డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 1,210 కోట్లు  | Dr. Reddys Q3 net declines 14 percent to Rs 1210 crore | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 1,210 కోట్లు 

Jan 22 2026 4:37 AM | Updated on Jan 22 2026 4:37 AM

Dr. Reddys Q3 net declines 14 percent to Rs 1210 crore

క్యూ3లో 14 శాతం తగ్గుదల 

రూ. 8,727 కోట్లకు ఆదాయం అప్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ నికర లాభం రూ. 1,210 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో నమోదైన రూ. 1,413 కోట్లతో పోలిస్తే 14 శాతం తగ్గింది. ఆదాయం రూ. 8,357 కోట్ల నుంచి రూ. 8,727 కోట్లకు చేరింది. 

కీలకమైన అమెరికా మార్కెట్లో లెనాలిడోమైడ్‌ విక్రయాలు నెమ్మదించడం, నిర్దిష్ట ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, కొత్త లేబర్‌ కోడ్‌ల అమలుకు సంబంధించి వన్‌–టైమ్‌ ప్రొవిజన్‌ చేయాల్సి రావడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు బుధవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ తెలిపింది. 

బ్రాండెడ్‌ వ్యాపారాలు మెరుగ్గా రాణించడం, ఫారెక్స్‌పరమైన సానుకూల ప్రయోజనాల వల్ల ఆ లోటు భర్తీ అయినట్లు కంపెనీ కో–చైర్మన్‌ జి.వి. ప్రసాద్‌ తెలిపారు. ప్రధాన వ్యాపార వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం మొదలైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, వ్యాపార భాగస్వాములకు దీర్ఘకాలికంగా మరింత విలువను చేకూర్చడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు.  

మరిన్ని ముఖ్యాంశాలు.. 
→ గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం నుంచి ఆదాయం 7 శాతం పెరిగి సుమారు రూ. 7,375 కోట్ల నుంచి రూ. 7,911 కోట్లకు పెరిగింది. కీలకమైన ఉత్తర అమెరికాలో ఆదాయం రూ. 3,383 కోట్ల నుంచి రూ. 2,964 కోట్లకు తగ్గింది. యూరప్‌ విక్రయాలు 1,209 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ. 1,447 కోట్లకు పెరిగాయి. ఇక భారత మార్కెట్లో అమ్మకాలు 19 శాతం వృద్ధితో రూ. 1,346 కోట్ల నుంచి రూ. 1,603 కోట్లకు చేరాయి. 

వర్ధమాన మార్కెట్లలో ఆదాయం సుమారు రూ. 1,436 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో 6, యూరప్‌లో 10, భారత్‌లో రెండు, వర్ధమాన మార్కెట్లలో 30 కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో కొత్త బ్రాండ్‌లను ఆవిష్కరించడం, ధరల పెరుగుదల, అధిక అమ్మకాలు మొదలైన అంశాలు మెరుగైన ఫలితాలకు దోహదపడ్డాయి.  

→ ఫార్మా సరీ్వసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం రూ. 822 కోట్ల నుంచి 2% క్షీణించి రూ. 802 కోట్లకు తగ్గింది.  

బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు ఒక్క శాతం క్షీణించి రూ. 1,155.50 వద్ద క్లోజయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement