గ్రీస్‌లో స్తంభించిన జనజీవనం.. పని గంటల పెంపుపై నిరసనలు | Nationwide Strike Paralyzes Greece As Workers Protest 13-Hour Shifts And Labor Law Reforms, Watch Video Inside | Sakshi
Sakshi News home page

గ్రీస్‌లో స్తంభించిన జనజీవనం.. పని గంటల పెంపుపై నిరసనలు

Oct 3 2025 7:33 AM | Updated on Oct 3 2025 10:12 AM

Greece Thousands hold strike against new labour laws

ఏథెన్స్‌: కార్మిక సంఘాల సమ్మెతో గ్రీస్‌(Greece) దేశంలో జన జీవనం స్తంభించిపోయింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు గ్రీస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంతో ఉద్యోగ సంఘాలకు సమ్మెకు పిలుపునిచ్చాయి. పని గంటలను(Working Hours) 13కు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన కారులు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వివరాల ప్రకారం.. గ్రీస్‌లో ఒక షిఫ్టులో పని గంటలను 13కు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గ్రీస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక చట్ట సవరణల్లో షిఫ్టు పని గంటలను 13కు పెంచడం వంటి ఉన్నాయి. ఈ అదనపు పనిగంటలు వారానికి గరిష్ఠంగా 48 గంటలకు పరిమితి చేయగా, ఏడాదికి 150 గంటలకు మించకూడదని పేర్కొంది. వీటిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ హక్కులను అణచివేయడమే కాకుండా పని-జీవన సమతుల్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తున్నాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాలు 24 గంటల సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.

ప్రభుత్వ, ప్రైవేటు కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన కారులు వీధుల్లోకి వచ్చారు. దీంతో ఏథెన్స్‌లో టాక్సీ, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆయా నగరాల్లో బస్సులు, ట్రామ్‌, ట్రాలీ సర్వీసులు మాత్రం పరిమిత స్థాయిలో సేవలందించాయి. పాఠశాలలు, కోర్టులు, ఆసుపత్రులు సహా ప్రభుత్వ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగ సంఘాల సమ్మెకు చెందిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా​యి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement