
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో గూగుల్ డాటా సెంటర్ రాకతో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం, దాని అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వకపోగా.. గత వైఎస్సార్‌సీపీ పాలనపై, ఆ పార్టీ నేతలపై ఐటీ మంత్రి నారా లోకేష్ నిందలు వేస్తున్నారు. అయితే వాటికి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ (Gudivada Amarnath on Google Data Center Jobs)ఇచ్చారు.
శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గూగుల్‌తో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా. ఆ మాట గూగుల్‌తోనే చెప్పించండి. కనీసం ఆ సంస్థతో ఓ అధికారికి ప్రెస్‌నోట్ అయిన రిలీజ్ చేయించండి. అది నిజమని తెలిస్తే మేమే సన్మానం చేస్తాం..
.. గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం, ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెపుతారు అని భావించాను. కానీ ఆ డేటా సెంటర్‌ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిని స్వాగతిస్తున్నట్లు తొలిరోజే వైఎస్సార్‌సీపీ చెప్పింది. అయితే.. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయని, ఎంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని మాత్రం అడిగాం. అందులో తప్పేముంది?..
.. 1 గిగా వాట్ డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది?. గూగుల్ డేటా సెంటర్ వలన 200 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈనాడు పేపర్ లో వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ లో ఉన్న ఉద్యోగులు 1.88 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో 1.88 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది కదా. అయినా ఉద్యోగాల గురించి లోకేష్, టీడీపీ నేతలు కాదు చెప్పాల్సింది. ఆ మాట ఆ సంస్థ చెప్పాలి.
అసలు గూగుల్‌తో సమాధానం చెప్పించడానికి ఐటీ మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి?. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేష్‌ను పప్పు అన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. మాయ మాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దు.
కష్టపడి పోరాటం చేసి జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. ఎవరో డబ్బులు కడితే చదువుకోలేదు(లోకేష్‌ను ఉద్దేశించి..). విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరం. గూగుల్ డేటా సెంటర్‌కు ఏడాదికి మూడు టీఎంసీల నీళ్లు అవసరం, ఎలా సర్దుబాటు చేస్తారు?. డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సెంటిగేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెబుతున్నారు. దాని మీద ఏమైనా స్టడీ చేశారా?. ఒక రోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో, గూగుల్ డేటా సెంటర్ కు ఒక గంటకు అంత కరెంట్ అవసరం అవుతుంది.

రామాయపట్నం, బందరు మూలపేట, భోగాపురం ఎయిర్ పోర్టు, NTPC గ్రీన్ ఎనర్జీ దగ్గర నేను నిలబడి మా హయంలో వచ్చింది అని చెప్పగలను. నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావు నేను మంత్రి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు కూర్చొని రాసుకుందాం రా?.. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం తెచ్చారు.. ఏ ప్రయోజనం చేకూర్చారు. నువ్వు మంత్రిగా ఏమి చేశావో చెప్పగలవా.. అమరావతి రోడ్లు తప్ప. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరు. వర్ధంతి జయంతికి తేడా తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారా?. ఆయనలా నేను ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకొని చదవను. ట్రోలింగ్‌కు జాతి పితా లోకేష్ అని ఎద్దేశా చేశారు. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ లోకేష్‌కు హితవు పలికారు.
ఇదీ చదవండి: కల్తీ మద్యం కేసు.. కమీషన్ మాట్లాడుకుందామా?