions And Talliki Vandanam

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్‌దారులను భారీగా తొలగిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదన్నారు. అలాగే, ఈ ఏడాది కూడా తల్లికివందనం పథక​ంలో భారీగా కోత విధించబోతున్నారని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అన్నారు. 20 లక్షల మందికి లక్షా 44వేల కోట్లు బాకీ పడ్డారు. సూపర్‌ ఫ్లాప్‌ సినిమా చూపిస్తూ.. బాబు హిట్‌ అంటున్నాడు. చంద్రబాబు ప్రతీ మీటింగ్‌కు 25వేల పెన్షన్లు కట్‌. మా ప్రభుత్వంలో మేము 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. బాబు ప్రభుత్వంలో 18 నెలల్లోనే 5,38,636 పెన్షన్లు కట్‌ చేశారు. ఈ ఏడాది 7,45,993 పెన్షన్లు కట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అప్‌డేట్‌ అయ్యేవి. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉండేవి. 2024 నాటికి మేము 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇచ్చాం.

తల్లికివందనంలో మోసమే.. 
యూడీఐఎస్‌ఈ డేటా ప్రకారం మేము దిగిపోయే నాటికి ప్రభుత్వ స్కూల్స్‌లో 87,41,885 మంది పిల్లలున్నారు. ప్రతీ పిల్లాడికి చంద్రబాబు 15000 చొప్పున ఇస్తానన్నాడు. బడ్జెట్‌ ప్రకారమే రూ.13,112 కోట్లు ఇవ్వాలి. 2024-25లో తల్లికి వందనం పూర్తిగా ఎగ్గొట్టారు. 2025-26లో కొందరికే ఇచ్చారు. అది కూడా పూర్తిగా కాదు. ఇప్పటి బడ్జెట్‌లో రూ.8456 కోట్లు మాత్రమే తల్లికి వందనానికి చూపించారు. అంటే ఈ ఏడాది కూడా భారీగా కోత విధించబోతున్నారు.

మహిళలకు వంచనే..
మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు?. మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అందులో కూడా షరతులు పెట్టారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్‌లలో సూపర్‌ 6, సూపర్‌ 7పై కించిత్‌ ప్రస్తావనలేదు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఇలా హామీల పేరుతో ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు. అలా మోసం చేసిన వారిలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు.

YS Jagan: ఒక్క 2025 లోనే 2685 మంది రైతులు ఆత్మహత్య

రైతులకు 20వేలు ఎక్కడ?
ఎన్నికల సమయంలో ప్రతీ రైతుకు చంద్రబాబు రూ.20వేలు ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చింది కాకుండా రూ.20వేలు ఇస్తానని చెప్పాడు. 2024-25లో పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిసి 40వేలకు బదులుగా రూ.పది వేలే ఇచ్చాడు. మా ప్రభుత్వ హయాంలో 53,58,000 మందికి రైతుభరోసా ఇస్తే చంద్రబాబు మాత్రం ఏడు లక్షల మంది రైతులకు కట్‌ చేశాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి 21431 కోట్లకు గాను ఇచ్చింది 4000 వేల కోట్లు మాత్రమే. ప్రతీ రైతుకు చంద్రబాబు 30వేలకు పైగా బాకీ పడ్డాడు. మేము కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చాం. పట్టాలిచ్చి మరీ గిరిజనులకు రైతుభరోసా ఇచ్చాం’ అని వెల్లడించారు. 

 

 

రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్‌పీ లేదు...
ఉచిత పంటల బీమాతో మేము రైతులకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు మాత్రం 2024-25 బడ్జెట్‌లో 60 లక్షలే పెట్టారు. 2025-26లో 1023 కోట్లు పెట్టారు. ఇచ్చింది మాత్రం సున్నా. 2026-27 బడ్జెట్‌లో రూ.250 కోట్లు మాత్రమే పెట్టారు. ఐదేళ్ల కాలంలో మేము 7802 కోట్లు ప్రీమియం కట్టాం. రైతులపై మేము ఎలాంటి భారం పడనివ్వలేదు. మోంథా తుపానులో 10 లక్షల ఎకరాలు నష్టపోతే చంద్రబాబు మాత్రం నాలుగు లక్షల ఎకరాలే చూపించారు. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్‌పీ లేదు. మేము గతంలో ఆర్‌బీకేలతో రైతులకు తోడుగా నిలబడ్డాం. ఆర్‌బీకేలతో మేము ఎప్పటికప్పుడు పంటను కొనుగోలు చేశాం. 21 రోజులలోపే రైతుకు డబ్బు జమ చేసే వాళ్లం. ధరల స్థిరీకరణ కోసం మేము రూ.7756 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు మాత్రం 900 కోట్లే బడ్జెట్‌లో పెట్టారు. దానిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది దేవుడికే తెలియాలి. ఆర్‌బీకే, ఈక్రాప్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతుల పొట్ట కొడుతున్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం.. 2025లో 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాకుండా రికార్డుల్లో నమోదు కాని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement