
‘‘నేను, గాంధీజీ, అంబేద్కర్‌లు సామాన్య కుటుంబాల్లోనే పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాము’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలోనే కాదు.. దేశాద్యంతం ఈ వ్యాఖ్యలకు నివ్వెరపోయి ఉండవచ్చు. గాంధీజీ.. అంబేద్కర్లతో పోల్చుకోవడం ఎంతవరకూ సమజసం అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే చంద్రబాబు తీరే అంత. ఏమైనా అనగలరు. చేయగలరు. పోల్చుకోగలరు కూడా. వాస్తవం ఏమిటంటే... గాంధీజీ, అంబేద్కర్‌లో సామాన్య కుటుంబాల్లో పుట్టిన మాట నిజం. అయితే వారెవరూ అవకాశాలను అందిపుచ్చుకోలేదు.
సామాజిక పరిస్థితులను ఎదిరించి ప్రజలకు ఒక దారి చూపడం ద్వారా నేతలుగా ఎదిగారు! దేశ స్వాతంత్ర్య సాధనలో అందరికంటే ముందున్న గాంధీజీ జాతిపితగా ఎదిగితే... అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశారు. ఇద్దరూ అసత్యాలు చెప్పడాన్ని నిరసించారు. తిరస్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచారు.
చంద్రబాబు విషయానికి వస్తే... ఈయన కూడా సామాన్య కుటుంబంలో జన్మించారు. సీఎం స్థానానికి ఎదిగారు. వాస్తవమే. కానీ ఈయన రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే గాంధీజీ, అంబేద్కర్ల ఆలోచనలు, ఆదర్శాలకు ఎంతో దూరంగా.. విరుద్ధంగా ఎన్నో మరకలు కనిపిస్తాయి. కాంగ్రెస్(ఐ)తో రాజకీయ ఆరంగేట్రం చేసి గ్రూపులు కట్టి, పైరవీలతో మంత్రిపదవి సాధించిన చరిత్ర చంద్రబాబుది. తరువాతి కాలంలో పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పేరుతో పార్టీ పెడితే.. మామపైనా పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అక్కడ ఏకు మేకు అయినట్లు మామనే పదవి నుంచి లాగిపడేశారు. పదవుల కోసం ఆరాటపడకపోవడం గాంధీజీ, అంబేద్కర్ల నైజమైతే.. వాటి కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డ చరిత్ర బాబు గారిది!
చంద్రబాబు నిజంగానే వారిని ఆదర్శంగా తీసుకోదలిస్తే ముందుగా అసత్యాలు చెప్పడం మానుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేష భావాన్ని వదిలించుకోవాలి. కుమారుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి. ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న హింసను నిలువరించాలి. ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. అయితే... గాంధీజీ, అంబేద్కర్లలతో పోల్చుకోవడానికి ప్రయత్నించిన సభలోనే ఆయన ఎంత పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడారో చూడండి.
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పుల గురించి స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పేశారే. వెయ్యి రూపాయల అదనపు పెన్షన్ ఇవ్వడం కోసం మంచినీళ్లలా లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో పర్యటిస్తూ సభలు పెడుతున్నారే! కార్యకర్త కారు కింద పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌పై ఎంత దారుణమైన ఆరోపణ చేశారు! కారు ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్యను పిలిచి అంబులెన్స్‌లో ఏదో జరిగిందని చెప్పించారని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపించడమా! చంద్రబాబు ఈ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఈనాడు దినపత్రిక దాన్ని బ్యానర్‌గా వండి వార్చడం చూస్తే వారు సింగయ్య మృతి విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని తెలిసిపోతోంది. ఏపీ హైకోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కవర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కుట్రల అమలుకు ఎల్లో మీడియాను ఒక టూల్‌గా వాడుతున్నారన్నమాట.
