
సాక్షి, శ్రీకాకుళం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటం.. ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దంచికొడుతున్న వర్షాలతో వంశధార నదిలోకి వరదనీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాలా రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గొట్టా బ్యారేజీ నుంచి 80వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు లక్ష క్యూసెక్కుల వరకు వరద రావ్చొచ్చని అక్కడి ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులపాటు వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పాటు భారీ వర్షం కురిసింది.
శ్రీకాకుళం, మన్యం,విజయనగరం జిల్లా ప్రభావిత ప్రాంతాలు
అప్రమత్తం
నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 3, 2025
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కుండపోత వర్షం కురవడంతో రహదారులు జలమయం అయ్యాయి. ముఖ్యంగా చోడవరం నాలుగు రహదారుల గోయలో వర్షపు నీరు చేరిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షం కారణంగా ఇళ్ల ముందు వర్షపు నీరు చేరిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రెండు రోజులు వర్షాలు..
ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో టెక్కలిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత జాతీయ రహదారి, తొలిసూరిపల్లి రోడ్డు, మెళియాపుట్టి రోడ్డు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీనివాస్ నగర్, రాందాసుపేట ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో కుండపోతగా వర్షం కురుస్తోంది.