యూఎస్‌-భారత్‌ డీల్‌.. మార్కెట్లు జోరందుకుంటాయా? | US–India trade pact fuels sustained bull run on Dalal Street stock market | Sakshi
Sakshi News home page

యూఎస్‌-భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. మార్కెట్లు జోరందుకుంటాయా?

Feb 3 2026 8:33 AM | Updated on Feb 3 2026 9:32 AM

US–India trade pact fuels sustained bull run on Dalal Street stock market

యూఎస్‌-భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 320 పాయింట్ల వరకు లాభపడటం చూస్తుంటే, నేడు దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్ పక్కా అనిపిస్తోంది. అమెరికా పన్నుల తగ్గింపు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు, బడ్జెట్ 2026 కేటాయింపులు వెరసి ఇన్వెస్టర్లలో ఆశావాదాన్ని పెంచుతున్నాయి.

మార్కెట్ జోరుకు ప్రధాన కారణాలు(అంచనా)

భారత మార్కెట్లు నేడు భారీ గ్యాప్-అప్‌తో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్‌గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.

రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపు

రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు

ఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్‌ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం.

బడ్జెట్ 2026-27 కేటాయింపులు

ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్‌ అండ్‌ ఓ)పై ఎస్‌టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

అంతర్జాతీయ పరిణామాలు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఐటీ, టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్‌ జ్యువెలరీ వంటి ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించవచ్చు. అయితే మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు లాభాల స్వీకరణ జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

ఇదీ చదవండి: ఒరాకిల్‌ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!

Advertisement
 
Advertisement
Advertisement