నిజానికి ఈ కేసులో ఎన్నో సందేహాలున్నాయి. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్తునప్పుడు వచ్చిన జన సందోహాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న జగన్‌కు ఎందుకు తగిన భద్రత కల్పించలేదు? వాహనాల వెంట ఉండవలసిన రోప్ పార్టీ ఎందుకు లేదో తెలియదు. కారు తగిలి సింగయ్య అనే వ్యక్తి గాయపడినప్పుడు వచ్చిన వీడియోలు గమనించిన వారెవరికైనా ఆయనకేమీ ప్రమాదం లేదన్నట్టుగానే అనిపించింది. కాని అంబులెన్స్‌లోనే ఆయన మరణించడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే... ఏదో గుర్తు తెలియని వీడియో ఆధారంగా పోలీసులు జగన్‌తో పాటు కొందరు వైసీపీ నేతలను నిందితులుగా చేసేశారు. కారు ప్రమాదానికి డ్రైవర్ కాకుండా... అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టి కొత్త ట్రెండ్ సృష్టించారు. హైకోర్టు ఇదే ప్రశ్న లేవనెత్తడంతో సమాధానాలు చెప్పలేని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదాలు కోరారన్న భావన కలిగింది. దాంతో జగన్ తదితరులపై నేరారోపణకు ప్రాధమిక ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.అదే టైమ్ లో ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్య లూర్దు మేరి చేసిన ప్రకటన మరింత సంచలనమైంది.
తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, లోకేష్ మనుషులు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె అంత ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు వచ్చిందంటే అందులో నిజం లేకపోతే అలా చేయగలుగుతుందా? అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీనియర్ నేత దానిపై స్పందించడం ఏమిటి? అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పించారని అనడం ఏమిటి? అదే జగన్ పై ఆమె ఏదైనా ఆరోపణ చేసి ఉంటే సీఎం ఎంత తీవ్రంగా ప్రచారం చేసి ఉండేవారు. ఎల్లో మీడియా ఎంతగా ఇల్లెక్కి అరిచేది. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యేవారు! ఇప్పుడేమో ఆ ఆరోపణలపై విచారణ కాకుండా, ఆమె జగన్‌ను కలవడంపై విచారణ చేస్తారట. ఇదేనా ప్రభుత్వం నడిపే పద్దతి?
గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకునే వారు ఎంత నిజాయితీగా ఉండాలి? ఒక ప్రమాదాన్ని జగన్‌కు పులమడం ద్వారా కుటిల రాజకీయం చేయడం ఏ తరహా నీతి అవుతుంది. గతంలో గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ తీసేందుకు ఒక్కసారిగా గేట్లు తెరచి తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నారు? రోడ్డు ప్రమాదాలు జరగడం లేదా? పూరి జగన్నాథ ఉత్సవాలలో తొక్కిసలాటలు జరగడం లేదా? కొందరు మరణించడం లేదా అని ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాటలలో పదకుండు మంది మరణిస్తే, అదంతా పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేయలేదా?
జగన్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే మాత్రం ఆయనను నిందితుడుగా చేర్చుతారా? ఇది చిల్లర రాజకీయం కాదా? పైగా రాజకీయాలు, రౌడీలు, అంటూ నీతి సూత్రాలు వల్లిస్తే సరిపోతుందా? వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాలు, పేకాట క్లబ్లులు నడుపుతారు.. అంటూ గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో వారిని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు ఎలా ఇచ్చారన్న దానికి జవాబు దొరుకుతుందా?
అదెందుకు అంగళ్లు వద్ద గతంలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబే ఎంతగా రెచ్చగొట్టారో వీడియోలు చెబుతాయి. పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్‌ను దగ్దం చేయడం, రాళ్ల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరి కన్ను పోవడం ఇటీవలి చరిత్రే కదా? ప్రతిపక్షంలో ఉంటే ఏ అరాచకం చేసినా సమర్థించుకోవడం, అధికారంలోకి రాగానే శాంతి వచనాలు పలకడమే చంద్రబాబు ఇజమా! అని అంటే ఏమి చెబుతాం. ఏ నాయకుడైనా పదవుల కోసం సంకుచిత రాజకీయాలకు దిగకుండా ఉంటేనే మంచి పేరు వస్తుంది కానీ... రాజకీయ అవసరాలకు గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుని పోల్చుకుంటూ, స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజలు తెలుసుకోలేకపోతారా!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.