
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ నిరసనకు దిగింది. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సీసాలతో మహిళలు నిరసన తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని కాకాణి పూజిత దుయ్యబట్టారు. యూరియా కోసం క్యూలైన్‌లో నిల్చొవాలి.. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుందంటూ మండిపడ్డారు.

కర్నూలు: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాని విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే కల్తీ లిక్కర్‌ను అరికట్టాలని.. బెల్టు షాపులు తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు.
అనంతపురం: కల్తీ మద్యంపై మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎక్సైజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ మహిళా, యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కల్తీ మద్యం తయారు చేసే టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం అరికట్టండి. పేదల ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు.
