
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడికి మించిన బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు, టీడీపీ నేతలు. బాగానే ఉంది కానీ.. ఈ బ్రాండ్ విలువ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదలను చేస్తేనే వస్తుంది తంటా. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. కేవలం రెండు వందల మందికి ఉద్యోగాలిచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకాఎకిన రూ.22 వేల కోట్ల రాయితీలు కల్పిస్తోంది మరి. చారాణా కోడికి బారా అణా మసాలా అన్నమాట!
ఇంతటి భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే విస్పష్టంగా చెప్పేశారు కూడా. కానీ యథావిధిగా ఏపీ మంత్రివర్యులు లోకేశ్ ఆ మాటలను ఖండించేశారు. కడుపుమంట అన్నట్టుగానూ మాట్లాడారు. ఇలా కాకుండా భారీ రాయితీలతో ఆర్థిక నష్టం ఉండదన్న విషయాన్ని వివరించి ఉంటే బాగుండేదేమో. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు భారీ ఎత్తున వెళుతున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం.
గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీంతో రాష్ట్ర సాఫ్ట్‌వేర్ రంగం గతి మారిపోతుందన్నది దీని సారాంశం. దీంతోపాటే మరుసటి రోజు ఈనాడులో ఇంకో కథనం కూడా ప్రచురితమైంది. డేటా సెంటర్ ఏర్పాటకు గాన ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.22 వేల కోట్లు అని! కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో వచ్చే ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమే.
పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వవచ్చునన్నది సాధారణ అంచనా. ఈ లెక్కన డేటా సెంటర్‌తో 87 వేల ఉద్యోగాల సృష్టి జరగాలి. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనం. కానీ ఇవేవీ జరుగుతున్నట్లు లేదు. అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్ సంస్థ ప్రతినిధులు కానీ ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పలేదు. ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు. ఈ విషయాన్ని కవర్ చేసుకునేందుకా అన్నట్టు ఎల్లోమీడియా తరువాతి రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని కాకిలెక్కలు కొన్ని ప్రచురించింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్‌లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రశ్న!
ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆగాయా? ఊహూ లేదు. డేటా సెంటర్ పెట్టుబడులన్నీ గూగుల్ పెడుతున్నట్టుగా రాశారు. వాస్తవానికి గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్, అదానీ గ్రూపులు కలిసి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌టెల్ కూడా భాగస్వామి అని తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ కోసం 150 ఎకరాల భూమి కేటాయించారు. సీఎంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు.
డేటా సెంటర్‌తోపాటు సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న షరతులతో అదానీకి స్థలం కేటాయించడం గమనార్హం. ఈ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే అదాని కంపెనీకి రైడెన్, ఎయిర్‌టెల్‌లు తోడయ్యాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన తరువాతే రైడెన్ అదానీ కంపెనీతో జత కట్టడం గమనార్హం. ఈ డేటా సెంటర్లకు కావాల్సిన భారీ విద్యుత్తు, నీటి అవసరాలను తీర్చలేకపోవడం, డేటా సెంటర్లతో వచ్చే కాలుష్య సమస్యపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి. కాని చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఖర్చే మినహా పైసా ఆదాయం ఉండదని స్పష్టమవుతోంది. లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన స్థోమత ఉన్న కంపెనీలకు మళ్లీ అంతే స్థాయిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందా? అన్నది ప్రశ్న. అసలు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఇన్ని రాయితీలు ఎలా కోరుతోందో అర్థం కాదు. తాము పెట్టదలచిన మొత్తంలో 25 శాతం ముందుగానే గిట్టుబాటు చేసుకుంటున్నారన్న భావన రాదా?
కంపెనీలను ఆకర్శించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. ఒకపక్క వైద్య కళాశాలల నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలకూ నిధుల్లేవంటున్న ప్రభుత్వం ఇలా కంపెనీలకు వేల వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు.. ఇంకొన్నింటికి కారుచౌకగా భూములు ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... భారతీ సిమెంట్స్ మైనింగ్ లీజులను కక్షపూరితంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తూండటం విమర్శలకు గురవుతోంది. అడక్కపోయినా టీసీఎస్ కంపెనీకి ఎకరాకు రూపాయి చొప్పున 22 ఎకరాల భూమి కేటాయించింది. కాగ్నిజెంట్, ఉర్సా కంపెనీలకూ ఇదే లెక్కన భూమి ఇస్తున్నామని అంటున్నారు.
తాజాగా రైడెన్ కంపెనీకి 25 శాతం రాయితీతో 480 ఎకరాలు ఇస్తారట. స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయిస్తారు. కంపెనీ వారు ప్లాంట్, మెషినరీ కొనుగోలు ఖర్చులో పది శాతం రాయితీ అంటే రూ.2129 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తం కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.దీని విలువ రూ.2245 కోట్లు. లీజులపై చెల్లించే జీఎస్టీ పదేళ్లపాటు చెల్లించే మరో రూ.1745 కోట్లు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఏపీ ప్రజలపై కొన్నివేల కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం రైడెన్ కంపెనీకి మాత్రం యూనిట్‌కు రూపాయి రాయితీ ఇస్తోంఇ. తద్వారా కంపెనీకి పదేళ్లలో కలిగే లాభం రూ.4800 కోట్లు! సుంకాల్లో మినహాయింపులు మరో రూ.1200 కోట్లు. పంపిణీ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు కలిపి మరో రూ.8500 కోట్లు ఉంటాయని లెక్క గడుతున్నారు.
ఈ అంశాలపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేశారనుకోండి.. ఈనాడు వంటి సంస్థలు ఠకీమని అదంతా విష ప్రచారమన్న పాట అందుకుంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని గతంలో జగన్ అన్నప్పుడు ఇదే ఎల్లోమీడియా విశాఖకు వ్యతిరేకంగా బోలెడు కథనాలు వండి వార్చాయి. సముద్రం మట్టం పెరుగుతోందని, విశాఖకు ఏదో అవుతుందంటూ, ప్రజలను భయపెట్టేశారు. రిషి కొండపై నాలుగు ఆధునిక భవనాలు గత ప్రభుత్వం నిర్మిస్తే, పర్యావరణం నాశనం అయిపోయిందని, కొండకు గుండు కొట్టారంటూ తప్పుడు వార్తలు రాశారు. విష ప్రచారం అంటే అది! రిషికొండ భవనాలతోపాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడు ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం వీరికి నోరు పెగలడం లేదు.
డేటా సెంటర్ వల్ల ఉష్ణాగ్రత పెరుగుతుందని ఒప్పుకుంటూనే అది పెద్ద ఇబ్బంది కాదని సమర్థించుకున్నారు. ఇలా ఉంది వారి జర్నలిజం . మరో వైపు చక్కగా నడుస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న భారతి సిమెంట్, ఏసీసీ, రామకో సిమెంట్ కంపెనీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేస్తారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉన్న భారతి సిమెంట్ కంపెనీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తోందన్నది వాస్తవం. ఇది కదా నడుస్తున్న పరిశ్రమలకు తరిమివేసే ప్రయత్నం అంటే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా ఏర్పాటైతే స్వాగతించాల్సిందే. కాకపోతే దాని వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేయడం అవసరం.అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏపీలో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థకు 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంలోని హేతుబద్దతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే ప్రజలలో అనుమానాలు బలపడతాయని గమనించాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.