
తనపై వచ్చిన ఆరోపణలను ప్రత్యర్థులకే చుట్టబెట్టడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అందవేసిన చేయి. అసత్యాలు, కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడే రాజకీయాలు చేస్తారు. విలువలతో నిమిత్తం లేకుండా వ్యవహరించే తీరు సమాజానికి ఏ మాత్రం ఆదర్శంగా కనపడదు. నకిలీ మద్యం కేసు ఇప్పుడు చంద్రబాబు నైజానికి ఇంకో నిలువెత్తు తార్కాణంగా నిలుస్తోంది. ములకల చెరువు నకిలీ మద్యం ప్లాంట్ కర్త, కర్మ, క్రియ అన్నీ తెలుగుదేశం పార్టీ నేతలే అని తేటతెల్లమైనా ఆ కేసును వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. కస్టడీలో ఉన్నా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు ద్వారా వీడియో విడుదల చేయించిన వైనం, అందులో తెలుగుదేశం ప్రభుత్వానికి సర్టిఫికెంట్ ఇప్పించుకోవడం చూసి విస్తుపోవడం ప్రజల వంతైంది.
జనార్ధనరావు విడుదల చేసిన వీడియో సారాంశం మొత్తం ఎల్లో మీడియాలో విపులంగా ప్రచురించారు. అది అచ్చంగా కాశీ మజిలీ కథ మాదిరిగా ఉంది. జగన్ జమానాలో జరిగిన అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జోగి రమేశ్ రూ.మూడు కోట్లు ఆశజూపి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టించారట! జోగి రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే తాను ఆయన నేతృత్వంలో నకిలీ మద్యం తయారు చేశానని, హైదరాబాద్ నుంచి తెచ్చి బార్లో విక్రయించేవాడినని ఆయన అన్నారట. ఇది నిజమైతే అలాంటి వ్యక్తి టీడీపీ వారికి ఎలా దగ్గరయ్యాడు? పైగా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్ పెట్టిస్తే చంద్రబాబు ఎలా బద్నామ్ అవుతారు?
కుప్పంలో పెట్టించి ఉంటే బాబుకు మరింత ఎక్కువ నష్టం జరిగేదిగా అన్న అనుమానం వస్తే కాశీ మజిలీ కథలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. అంతేనా...? నకిలీ ప్లాంట్ సిద్దం చేసి సరకు నిల్వచేసి పెడితే ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి ఆ ప్లాంట్ పై దాడులు జరిగేలా చూస్తామని రమేశ్ చెప్పారట. అంటే మంత్రిగా పనిచేసిన రమేశ్‌కు అలా ప్లాంట్ పట్టుబడితే తన మీదకు కూడా కేసు వస్తుందని తెలియని అమాయకుడని జనార్ధనరావు చెప్పారన్నమాట. ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం ప్లాంట్‌ను గుర్తించిన సందర్భంలోనే అక్కడ టీడీపీ నేత, తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ ద్వారా నకిలీ మద్యం ఇతర చోట్లకు రవాణా అయినట్లు ప్రకటించారు.
ఆ స్థలంలోనే ఉన్న పాలవ్యాన్ల ద్వారా బెల్ట్‌షాపులకూ చేరుతోందని చెప్పారు. ఇవన్నీ అబద్ధాలేనా? టీడీపీ ముఖ్య నాయకులను చంద్రబాబు సస్పెండ్ చేయడంతో తాను చెబుతున్న విషయాలేవి హైలైట్ కాలేదట. రమేశ్ ఆఫ్రికాలో ఉన్న తనకు ఫోన్ చేశారని జనార్ధనరావు చెప్పారట. అది నిజమైతే, ఫోన్ బొంబాయిలోనే వదలివేసి రావడం ఎందుకు? పనిలో పని జయచంద్రారెడ్డికి కూడా మద్యం తయారీతో ఎలాంటి సంబంధం లేదని ఈయన సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరి జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో ఉన్న మద్యం వ్యాపారం మాటేమిటి? ఆయన ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తానని, అప్పటివరకూ ఆఫ్రికాలోనే ఉండమని జోగి రమేశ్ తనతో చెప్పారని, ఆ పని జరక్కపోవడంతో ఈలోగా తన తమ్ముడిని అరెస్ట్ చేయడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు జనార్ధనరావు చెప్పారట.
