సీఎం సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటున్న పారిశ్రామికవేత్తలు. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు తదితరులు
గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ.. రాష్ట్ర ప్రభుత్వంతో 35 ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో సోమవారం తొలిరోజునే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. తెలంగాణలో దాదాపు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో 35 అవగాహన ఒప్పందాల (ఎంఓయూ)లు కుదుర్చుకు న్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలిరోజే ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో తొలిరోజు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చే శారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, భారీగా ఉద్యో గావకాశాల సృష్టికి దోహదపడనున్నట్లు ప్రభుత్వం వెల్ల డించింది. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయో టెక్, సినీ నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించింది
ప్రధాన పెట్టుబడులు ఇవీ..
⇒ భారత్ ఫ్యూచర్‌సిటీలో బ్రూక్‌ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ. 75 వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్‌అండ్‌డె వలప్‌మెంట్, డీప్‌టెక్‌హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
⇒ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూ. 41 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి.
⇒ ఈవ్‌రెన్‌యాక్సిస్ ఎనర్జీ రూ. 31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్‌మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
⇒ పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్‌ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ రూ. 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.
⇒ ఏరోస్పేస్‌డిఫెన్స్‌రంగాల్లో మెయిన్‌టెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌తోపాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.
⇒ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మాన్‌ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్‌రూ. 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్‌షిప్, ఫిల్మ్‌అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వినోద వసతులు కల్పించనుంది.
⇒ మేఘా ఇంజనీరింగ్‌గ్రూప్ రూ. 8 వేల కోట్లతో సోలార్, పంప్‌డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ∙రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్‌గ్రీన్‌టెక్ ఎలక్ట్రానిక్స్ హైడ్రోజన్ టెక్ విస్తరణకు రూ. 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
⇒ ఇంటిగ్రేటేడ్ స్టీల్‌ప్లాంట్‌ఏర్పాటుకు కృష్ణా పవర్‌యుటిలిటీస్‌పెట్టుబడి రూ. 5,000 కోట్లు. ∙ప్రముఖ సంస్థ అతిథత్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు నెలకొల్పనుంది. వాటిని స్థాపించేందుకు రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ∙సీతారాం స్పిన్నర్స్‌రూ. 3 వేల కోట్లతో టెక్స్‌టైల్‌యూనిట్ నెలకొల్పనుంది.
⇒ సిమెంట్‌రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్‌సిమెంట్స్, రెయిన్‌సిమెంట్స్‌రూ. 2,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ∙డిఫెన్స్, ఏవియానిక్స్‌తయారీకి అపోలోమైక్రో సిస్టమ్స్‌లిమిటెడ్‌రూ. 1,500 కోట్లు పెట్టుబడులు.
⇒ సోలార్‌డిఫెన్స్–ఏరోస్పేస్ లిమిటెడ్‌సంస్థ మిస్సైల్‌భాగాలు, ఏరో ఇంజన్ స్ట్రక్షర్‌కు రూ. 1,500 కోట్లు.
⇒ అపోలో గ్రూప్ హైదరాబాద్‌లో రూ. 800 కోట్లతో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మించనుంది.
⇒ అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్‌క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ∙ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం ‘వంతారా’ను ఏర్పాటు చేయనుంది.
⇒ యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభించనున్నాయి.
⇒ డిస్ట్రిబ్యూషన్‌హైడ్రో టెక్‌రంగంలో సాహీటెక్‌ఇండియా రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
⇒ సిడ్బీ స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూ.1,000 కోట్లు పెట్టబడులతో ముందుకు వచ్చింది. ఫ్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఈ నిధులు సమకూర్చనుంది.
⇒షోలాపూర్ తెలంగాణ టెక్స్‌టైల్‌అసోసియేషన్ అండ్ జీనియస్‌ఫిల్టర్స్ పవర్‌లూమ్‌టెక్నికల్‌యూనిట్ కోసం రూ. 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ⇒ ఎంపీఎల్‌లాజిస్టిక్స్‌కంపెనీ రూ. 700 కోట్లు, టీవీఎస్‌ఐఎల్‌పీ రూ. 200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
భారీ పెట్టుబడులు ప్రభుత్వ విధానాలకు నిదర్శనం: సీఎం రేవంత్
ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు, తెలంగాణ ప్రభుత్వంపై దేశీయ, అంతర్జాతీయ సంస్థల విశ్వాసానికి రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీప్‌టెక్ సిటీ నుంచి టెక్స్‌టైల్ యూనిట్‌వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావడం తెలంగాణ సుస్థిర ప్రారిశ్రామిక విధానాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశగా బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచి్చన పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడివిడిగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపగా టైక్స్‌టైల్, ఫరి్నచర్ రంగాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో భాగస్వామ్యంపై ఐకియా సంస్థ సీఎంతో చర్చింది.


