గత కొంతకాలంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానంటూ డెన్మార్క్‌ను రెచ్చగొడుతున్న ట్రంప్ తాజాగా ఆ అంశంపై మరోసారి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాల్సిందేనన్నారు లేకుంటే చైనా, రష్యాలు ఆ పని చేస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
వెనిజువెలా అధ్యక్షున్ని బంధించి ఆ దేశ పాలనను హస్తగతం చేసుకున్న ట్రంప్ తన తదుపరి టార్గెట్ గ్రీన్‌లాండ్ అని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, చమురు, సహజవాయువులు పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేస్తామని దాని రక్షణ బాధ్యత తమపై ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే దీనిపై గ్రీన్‌లాండ్ ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో కలిసేది లేదని తాము స్వతంత్రంగా ఉండదలుచుకుంటున్నామని తమ దేశ పార్లమెంటులో తీర్మానం సైతం చేశారు.
అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోవడం లేదు తాజాగా గ్రీన్‌లాండ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. "గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే చైనా, రష్యా దాన్ని స్వాధీన పరచుకుంటాయి. ఎట్టిపరిస్థితుల్లో అది నేను జరగనివ్వను". అని ట్రంప్ అన్నారు. గ్రీన్‌లాండ్ కోసం డెన్మార్క్‌తో ఒప్పందం చేసుకుంటాం. లేదా ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం అని పేర్కొన్నారు.
రష్యా, చైనా దేశాల సైనిక బలం ఏమిటో మీకు తెలుసు వారికి ప్రతిచోట సబ్‌మెరైన్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. వారి సైనిక శక్తిని మీరు తట్టుకోలేరు అని డెన్మార్క్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలనను డెన్మార్క్ ప్రధాని ఖండించారు. ఒకవేళ గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే అది 80 సంవత్సరాల ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందానికి భంగం కలిగించడమేనన్నారు.