జనార్ధన రావు వాదనలో లొసుగులు అన్నిఇన్నీ కావు. ఆఫ్రికాలో ప్లాంట్ పెట్టగలిగిన వ్యక్తి రూ.మూడు కోట్ల ముడుపుల మొత్తానికి ఆశపడటం నమ్మశక్యంగా కనిపించదు. అలాగే అధికారంలో ఉన్న వారి నుంచి గట్టి హామీ ఏదీ లేకుండా ఎవరూ బెయిల్ కోసం ప్రయత్నించకుండా విదేశాల నుంచి ఆకస్మికంగా రారు. తొలుత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న నకిలీ మద్యం ప్లాంట్ విషయాన్ని టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఎక్సైజ్ అధికారులు కూడా దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందని, ప్రభుత్వంలోని పెద్దలు కొంతమందికి ఈ కేసులో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలిసి ఉంటే ఈ వ్యవహారాన్ని ముందుగానే తొక్కిపెట్టి వేసేవారేమో తెలియదు. అనూహ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అవడం, పలు చోట్ల నకిలీ మద్యం పంపిణీ అయిందని వార్తలు రావడంతో సంచలనమైంది. మద్య పానం చేసేవారిలో ఆందోళన పెరగడం, కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని, మరికొందరు అకాల మృతి చెందారని కథనాలు వచ్చాయి.
అప్పటికి దీని సీరియస్‌నెస్ కనిపెట్టిన ప్రభుత్వ ముఖ్యులు వెంటనే టీడీపీ నేతలు జయచంద్రా రెడ్డి, కట్టా సరేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఆ చర్యతో ఈ స్కామ్‌తో టీడీపీ వారికి ఉన్న కనెక్షన్ ప్రజలందరికి తేటతెల్లమైంది. ఇది మరింత డామేజీ అయిందని భావించిన ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో వ్యూహంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో టీడీపీ వారు ఉన్నా సహించబోమన్న సంకేతం ఇవ్వాలని, తద్వారా క్రెడిట్ పొందాలని భావిస్తున్న తరుణంలో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లతో ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చా యి. జయచంద్రా రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇచ్చిన వైనంపై సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వెంటనే జయచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనిషి అని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు.
తంబళ్లపల్లెలో రామచంద్రా రెడ్డి సోదరుడు ద్వారకానాథ రెడ్డిని గెలిపించుకోవడానికి టీడీపీలోకి పంపించారని, ఆయన కోవర్టు అనే వాదన తీసుకువచ్చారు. దీనిపై అంతా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసును సీబీఐ విచారించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దాంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటి ద్వారా కొత్త కథలు సృష్టించారు. జగన్ జమానాలోనే నకిలీ మద్యం మొదలైందని, జనార్ధనరావు తదితరులు అప్పటి నుంచే ఈ వ్యాపారం చేశారని అంటూ వార్తలు ఇచ్చారు. ఇంతలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహింపట్నం లో మరో నకిలీ మద్యం డంప్ బయటపడింది.
ఇది మద్యం సేవించే వారిలో ఆందోళన పెంచింది. ఈ సమయంలో ప్రభుత్వం దీనిపై కచ్చితమైన చర్యలు తీసుకుని మద్యం తీసుకునే వారి ఆరోగ్యాలపై దృష్టి కేంద్రీకరించకుండా, వాటిని వదంతుల కింద, వైఎస్సార్‌సీపీవారి దుష్ప్రచారం కింద తిప్పి కొట్టడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ కేసు విచారణకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ వారు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తుంటే తన అధీనంలో ఉన్న సిట్ వేయడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది.
