
- చంద్రబాబుది ఉద్యోగ వ్యతిరేక పాలన
- డీఏ బకాయిలను వడ్డీ లేకండా రిటైర్మంట్ సమయంలో తీసుకోవాలా?
- మిగతా 3 డీఏల పరిస్థితి ఏంటి?
- పీఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తారు?
- పీఆర్సీ కమిషన్ వేసేలోపు తక్షణం 30 శాతం ఐఆర్ ప్రకటించాలి
- ఉద్యోగుల బకాయిలు రూ.34 వేల కోట్లు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి
- ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
నెల్లూరు: ఒకపక్క ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకుంటోందని, మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డీఏ కూడా మోసమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్‌మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒక్కటి రిలీజ్ చేస్తామని చెప్పాడని అన్నారు.
ఆ అరియర్స్‌ని కూడా రిటైర్మంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్, రూ. 34 వేల కోట్ల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్‌మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...
ఇచ్చిన ఒక్క డీఏ కూడా మోసమే
ఉద్యోగులను ఉద్ధరించేసినట్టుగా రెండు రోజులుగా కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. ఉద్యోగులకు డీఏ ధమాకా, దీపావళి బొనాంజా అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఎన్నికల్లకు ఇచ్చిన హామీలు పక్కడపెడితే వారికి హక్కుగా దక్కాల్సినవే ఇవ్వకుండా ఒక డీఏ రిలీజ్ చేసి వారికి బిక్షం వేస్తున్నట్టు మట్లాడుతున్నారు.
రెండు రోజుల క్రితం దీపావళికి ముందు నేరుగా సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడంతో ఈసారి ఉద్యోగుల హామీలన్నీ నెరవేరుస్తారని అనుకున్నారు. నాలుగు డీఏలు ఇవ్వడంతోపాటు పీఆర్సీ కమిషన్ వేస్తారు, పెండింగ్ అరియర్స్ రిలీజ్ చేస్తారని, 30 శాతం ఐఆర్ ఇస్తారని ఉద్యోగులంతా భావించారు. కానీ తీరా చూస్తే సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఒకే ఒక్క డీఏ ఇచ్చేయడం చూసి ఉద్యోగులంతా నివ్వెరపోయారు. పీఆర్సీ కమిషన్ పైగానీ, ఐఆర్ పైగానీ, పెండింగ్ అరియర్స్ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చాలించాడు. ఇచ్చిన డీఏలోనూ ఉద్యోగులకు జరిగిన మోసమే కనిపిస్తోంది.
వైఎస్సార్‌సీపీ అయిదేళ్ళ పాలనలో 11 డీఏలు
వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలలో ఆర్నెళ్లకు ఒక డీఏ చొప్పున 10 డీఏలు ఇవ్వడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డీఏ ను కూడా రిలీజ్ చేసి మొత్తం 11 డీఏలు ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాలుగు డీఏలు పెండింగ్ పెడితే అందులో ఒక డీఏ ఇస్తున్నట్టు చంద్రబాబు డీఏల విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. 2024 లో జనవరి, జూన్ తోపాటు 2025 జనవరి జూన్ నెలల డీఏలు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబే చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన డీఏలను కూడా జగన్ ఖాతాలో వేసి తప్పించుకోవాలని చూడటం హేయం.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక డీఏ పెండింగ్ లో ఉండటానికి కూడా కారణం కేంద్ర ప్రభుత్వ జాప్యమే. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్రాలు ప్రకటించడం అనేది ఆనవాయితీ. ఆ ప్రకారం కేంద్రం జనవరి 2024లో రిలీజ్ చేయాల్సిన డీఏను మార్చి 6న ప్రకటించడంతో ఆ వెంటనే మార్చి 11న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రకటించలేకపోయాం. 2024 జనవరి డీఏను ఇప్పుడు ప్రకటించారు. దానికి సంబంధించి డీఏ అరియర్స్ ని కూడా రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామనడం దారుణం. చంద్రబాబు తప్ప దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చెప్పడం చూడలేదు. పైగా ఈ అమౌంట్‌ను పీఎఫ్ అకౌంట్ లో కూడా జమ చేస్తామని చెప్పకపోవడం దుర్మార్గం. ఇప్పుడు ఎంత బకాయి ఉందో ఆ మొత్తమే వడ్డీ కూడా లేకుండా 30 ఏళ్ల తర్వాత ఇస్తామని చెప్పడం ఉద్యోగులను దారుణంగా వంచించడమే. చంద్రబాబు తీసుకొస్తున్న ఇలాంటి కొత్త సంస్కృతితో ఉద్యోగుల జీవితాలు ఏమైపోతాయో ఆలోచించాలి. రిటైర్ అయిన ఉద్యోగుల డీఏల గురించి ఏమీ ప్రస్తావించడం లేదు.
పీఆర్సీ కమిషన్ ఊసే లేదు
పీఆర్సీ కమిషన్ కాల పరిమితి ముగిసి ఇప్పటికే రెండేళ్ళ మూడు నెలలు గడిచిపోయింది. అయినా కొత్త పీఆర్సీ వేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కోసం వేసిన కమిషన్‌ను కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే, కమిషనర్ చైర్మన్‌తో రాజీనామా చేయించారు. తరువాత ఈరోజుకీ పీఆర్సీ కమిషన్ వేయడానికి కూడా చంద్రబాబుకి మనసు రావడం లేదు. ఈరోజు పీఆర్సీ కమిషన్ వేసినా దాని నివేదిక వచ్చి అమలు చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఉద్యోగుల సంఘాల మీటింగ్‌లో పీఆర్సీ కమిషన్ వేస్తామని చెప్పకుండా తప్పించుకోవడం దుర్మార్గం కాదా? పీఆర్సీ వేయనప్పుడు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీ.
కానీ రెండేళ్ళ మూడు నెలల కాలంలో ఐఆర్ కూడా ఇవ్వని దారుణ పరిస్థితిని చంద్రబాబు నేతృత్వంలో ఉద్యోగులు ఎదుర్కుంటున్నారు. కోవిడ్ వంటి పరిస్థితులున్నా సాకులు చెప్పి తప్పించుకోకుండా ఆరోజున వైఎస్ జగన్ 23 శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల పక్షాన నిలిచారు. 27 శాతం ఇస్తామని చెప్పి 23 శాతమే ఇచ్చారని, ఇది రివర్స్ పీఆర్సీ అని ఆరోజున, ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు సహా కూటమి నాయకులు ప్రచారం చేసుకున్నారు. నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని హేళన చేసి మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదు. కనీసం కమిటీ కూడా వేయకపోగా వైఎస్ జగన్ హయాంలో వేసిన కమిటీతో కుట్రపూరితంగా రాజీనామా చేయించారు.
రూ.34 వేల కోట్లకు ఉద్యోగుల బకాయిలు
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలున్నాయని చంద్రబాబు గెలిచిన వెంటనే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశాడు. ఆ రూ.22 వేల కోట్లు దఫదఫాలుగా చెల్లిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు, తీరా గెలిచాక వాటి ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు ఇచ్చిన శ్వేతపత్రంలో రూ.22 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పాడు. మొన్నటి ప్రెస్‌మీట్‌లో రూ.34 వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెబుతున్నాడు.
బకాయిలు చెల్లిస్తానని చెప్పి, ఏకంగా రూ. 12 వేల కోట్లు పెంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇది మోసం కాదా? రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే వెంటనే చెల్లిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం 2027-28 లో 12 వాయిదాల్లో ఇస్తానని చెప్పడం వారిని వేధించడమే. పింఛన్ పై ఆధారపడి జీవించే వృద్ధులను కూడా వేధించడం న్యాయమా అని చంద్రబాబు ఆలోచించుకోవాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కర్నాటక, తమిళనాడుతో పోల్చి చూపించి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి,
ఉద్యోగుల జీతాలు తగ్గించుకోవాలని చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నాడు. సీఎం, డిప్యూటీ సీఏం, మంత్రులు చేస్తున్న దుబారాను తగ్గిస్తే, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. వాలంటీర్లకు జీతాలు పెంచుతానని చెప్పి, వారిని రోడ్డు పాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీకు అనవసరంగా జీతాలిస్తున్నామని సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి అనడం సరికాదు. పోలీసులకు 4 సరెండర్ లీవ్‌లకు గానూ ఒక్కదానికే అనుమతి ఇస్తూ, రెండు నెలల తరువాత రూ.105 కోట్లు విడుదల చేస్తాను అని చెప్పడం దారుణం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు సీఎంగా వైయస్ జగన్ దానిని ప్రభుత్వపరం చేస్తే, దానిపైనా సీఎం చంద్రబాబు వక్రబాష్యం చెబుతున్నాడు. ఆర్టీసిని కాపాడాలనే ఉద్దేశమే ఆయనకు లేదు’ అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: