2028 నాటికి ఇన్వెస్ట్ చేయనున్న ఆపరేటర్లు
రెట్టింపు స్థాయికి పెరగనున్న సామర్థ్యాలు
క్రిసిల్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల ఆపరేటర్లు వచ్చే రెండేళ్ల కాలంలో భారీగా ఇన్వెస్ట్ చేయనున్నారు. 2026–2028 మధ్య కాలంలో రూ. 55,000–రూ. 60,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో డేటా సెంటర్ల సామర్థ్యం రెట్టింపై 2.3–2.5 గిగావాట్ల స్థాయికి చేరనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.
ఇటు కంపెనీలు, అటు రిటైల్ వినియోగదారులు భారీగా డిజిటల్ టెక్నాలజీలను వినియోగిస్తున్న నేపథ్యంలో 2028 ఆర్థిక సంవత్సరం నాటికి డేటా సెంటర్ ఆపరేటర్ల ఆదాయం వార్షికంగా 20–22 శాతం మేర వృద్ధి చెందుతుందని క్రిసిల్ అంచనా వేసింది. అప్పటికల్లా ఏటా రూ. 20,000 కోట్ల స్థాయికి చేరొచ్చని పేర్కొంది. ‘‘పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించేందుకు పరిశ్రమ 2026–28 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో రూ. 55,000–65,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నిధులు ప్రధానంగా రుణాల రూపంలోనే రానున్నప్పటికీ, స్థూలలాభాలు మెరుగ్గా ఉండటం వల్ల వ్యాపార పరిమాణానికి రుణ నిష్పత్తి స్థిరంగా 4.6–4.7 రెట్ల స్థాయిలో ఉంటుంది’’ అని క్రిసిల్ వివరించింది.
మూడు అంశాల దన్ను..
డేటా సెంటర్ పరిశ్రమ వృద్ధికి మూడు అంశాలు దన్నుగా నిలవనున్నాయి. డిజిటల్ పరివర్తన, టెక్నాలజీ పురోగతిలో భాగంగా పబ్లిక్ క్లౌడ్ వినియోగాన్ని కంపెనీలు వేగంగా అందిపుచ్చుకుంటూ ఉండటం, కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీలపై పెట్టుబడులు పెరుగుతుండటం, 5జీ టెక్నాలజీ విస్తృత వినియోగం వీటిలో ఉంటాయి. భారత్‌లో ప్రస్తుతం డేటా సెంటర్ల సాంద్రత ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఎక్సాబైట్‌కి 65 మెగావాట్లుగా ఉందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు, డిమాండ్‌కి తగ్గ స్థాయిలో సేవలందించేందుకు 2028 మార్చి నాటికి పరిశ్రమ సామర్థ్యం రెట్టింపు కానుందని వివరించింది.