అంతేకాకుండా, మీడియాతో మాట్లాడుతూ స్కామ్ ను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని, ఆఫ్రికాలో నేర్చుకుని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగనీయం, రాజకీయం ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారని అన్నారు. ఆ బ్యాచ్ ఎవరో మీకే త్వరలో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఆఫ్రికా వారిని కూడా మనమే కాపాడాలని వింత ప్రకటన చేశారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్‌సీపీ డిమాండ్ పై స్పందిస్తూ, కేసును సాగదీయాలనే ఆలోచనతోనే అడుగుతున్నారని అనడం తమాషానే అనిపిస్తుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి సీబీఐ సమర్థతపై నమ్మకం లేదన్నమాట. తన హయాంలో నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని బుకాయించడానికి యత్నించారు.
అదే వైఎస్సార్‌సీపీ టైమ్‌లో మాత్రం నిరాధారంగా 30వేల మంది చనిపోయారని ఎలా చెప్పారు? ఇది శవ రాజకీయం కాదా? సిట్ ఏమి చేయబోతోందో ముందస్తుగానే ఆయన సంకేతాలు ఇచ్చారని ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.అది అలా ఉండగా, ఆఫ్రికాలో ఉన్న జనార్ధనరావు ఏపీకి వచ్చి లొంగిపోయారు. అంతకు ముందు ఆయన విడుదల చేసిన వీడియో లో ఎక్కడా జోగి రమేశ్ పై కాని, వైఎస్సార్‌సీపీపైన కాని ఆరోపణలు చేయలేదు.కాని అరెస్టు అయ్యాక, వీడియో ఆయన ఎలా చేశారో, దానిని ఎలా ఎల్లో మీడియాకు అందచేశారో, ఇందులో పోలీసుల పాత్ర ఏమిటో తెలియదు కాని, మొత్తం కధను జోగి రమేశ్ పై నెట్టేశారు. ఇది టీడీపీ పెద్దల నైపుణ్యం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత తామే నకిలీ మద్యం ప్లాంట్ ను ,డంప్ లను కనిపెట్టామని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత మాట మార్చి జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు ఎవరి ద్వారానో సమాచారం అందించి దాడులు చేయించారని జనార్ధనరావుతో చెప్పించారు.
ఇక్కడే ప్రభుత్వం దొరికిపోయిందనిపిస్తుంది. ఈ నకిలీ మద్యం వల్ల కూటమి ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందన్న అంచనాకు వచ్చిన పెద్దలు వెంటనే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా జోగి రమేశ్ వైపు మలుపు తిప్పారన్న అభిప్రాయం వ్యక్తం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఈ నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ జోరుగా నిరసనలు చేసిన సాయంత్రానికే జనార్ధనరావు వీడియోను వ్యూహాత్మకంగా విడుదల చేశారు. అయితే అందులో జరిగిన తప్పిదాలతో దొరికిపోయారన్న భావన కలుగుతుంది.
అలాగే సురేంద్ర నాయుడు కు ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడితే ఆయనకు క్షమాబిక్ష పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా ?కాదా?ఏ సంబంధం లేకుండా అలా చేస్తారా అని మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ప్రశ్నకు ఎందుకు టీడీపీ నుంచి సమాధానం రాలేదు? ఇవన్ని ఎందుకు ! సీబీఐ విచారణ లేదా సుప్రీంకోర్టు జడ్జి దర్యాప్తు ,లేదా వెంకకటేశ్వర స్వామి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి రావాలని, చివరికి లై డిటెక్టర్ పరీక్షకు జోగి రమేశ్ సవాల్ చేశారు. వాటిలో ఒక్కదానికైనా చంద్రబాబు లేదా ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేదు?
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత