టీడీపీ నాయ‌కులే క‌ల్తీ లిక్క‌ర్ డాన్‌లు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి | Gadikota Srikanth Reddy Slams Chandrababu And Fake Liquor | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయ‌కులే క‌ల్తీ లిక్క‌ర్ డాన్‌లు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Oct 4 2025 4:13 PM | Updated on Oct 4 2025 6:54 PM

Gadikota Srikanth Reddy Slams Chandrababu And Fake Liquor

సాక్షి, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్‌లుగా మారి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. హైద‌రాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులే పారుతోందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్ళారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి, గ్రామగ్రామాన బెల్ట్‌ షాప్‌లను ఏర్పాటు చేయించి, ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మద్యం పేరుతో సీఎం చంద్రబాబు చెబుతున్నది ఈ కల్తీ మద్యం గురించేనని, ప్రజల ప్రాణాలను బలిపెట్టి, టీడీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..

డిస్టిల‌రీల స్థాయిలో క‌ల్తీ మ‌ద్యం త‌యారీ యూనిట్లు
నాణ్య‌మైన మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, ల‌క్ష‌లాది మంది ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి తెలుగుదేశం నాయ‌కుల జేబులు నింపడ‌మే ధ్యేయంగా కల్తీ మ‌ద్యం త‌యారీకి స‌హ‌కారం అందిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో టీడీపీ నాయ‌కులే క‌ల్తీ లిక్క‌ర్ త‌యారు చేసి మందు బాబుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ప్ర‌భుత్వమే లిక్క‌ర్ అమ్మ‌కాలు జ‌రిపితే దానిపై విష‌ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు, కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక తిరిగి ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్ట‌డంతో వారు రెచ్చిపోయి క‌ల్తీ లిక్క‌ర్ త‌యారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

తాజాగా మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శుక్రవారం క‌ల్తీ మ‌ద్యం రాకెట్ వ్య‌వ‌హారం బయటపడింది. ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా ఏకంగా ఒక డిస్టిల‌రీ యూనిట్ స్థాయిలో రోజుకు 15వేల కేసుల క‌ల్తీ లిక్క‌ర్ త‌యారు చేసి బెల్ట్ షాపుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఈ కేసులో మండల స్థాయి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడుతోపాటు ఎనిమిది మంది కూలీలను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేశారు.

కానీ ఈ కల్తీ మద్యం రాకెట్‌ వెనుక రింగ్‌ మాస్టర్, సూత్రధారుల పేర్లపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పందించడం లేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చంద్ర‌బాబు, నారా లోకేష్‌లే కాపాడుతున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడేలా ప్ర‌తి రెండు జిల్లాల‌కు ఒక‌ యూనిట్ నెల‌కొల్పి లిక్క‌ర్ దందా సాగిస్తున్నారు. తాగ‌డానికి మంచినీళ్లు లేని గ్రామాలున్నాయి కానీ, మ‌ద్యం స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌ని గ్రామాలు ఏపీలో లేవు. వేళ‌ల‌తో సంబంధం లేకుండా 24 గంట‌లూ ఇంటికే మ‌ద్యం డోర్ డెలివ‌రీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్ల‌ర అంగ‌ళ్ల‌లో సైతం మ‌ద్యం విక్రయాలు జ‌రుగుతున్నాయంటే ప‌రిస్థితి ఎంత ఘోరంగా త‌యారైందో చెప్పాల్సిన ప‌నిలేదు.

లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్‌సీపీపై బురదచల్లారు
వైయ‌స్సార హ‌యాంలో లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డానికి చంద్ర‌బాబు చేయ‌ని కుటిల ప్ర‌య‌త్నం లేదు. ఆధారాలు లేక‌పోయినా వైయ‌స్సార్సీపీ నాయ‌కుల‌ను, వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌నిచేసిన అధికారుల‌ను క‌క్ష‌పూరితంగా అక్ర‌మ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేసి వేధించ‌డ‌మే ధ్యేయంగా లిక్క‌ర్ కుంభ‌కోణం సృష్టించారు. మాజీ ఐఏఎస్‌లు ధ‌నుంజ‌య్‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్ రెడ్డితోపాటు ఎంపీ మిధున్‌రెడ్డిల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. త‌ప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేసినా ఆ కేసులు కోర్టుల్లో నిల‌బ‌డ‌లేదు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ వ‌రుస‌గా చీవాట్లు తింటోంది. కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు. 16 నెల‌ల పాల‌న‌లోనే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త తెచ్చుకుంది.

