
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలలకు నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎస్ నేతృత్వంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఏ ఒక్క అంశంపైనా నిర్ణయం తీసుకోకుండా మొక్కుబడిగా ముగించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.
పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ చెల్లింపులు, ఐఆర్ బకాయిలపై కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైనా పాజిటీవ్ నిర్ణయం వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిమీదా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నిరాశ చెందారు.
రెండేళ్ళ నుంచి పెండింగ్‌లో ఉన్న పన్నెండో పీఆర్సీకి నేటికీ కమిషనర్‌ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతోనే రాజకీనామా చేశారు. ఆయన స్థానంలో మరో కమిషనర్‌ను నియమించి పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ కమిషనర్‌నే నియమించలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తామన్న మధ్యంతర భృతి పైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈ బకాయిలు ఎంత అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డీఏ ఎరియర్స్ ఎంత అనే దానిపైన ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం పే స్లిప్‌ల్లో ఈ బకాయిలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అమరావతి జేఏసీ తరుఫున దీనిపై సీఎస్‌ను డిమాండ్ చేసినా, దానిపైనా ఎటువంటి స్పందన లేదు. పదకొండో పీఆర్స్ ఎరియర్స్‌తో పాటు, డీఏలకు సంబంధించిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.
ఇప్పటి వరకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంది. డీఏల గురించి ఎక్కడా ఈ సమావేశంలో మాట్లాడలేదు. అసలు జేఎస్‌సీ ఎందుకు పెట్టారో చెప్పాలి. కేవలం టైంపాస్ కోసం, ఉద్యోగుల కళ్ళ నీళ్ళు తుడిచేందుకే ఈ సమావేశం నిర్వహించారా..? కనీసం ముప్పై శాతంకు తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనిపైన కూడా ఎక్కడా నిర్ణయం తీసుకోలేదు.
తక్షణం పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి:
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తక్షణం పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, పీఆర్సీ కనీసం 30 శాతంకు తగ్గకుండా చూడాలి. డీఏ బకాయిలను విడుదల చేయాలి. మధ్యంతర భృతిని చెల్లించాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలు సరిగా నిర్వహించడం లేదు, బకాయిలు పెట్టడం వల్ల ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ ను రెండు నుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తీసుకురావాలని, గత ప్రభుత్వం మూడు వేల మందిని రెగ్యులర్ చేసింది, మిగిలిన ఏడు వేల మందిని కూడా తక్షణం రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పదిశాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, 75 దాటిన వారికి పదిహేను శాతం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశాయి. అయిదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కనీసం ఒక్క దానిపైన కూడా నిర్ణయం తీసుకోలేదు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ళ వరకు పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరారు.
ఈ డిమాండ్‌లపై సీఎస్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతానంటూ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం ఎంత వరకు సమంజసం..? కూటమి ప్రభుత్వ వైఖరిని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉద్యోగ, పెన్షనర్ల తరుఫున ప్రభుత్వం మెడలు వంచైనా సరే, వారికి రావాల్సిన అన్నింటిని సాధించుకుంటాం.