ఫీజు బకాయిలివ్వండి మహాప్రభో | Letters from degree, engineering college associations to Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయిలివ్వండి మహాప్రభో

Jan 8 2026 4:26 AM | Updated on Jan 8 2026 9:03 AM

Letters from degree, engineering college associations to Chandrababu Govt

రూ.6,300 కోట్లు పెండింగ్‌ 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు రాక అవస్థలు పడుతున్నాం

ఈ నెల.. వచ్చే నెల.. అంటూ మాటల దాటవేత ఇంకెన్నాళ్లు?

కనీసం పండగకు ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది 

వడ్డీలకు అప్పులు తెచ్చి కాలేజీలు నడపలేకపోతున్నాం 

ప్రభుత్వానికి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల అసోసియేషన్ల లేఖలు

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌­మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశా­లలను నడిపే పరిస్థితి లేదని ప్రైవేటు ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల అసోసియేషన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కళాశాలల నిర్వ­హణ కోసం బ్యాంకుల నుంచి తీసుకునే లోన్ల­లో ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితి కూడా దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాయి. అప్పులు కట్టడా­నికి మళ్లీ అప్పులు చేయడం, అప్పుపుట్టే దారి లేకపోవడంతో విద్యాసంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని తెలిపాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం తీరును నిలదీస్తూ రెండు అసోసియే­షన్లు బుధవారం వేర్వేరుగా బహిరంగ లేఖలను విడుదల చేశాయి. 

కనీసం సంక్రాంతి పండగకు ఉద్యోగులకు, అధ్యాపకులకు జీతాలివ్వలేకపోతున్న దుస్థితిని ప్రభుత్వం కల్పించిందంటూ నిరసన తెలిపాయి. గత సెప్టెంబర్‌లో విడతల వారీగా కళాశాలలకు రావాల్సిన పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ హామీని గాలికొదిలేసిందని మండిపడ్డాయి. 9 క్వార్టర్లకు సంబంధించి సుమారు రూ.6,300 కోట్ల బకాయిలున్నట్లు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపించాయి. ఫీజు క్యాలెండర్‌ను తేదీలతో ప్రకటిస్తామని చెప్పి ముఖం చాటేస్తుండటంపై మండిపడ్డాయి. 

ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అధికారులు, పట్టభద్రుల ఎమ్మెల్సీలతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడును ఆలకించేవారు కనిపించలేదని అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఎప్పటికప్పుడు ‘ఈ నెల.. వచ్చే నెల..’ అంటూ మాటలు దాటవేయడం తప్ప రూపాయి విడుదల చేయటంలేదని దుయ్యబట్టాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడంతోపాటు 2026–29 విద్యాసంవత్సరాలకు ఫీజులు పెంచాలని కోరాయి. ఫీజులు నిర్ధారణ చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణాజీ, రాజకుమార్‌చౌదరి, ఇంజనీరింగ్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోయి సుబ్బారావు, గ్రంధి సత్యనారాయణ లేఖలు విడుదల చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement