
డిజిటల్ బుక్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు
పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికే డిజిటల్ బుక్
కార్యకర్తకు అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టం
పార్టీ 14 ఏళ్లుగా బలంగా ఉండటానికి కార్యకర్తలే కారణం
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కార్యకర్తల వల్లే 40 శాతం ఓట్లు సాధించాం
డిసెంబర్ 15 నాటికి కమిటీల ఏర్పాటు పూర్తవ్వాలి
ఎన్నికలు సజావుగా జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు
అందుకే మీరు గట్టిగా నిలబడాలి.. మరింత బలోపేతం కావాలి
మనం అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతాం
రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ఫొటోలు, ఆధారాలు కూడా అప్‌లోడ్ చేయొచ్చు. రెండోది ఐవీఆర్‌ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా కార్యకర్తలు ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ డిజిటల్ బుక్‌లో రికార్డు అవుతాయి. రేపు మనం అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతాం.
చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు. ఒక ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు.. దాన్ని బ్రేక్ చేయడం, డైవర్ట్ చేయడం.. ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో గుడులు, బడులు, రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి. రకరకాల మనుషులపై బురద జల్లే పరిస్థితులు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మీరంతా గట్టిగా నిలబడితే ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు.
–వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ బుక్‌లో నమోదు చేసిన అంశాల మీద రేపు మనం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ‘అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా.. రాష్ట్రంలో లేకపోయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా, ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగేలా అడుగులు వేస్తాం’ అని హామీ ఇచ్చారు.
వాళ్లేదో రెడ్ బుక్ అంటున్నారని.. రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వాళ్లందరికీ అర్థం కావాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీని స్థాపించి 14 ఏళ్లయ్యిందని.. పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలేనని పునరుద్ఘాటించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒక్కటే ఒక వైపు.. మిగిలిన పార్టీలన్నీ మరో వైపు ఉన్నా, 40 శాతం ఓట్లతో మనం గట్టిగా నిలబడటానికి కార్యకర్తలే కారణమని స్పష్టం చేశారు.
‘ప్రతి కార్యకర్త డేటా నా దగ్గర ఉంటుంది. రేపు పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్లకు మంచి జరుగుతుంది. వారి ద్వారా ప్రజలకూ మేలు జరుగుతుంది. వారి చేతుల మీదుగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి మంచి జరుగుతుంది’ అని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రసంగిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అనుబంధ విభాగాలు కీలకం
⇒ ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్, స్ట్రక్చర్‌ను చూస్తే.. ఈ 16 నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం. రీజినల్ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం. నియోజకవర్గ ఇన్‌చార్జులు ఉన్నారు. వీరంతా జిల్లా కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు.
⇒ వీరితో పాటు అనుబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అనుబంధ విభాగాలను జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలకు, మండల స్థాయిలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీలు, గ్రామానికి సంబంధించి విలేజ్ కమిటీలతో పాటు ఏడు అనుబంధ విభాగాలను ఎంపిక చేసి బలోపేతం చేయాలి. వీరంతా కూడా ఎక్స్ అఫిషియో కింద గ్రామ కమిటీలో ఉంటారు.
⇒ అలా కమిటీలు వేసుకున్న తర్వాత వాళ్లను మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. వీరందరికీ ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. ఎప్పుడైతే ఈ ఐడీ కార్డు వాళ్ల జేబుల్లోకి వెళ్తుందో.. వాళ్లందరి డేటా నా వద్ద ఉంటుంది. వాళ్లను సాక్షాత్తు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు.
⇒ ఈ రోజు గ్రామ స్థాయిలో పార్టీని లీడ్ చేసే వారిని.. రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుపెట్టి.. వారి ద్వారా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను. అందరికీ ఒకటే చెబుతున్నా. ముందు మీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలు వేయండి. తర్వాత మండల స్థాయిలో కమిటీలు.. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. తర్వాత మండల స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. వాళ్లు వాళ్ల కమిటీ సభ్యులను తీసుకుంటారు. వాళ్లను మీ పర్యవేక్షణలో గ్రామాలకు పంపించండి. ప్రతి గ్రామానికీ మీరు కూడా వెళ్లండి. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ గురించి వివరించండి.
