ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.
వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలన
| దేశం | సగటు వారపు పనిగంటలు | సగటు నెలవారీ వేతనం | గంటకు ఆదాయం |
|---|---|---|---|
| అమెరికా | 34 - 36 గంటలు | రూ.5,60,000 | రూ.4,100 |
| జర్మనీ | 34 - 35 గంటలు | రూ.4,50,000 | రూ.3,100 |
| జపాన్ | 38 - 40 గంటలు | రూ.3,10,000 | రూ.1,900 |
| చైనా | 46 - 48 గంటలు | రూ.1,40,000 | రూ.750 |
| భారతదేశం | 46 - 48 గంటలు | రూ.32,000 | రూ.170 |
గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.
అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి
అమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.
ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.
చైనాలో కూడా పనిగంటలు భారత్‌తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
భారత్‌లో ఎందుకీ పరిస్థితి?
భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్‌లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.
శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.
భారత్‌లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.
భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!


