అదేమీ కానుక కాదు: సుప్రీం
రెన్యువల్‌కు విదేశీయానాల జాబితా అడగటం సరికాదు
పాస్‌పోర్ట్ అథారిటీకి మందలింపు
న్యూఢిల్లీ: ‘స్వేచ్ఛ దేశ పౌరులకు ప్రభుత్వాలిచ్చే కానుక కాదు. వారిపట్ల వాటి తొలి బాధ్యత. ఎందుకంటే రాజ్యాంగం వారికి కల్పించిన మౌలిక హక్కు’అని అత్యున్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం భావి విదేశీయానాలు, వీసా వివరాలను పాస్‌పోర్ట్ అథారిటీ డిమాండ్ చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘జీవనోపాధి, అవకాశాల అన్వేషణలో భాగంగా చట్టబద్ధంగా ఎక్కడికైనా వెళ్లేందుకు, ప్రయాణించేందుకు పౌరులకు అన్ని హక్కులూ ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇందుకు వీలు కల్పిస్తోంది’అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎ.జి.మసీహ్‌ల ధర్మాసనం గుర్తు చేసింది.
క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్న ఉదంతాల్లో నిందితుల విదేశీయానం సంబంధిత కోర్టుల దృష్టిలో ఉందా లేదా అన్నది మాత్రమే దాని పని అని పేర్కొంది. జార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఎన్‌ఐఏ విచారణ ఎదుర్కొంటున్న మహేశ్ కుమార్ ఝా అనే వ్యక్తి పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘క్రిమినల్ కేసులున్నంత మాత్రాన సదరు వ్యక్తికి పాస్‌పోర్ట్ ఉండొద్దని, రెన్యువల్ చేయించుకోవద్దని ఏమీ లేదు. సంబంధిత క్రిమినల్ కోర్టు అనుమతి, పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతానని నిందితుని ప్రమాణ పత్రం ఉంటే చాలు’అని స్పష్టం చేసింది.


