
బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలోనే ‘నకిలీ’ అమ్మకాలు
లూజ్ లిక్కర్ అమ్మే చోట ‘క్యూఆర్ కోడ్ స్కాన్’తో పనేంటి?
వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ నిలదీత
సాక్షి, అమరావతి : నకిలీ లిక్కర్ దందాకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై మద్యం ప్రియుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కంటి తుడుపు చర్యగా బాటిళ్లపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తిరిగి పెడుతోందని, తద్వారా ఇన్నాళ్లూ నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించినట్లే అని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నకిలీ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగేది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలోనే కాబట్టి, నకిలీ మద్యం దోపిడీకి ‘క్యూ ఆర్ కోడ్ స్కాన్’ అడ్డమే కాదన్నారు. లూజ్ లిక్కర్ అమ్మకాలు జరిగే చోట క్యూ ఆర్ కోడ్ స్కాన్‌తో పనేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, తదితర ప్రాంతాల్లో నకిలీ లిక్కర్ దందా బయట పడినప్పుడే చుట్టుపక్కల మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలో తనిఖీలు చేయడంతో పాటు లక్షల్లో శాంపిల్స్ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేవారని చెప్పారు. కానీ అలాంటి కార్యక్రమాలేవీ జరగక పోవడం చూస్తుంటే ఈ దందా వెనుక కూటమి పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.
ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల దోపిడీ లక్ష్యం
‘కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల భారీ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ములకలచెరువులో భారీగా నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టురట్టయినా, దాని వెనుక టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. మద్యం అమ్మకాల్లో 70 శాతం చీప్ లిక్కరే. అందువల్ల చీప్ లిక్కర్ ప్లేసులో అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి కూటమి పెద్దలు భారీ ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
నకిలీ మద్యంపై వైఎస్సార్‌సీపీ ఉద్యమం చేయడంతో మద్యం బాటిళ్లపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ పేరుతో హడావుడి చేస్తోంది. అయితే మద్యం తాగే వారిలో చాలా మంది రోజువారీ కూలీలు. నిరక్షరాస్యులు. వారి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. అలాంటప్పుడు ఏది నకిలీ.. ఏది ఒరిజినల్ సరుకు అనేది ఎలా తెలుస్తుంది? షాపులన్నీ టీడీపీ నేతలవే అయినప్పుడు వారెందుకు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను పట్టిస్తారు? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని పోతిన మహేష్ నిలదీశారు.

గత ప్రభుత్వంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేశాకే మద్యం విక్రయం జరిగేదని, నాడు ప్రభుత్వ ఆ«దీనంలో పారదర్శకంగా లిక్కర్ అమ్మకాలు జరిగాయని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే నకిలీ లిక్కర్ దొంగలను శిక్షించాలన్నారు.
లూజ్ లిక్కర్‌కు క్యూ ఆర్ కోడ్ స్కాన్ ఎలా?
‘పర్మిట్ రూమ్‌లతో నకిలీ మద్యం అమ్మకాలు పెరుగుతాయా, తగ్గుతాయా? అక్కడ లూజ్ లిక్కర్‌కు క్యూర్ కోడ్ స్కాన్ అవకాశం ఉంటుందా? గత ప్రభుత్వంలో గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ ఇçప్పుడు నోరెత్తరేం’ అని పోతిన ప్రశ్నించారు.