
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్‌ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది.
ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్‌లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్‌ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్‌లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్‌డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.
అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్‌కే రంగులు, ఎస్సెన్స్‌లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.
ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?..
మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.