అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.
అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్‌లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్‌లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