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన పార్టీ నేతలు
గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు టార్గెట్
⇒ తుది దశలో గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. ఆ గ్రామంలో ఎవరు రైతు అధ్యక్షుడు.. ఎవరు మహిళా అధ్యక్షురాలు.. ఎవరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు.. ఎవరు సోషల్ మీడియా అధ్యక్షుడు.. ఎవరు బీసీ అధ్యక్షుడు.. ఎవరు ఎస్సీ అధ్యక్షుడు.. అనే పేర్లను ఎంపిక చేయండి. అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోవాలి.
⇒ తర్వాత పేర్లను ఎంట్రీ చేస్తే.. వారంతా మన డేటాలో రిజిస్టర్ అవుతారు. ప్రతి కార్యకర్తను ఆ రకంగా ఎంపవర్ చేయగలగాలి. ఆ స్థాయిలో మీరు బలపడ్డారంటే.. మీరు గ్రామంలోకి వెళ్లగానే యూత్ అధ్యక్షుడి పేరు చెబుతారు. స్టూడెంట్ అధ్యక్షుడి పేరు చెబుతారు.. బీసీ అధ్యక్షుడి పేరు చెబుతారు.. సోషల్ మీడియా అధ్యక్షుడి పేరు చెబుతారు.. ఎస్సీ అధ్యక్షుడి పేరు, రైతు అధ్యక్షుడి పేరు, మహిళా అధ్యక్షురాలి పేరు చెబుతారు. మొత్తంగా గ్రామ పార్టీ అధ్యక్షుడితో కలిపి ఎనిమిది మంది పేర్లు మీరు టక టకా చెప్పగలుగుతారు. ఇలా చెప్పగలిగితే మీరు ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసినట్లే.
⇒ రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈ కమిటీలన్నీ చురుగ్గా పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్‌తో పార్టీ ఇచ్చే మెసేజ్‌తో ఏ కార్యక్రమమైనా గ్రామంలో విసృ్త్తతంగా చేపట్టగలుగుతారు. ఆర్గనైజేషన్ అంటే ఇది. ఇప్పటికైనా మీరొక టైం పెట్టుకోండి. డిసెంబర్ 15 కల్లా నాకు వారి పేర్లు ఇవ్వండి. దీనివల్ల మీరే విన్ అవుతారు. గ్రామాల్లోకి వెళ్లగలుగుతారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ మీ ఆధ్వర్యంలో నిలబడుతుంది.
డిజిటల్ బుక్ నమూనా
కార్యకర్తలే పార్టీకి బలం
⇒ మన పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అయ్యింది. మనది యంగ్ పార్టీ. ఈ స్థాయిలో ఉన్న పార్టీ దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీని నడిపించింది, పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలే. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోబట్టే మనం బలంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ ఒక్కటే ఒక వైపు, మిగిలిన అన్ని పార్టీలూ మరో వైపు ఉన్నాయి. అయినా 40 శాతం ఓట్లతో గట్టిగా నిలబడ్డామంటే కార్యకర్తలే కారణం.
⇒ ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే. నేను ఈ గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను.. ఈ గ్రామంలో నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని.. ఈ గ్రామంలో నేను రైతు విభాగం అధ్యక్షుడిని.. యువత అధ్యక్షుడిని.. సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిని.. ఈ గ్రామంలో నేను అనుబంధ విభాగం అధ్యక్షుడిని.. అంటూ గ్రామ స్థాయిలో మన పార్టీని ఓన్ చేసుకొని ఆ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని వాళ్ల కమిటీలు వాళ్లే వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా.. వాళ్ల నాయన తలుచుకున్నా కూడా వైఎస్సార్‌సీపీపై పోటీకి పనికి రాకుండా పోతాడు. అలాంటి గుర్తింపు ఇవ్వాలి. ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే నా తాపత్రయం. ఈసారి కచ్చితంగా గెలవాలి.
డిజిటల్ బుక్ ఆవిష్కరణ
⇒ రాష్ట్రంలో అన్యాయానికి గురైన మన కార్యకర్తల కోసం మీ సమక్షంలో డిజిటల్ బుక్‌ను లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది.
⇒ ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం వెబ్‌సైట్‌లోకి ఎంటరై మీ ఫోన్ నంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే, మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డేటా.. ఆ డిజిటల్ బుక్‌లో స్టోర్ అవుతుంది. ఇది ఒక పద్ధతి.
⇒ రెండోది ఐవీఆర్‌ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా అన్యాయానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. ఫోన్ చేసిన వారు తాము ఏ నియోజకవర్గం వారో చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో.. వివరాలు చెప్పాలి. ఆ విధంగా ఆ నంబర్‌కు ఫోన్ చేయగానే దశల వారీగా సమాచారం తీసుకుంటారు.