ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ విమానాశ్రయాల బిజినెస్‌పై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న ఐదేళ్లలో ఇందుకు రూ. లక్ష కోట్లు వెచి్చంచనున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్, బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పేర్కొన్నారు. ఈ నెల 25న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశీ విమానాశ్రయ పరిశ్రమపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు.
వెరసి తదుపరి 11 ఎయిర్‌పోర్టుల బిడ్డింగ్‌లో మరింత భారీగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా ఏవియేషన్ రంగం వార్షిక పద్ధతిలో 15–16 శాతం విస్తరించవచ్చునని అంచనా వేశారు. గ్రూప్ విమానాశ్రయ పోర్ట్‌ఫోలియోలో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(ఎన్‌ఎంఏఐఎల్) తాజాగా చేరనుంది. తద్వారా దేశీ ఏవియేషన్ రంగంలో కార్యకలాపాలు మరింత విస్తరించనుంది. ఎన్‌ఎంఏఐఎల్‌లో అదానీ గ్రూప్ వాటా 74% కాగా.. 2025 డిసెంబర్ 25న వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలకు తెరతీయనుంది.
రూ. 19,650 కోట్లు
అదానీ గ్రూప్ రూ. 19,650 కోట్ల తొలి దశ పెట్టుబడులతో ఎన్‌ఎంఏఐఎల్‌ను అభివృద్ధి చేసింది. వార్షికంగా 2 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో ఏర్పాటైంది. తదుపరి సామర్థ్యాన్ని 9 కోట్లమంది ప్రయాణికులకు అనువుగా విస్తరించనుంది. తద్వారా ప్రస్తుతం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుర్కొంటున్న సామర్థ్య సవాళ్లకు చెక్ పెట్టనుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(ఎంఐఏఎల్)ను జీవీకే గ్రూప్ నుంచి అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇవికాకుండా అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరులోనూ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది.


