
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ(TDP) నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్(Liquor Belt Shop) షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది. ఏపీలో కూటమి పాలనలో మరోసారి మద్యం అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. రాజమండ్రి అర్బన్, రూరల్‌లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్‌చార్జ్ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఈ సందర్బంగా.. రాజమండ్రిలో ఎక్కడెక్కడ బెల్టు షాపులు పెట్టాలి. ఎక్కువ ధరకు అమ్మినా ఎక్సైజ్ అధికారులు అడ్డు చెప్పకుండా ఉండేందుకు వారికి ఎంత ఇవ్వాలో నిర్ణయిద్దాం. ఇప్పటికే ఎక్సైజ్ నార్త్, సౌత్ సీఐలను కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్లు ఎంత ఇవ్వాలో ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా రూ.2 లక్షల వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత? రూ.2 లక్షలకు పైగా వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత మామూళ్లు ఎక్సైజ్ అధికారులకు ఇప్పించాలో నిర్ణయిస్తామన్నారు. ఒక ఏరియాలో ఉన్న మద్యం దుకాణం పరిధిలో ఉన్న బెల్టు షాపుల విషయంలో మరొకరు జోక్యం చేసుకోకుండా పకడ్బందీగా రూల్స్ పెట్టుకుందాం. మద్యం అక్రమ వ్యాపారానికి బైలాస్ కూడా రూపొందించుకుందాం. 39 షాపుల నిర్వాహకులను బాండ్లపై సంతకాలు పెట్టించాలి.
ఇక, ఎమ్మార్పీకంటే ఎక్కువ రేట్లకు అమ్మాలి. ఏ బ్రాండ్‌పై ఎంత పెంచాలో చర్చించి నిర్ణయం తీసుకుందాం. 39 షాపుల్లో ఎవరిపై కేసు నమోదు చేసిన అందరూ భరించాలి. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా చర్చిద్దాం. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇప్పించాలి. రెండోసారి షాపుమీద కేసు పెడితే షాపు క్యాన్సిల్ చేస్తారు కనుక కేసు పడకుండా వాళ్లే చూసుకుంటారు అని మాట్లాడుకున్నారు. అయితే, ఈ సమావేశం వెనుక ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కూటమి నేతలు మద్యం సిండికేట్ ద్వారా ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ వ్యాపారాన్ని లీగలైజ్ చేసే విధంగా టీడీపీ నేత మధ్య రాంబాబు మాట్లాడిన ఆడియోపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: నకిలీ మద్యం దోపిడీకి క్యూఆర్ కోడ్ అడ్డమే కాదు..