బొబ్బిలి (విజయనగరం జిల్లా): ‘మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌకర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలవాలని ఉచిత సలహా ఇచ్చారు. మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం’ అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావలస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు.
వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించుకుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పలరాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.



