
గూగుల్‌కు రాయితీలపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్
ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు
ఇవి కాకుండా భూమి, నీళ్ల టారిఫ్‌లో 25 శాతం డిస్కౌంట్
100 శాతం ఉచితంగా ట్రాన్స్‌మిషన్
అందుకే అక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చిన గూగుల్
మేము ఇలా చేస్తే అందరూ నిలదీస్తారు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు ఏపీ స్థాయిలో ప్రోత్సహకాలు ఇవ్వలేమని, అలా చేస్తే రాష్ట్రం ఆర్థికంగా సర్వ నాశనం అయిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే (Priyank Kharge) స్పష్టం చేశారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్‌ను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ ప్రోత్సాహకాలను ఇచ్చిందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెబుతున్నారే కానీ... అక్కడ అది ఏర్పాటు కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందనే విషయాన్ని ఎవరూ చెప్పటం లేదన్నారు.
గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలను ఇచ్చిందని చెప్పారు. ఇవికాకుండా వాళ్లకు 25 శాతం తక్కువ ధరకు భూమిని కేటాయించిందని, స్టేట్ జీఎస్టీలో 100 శాతం మినహాయింపు, 100 శాతం ఉచితంగా ట్రాన్స్‌మిషన్, నీళ్ల టారిఫ్‌లో 25 శాతం డిస్కౌంట్ ఇచ్చిందన్నారు. ఈ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇచ్చే పరిస్థితి తమకు లేదని, ఒక వేళ ప్రకటిస్తే ఒక కంపెనీ కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వ నాశనం చేస్తారా అంటూ అందరూ నిలదీస్తారన్నారు.
గూగుల్ డేటా సెంటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో బెంగళూరు నగరం ఐదవ స్థానంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌తో నుంచి కూడా ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తున్నారని చెప్పారు. అందుకే బెంగళూరు నగరం ఓవర్ క్రౌడ్ అవుతోందని లోకేశ్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, ఏపీ ప్రజలు ఇక్కడికే వస్తారని.. ఎందుకంటే ఏఐలో నైపుణ్యం ఇక్కడే ఉందని చెప్పుకొచ్చారు.
కాగా, ఖర్గే వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘ఎక్స్’ వేదికగా పరోక్షంగా స్పందించారు. ‘వారు ఆంధ్ర ఫుడ్ చాలా స్పైసీగా ఉందంటున్నారు. ఇప్పుడు పెట్టుబడులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మా పక్క వాళ్లు కొంత మంది ఆ మంటను ఫీల్ అవుతున్నారు’ అని పోస్ట్ చేశారు.