హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
బిల్లులోని ముఖ్యాంశాలు
ప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.
20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.
వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?
ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: మీ స్మార్ట్‌వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా?