స్పిరిట్ తో క‌ల్తీ మ‌ద్యం త‌యారీ
రాష్ట్రంలో కల్తీ మద్యం రాకెట్‌ దందాను టీడీపీ మద్యం సిండికేట్‌ వ్యవస్థీకృతం చేసింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో జిల్లాలు, రీజియన్ల వారీగా పంచుకుని మరీ కల్తీ మద్యం దందాను సాగిస్తోంది. నాడు కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో స్పిరిట్‌ను కొనుగోలు చేయ‌డానికి కేంద్రం ఇచ్చిన ఆదేశాల‌ను టీడీపీ మద్యం సిండికేట్‌ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్‌ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (వాడుక భాషలో స్పిరిట్‌ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు.

అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా భారీ ప్లాంట్లనే నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్‌ను డైల్యూట్‌ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్‌ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్‌ చేసి బ్రాండెడ్‌ మద్యంగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు.

ఆ క‌ల్తీ మ‌ద్యాన్ని తాగించ‌డానికి గ్రామాల్లో ఎక్క‌డప‌డితే అక్క‌డ‌ విచ్చ‌ల‌విడిగి బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. లిక్క‌ర్ షాపుల‌కు అద‌నంగా ప‌ర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలుంటే, వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్‌ దుకాణాలు న‌డుస్తున్నాయి. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు. మద్యం నెట్‌వర్క్‌ అంతా టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లో ఉండటంతో ఈ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.

ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ
టీడీపీ సిండికేట్‌ సాగిస్తున్న కల్తీ మద్యం విక్ర‌యాలు చూస్తే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్‌ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్‌ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్‌ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్‌ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్‌ బాటిళ్లు ఉంటాయి.

ఈ లెక్క‌న 143 కోట్ల క్వార్టర్‌ బాటిళ్లు విక్రయించారు. దీన్నిబ‌ట్టి మొత్తం క్వార్టర్‌ బాటిళ్లలో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమే. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్‌ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించారు. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాలి
ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్రంలో కూట‌మి పాల‌న‌లో య‌థేచ్ఛ‌గా సాగుతున్న‌ క‌ల్తీ మ‌ద్యం విక్ర‌యాల‌పై స్పందించాలి. టీడీపీ హ‌యాంలో సుగాలి ప్రీతి హ‌త్య జ‌రిగితే వైయ‌స్సార్సీపీ హయాంలో జ‌రిగిన‌ట్టు విష ప్ర‌చారం చేసి రాజకీయంగా వాడుకున్నాడు. 34 వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యారంటూ ఆయ‌న చేసిన ప్ర‌చారం కూడా ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని అసెంబ్లీలో కూట‌మి ప్ర‌భుత్వ‌మే స్ప‌ష్టం చేసింది. లేనివాటిని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ కళ్యాణ్‌.. క‌ళ్ల ముందు క‌ల్తీ మ‌ద్యం దందా సాగిస్తూ ల‌క్ష‌ల మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంటే ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు?

వైఎస్సార్‌సీపీ హయాంలో క‌ల్తీ మ‌ద్యం విక్ర‌యాలంటూ కూట‌మి నాయ‌కులు విషం చిమ్మారు. కానీ క‌ల్తీ లిక్క‌ర్ తాగి ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించలేద‌ని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో స్ప‌ష్టం చేసింది. దీనిగురించి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తుంటే సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాకి అడ్డుక‌ట్ట వేయాల‌న్న దుర్భుద్ధితో మంత్రుల క‌మిటీ వేశారు. వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో బుర‌ద‌జ‌ల్లిన కూట‌మి నాయ‌కులు, ఇప్పుడు వారు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయ‌కులు నిజాలు మాట్లాడుతుంటే ఓర్వలేక‌పోతున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి క‌ల్తీ మ‌ద్యం స‌ర‌ఫ‌రా రాకెట్‌కి అడ్డుక‌ట్ట వేయాలి. ప్ర‌తిప‌క్షంపై దుష్ప్ర‌చారం చేయ‌డం మాని ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాలి. విచ్చ‌ల‌విడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల‌ను త‌క్ష‌ణం మూసేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement