హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ
ప్రైవేటీకరణ చట్ట విరుద్ధం.. ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోండి
ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయండి
స్పందించిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
వైఎస్సార్‌సీపీ వ్యాజ్యం కోటిమంది ప్రజల గొంతుక.. ప్రైవేటీకరణతో అంతిమంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు
వైద్యం, వైద్య విద్యను బాబు ప్రభుత్వం ఖరీదైనదిగా మార్చేస్తోంది.. వైద్య కళాశాలల్లో రూ.వేలల్లో ఉన్న ఫీజులు రూ.లక్షల్లోకి వెళ్తాయి
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఇప్పటికే కోటికి పైగా సంతకాలు సేకరించగా... ఇప్పుడు న్యాయ పోరాటం ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల విషయంలో చంద్రబాబు సర్కారు తీరును సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫున ఆయన న్యాయవాది మారక్కగారి బాలకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వమే నిరి్మంచి, నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.
ప్రైవేటీకరణకు జారీ చేసిన ఉత్తర్వులు, టెండర్ నోటిఫికేషన్‌ను సైతం సవాల్ చేశారు. దాదాపు 2,300 పేజీలతో ఆయన పిల్ వేయడం విశేషం. కాగా, వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం స్పందించిన హైకోర్టు... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ, రాష్ట్ర వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్‌సీ) ఎండీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
ప్రభుత్వ విధానాన్ని నిర్దిష్టంగా సవాల్ చేశాం
వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... కోటిమంది గొంతుకగా తాము పిల్ వేశామని, ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని సవాల్ చేశామని చెప్పారు. ప్రైవేటీకరణపై ఇప్పటికే ఒక వ్యాజ్యం దాఖలైందని గుర్తు చేసిన ధర్మాసనం... అందులో వాదనలు వినిపించేందుకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే, అందులోని అంశాలకు, ప్రస్తుత వ్యాజ్యంలో తాము లేవనెత్తినవాటికి చాలా తేడా ఉందని పొన్నవోలు బదులిచ్చారు. ప్రభుత్వ విధానాన్ని నిర్దిష్టంగా సవాల్ చేశామని, ప్రైవేటీకరణ కారణంగా వైద్య ఖర్చులను భరించడంలో ప్రజల శక్తి, ప్రభుత్వంపై పెట్టుకున్న చట్టబద్ధమైన నమ్మకం వంటి అనేక విషయాలను లేవనెత్తామని చెప్పారు.
ప్రభుత్వం జాప్యం చేస్తుంది..
పొన్నవోలు వాదనలపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఒకే అంశంపై ఇలా పిటిషన్లు వేస్తూ ఉంటే, ఎప్పటికీ తేలవని వ్యాఖ్యానించింది. ఈ పిల్‌ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు మరింత సమయం కోరుతుందని, దీంతో విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంది. సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ... తమ పిల్‌ను ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో జత చేసినా అభ్యంతరం లేదన్నారు. దీంతో ధర్మాసనం వైఎస్సార్‌సీపీ వ్యాజ్యాన్ని ప్రైవేటీకరణపై గతంలో దాఖలైన వ్యాజ్యంతో జత చేసింది.
చంద్రబాబు ప్రభుత్వం
తీసుకొచ్చిన ప్రైవేటీకరణతో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు ఖరీదైనవిగా మారిపోతాయి. వైద్య కళాశాలల్లో రూ.వేలల్లో ఉన్న ఫీజులు రూ.లక్షల్లోకి వెళ్లిపోతాయి. ప్రైవేటీకరణతో అంతిమంగా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. – పొన్నవోలు సుధాకర్‌రెడ్డి


