
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్‌షాప్‌లపై మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నిస్తూ ఒక జెడ్పీటీసీగా లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేక తన భర్త వీరయ్యపై పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్ళారని దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితులమైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి, తన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతామని, నారా లోకేష్ ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా భయపడేదే లేదని మేకతోటి అరుణ స్పష్టం చేశారు. తాను చేస్తున్న తప్పులకు నారా లోకేష్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ఈనెల పదో తేదీన దుగ్గిరాల మండల సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాప్‌లపై బాధ్యత కలిగిన ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. మా మండలంలో ప్రతి వీధిలోనూ బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి, మద్యాన్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. దీనిపై ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సర్వసభ్య సమావేశంలో నేను ప్రస్తావించాను.
ఈ సమావేశానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. అందువల్ల ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెడుతూ లేఖ రాశాను. (ఈ సందర్బంగా ఆ లేఖ ప్రతిని వీడియాకు ప్రదర్శించారు) ఈ లేఖను ఎండీఓకు అందచేయడం ద్వారా దానిని మంత్రివర్యులకు పంపాలని కోరాను. మండలంలో కూల్ డ్రింక్ షాప్‌లు, కంటైనర్లలో బెల్ట్‌షాప్ లను నిర్వహిస్తూ, ప్రజలకు మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ, వారిని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఫోటోలతో సహా ఆ లేఖకు జత చేసి ఎండీఓకు అందచేశాను.
ఆ రోజు నేను మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏం మాట్లాడానో దానికి సంబంధించిన వీడియోను కూడా ఈ సందర్బంగా ప్రదర్శిస్తున్నాను. (ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఈ సమావేశంలో కేవలం మద్యం, బెల్ట్‌షాప్‌ల గురించి, అధిక ధరలకు జరుగుతున్న మద్యం విక్రయాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే మాట్లాడానే తప్ప ఎవరినీ విమర్శించలేదు. అయినా కూడా దీనిని తట్టుకోలేని స్థితిలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. దీనిని బయటపెట్టినందుకు నా భర్త దాసరి వీరయ్యను ఎక్కడో జరిగిన హత్యకేసులో నిందితుడిగా కేసులు బనాయించి, అర్థరాత్రి దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు.
నారా లోకేష్ అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై తప్పుడు కేసులు, అరాచకాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ఏడాది జూన్ 4న తుమ్మపూడిలో జరిగిన హత్యకేసులో కూడా నా భర్త వీరయ్యను ఇరికించారు. మంత్రి నారా లోకేష్ కావాలనే మాపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి నా భర్తనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఐజీ నా భర్తపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నారా లోకేష్ దళితులమైన మాపైన ఎన్ని కేసులు పెట్టినా, వేధించినా భయపడేదే లేదు.
వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన గళం విప్పకుండా మమ్మల్ని అడ్డుకోలేరు. గత ప్రభుత్వంలో అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే, అది అక్రమ కేసు అంటూ ఇదే నారా లోకేష్ మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటీ? వైఎస్సార్‌సీపీలో ఉన్న దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ది చెబుతారని అరుణ స్పష్టం చేశారు.
వీరయ్య పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులు: దొంతిరెడ్డి వేమారెడ్డి
వీరయ్యను కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్ రాజ్యంలో జీవిస్తున్నామా? అనే సందేహం కలుగుతోంది. తప్పుడ చేస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చు. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే, వైఎస్సార్‌సీపీలో ఆయన నాయకుడిగా కొనసాగుతున్నందున కక్షసాధింపుతో కావాలనే ఒక భయోత్పాతాన్ని సృష్టించేలా ఆయనను అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి తన కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో, ఆయనను పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు హంగామాతో బలవంతంగా ఈడ్చుకుంటూ తమతో తీసుకువెళ్ళిన ఘటన అభ్యంతరకరం. ఆయన సంతానంలో దివ్యాంగురాలైన కుమార్తె కూడా ఉంది. జరుగుతున్న ఈ తతంగంతో ఆమె భీతావాహం అయ్యింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? లోకేష్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందా? అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైయస్ఆర్‌సీపీ నేతలను భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని వేమారెడ్డి హెచ్చరించారు.